తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్‌గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్‌లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి.
పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది.
రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్‌కు బీజింగ్‌లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం.
అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్‌కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.
తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్‌లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్‌లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది.
చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం.
ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి.
ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు.
వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్‌ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి.
చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు.
Comments
Please login to add a commentAdd a comment