
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది.
తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం.
ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.
నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్‌పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్‌ఎస్‌ఎస్‌లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్‌పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది.
చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.
జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు.
పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది.
చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.
వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది.
అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.
చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి.
జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి.
Comments
Please login to add a commentAdd a comment