కారాగారాల్లో అందరినీ సమానంగా చూడాల్సిందే
మూడు నెలల్లోగా జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలి
అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది.
కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది.
పని విషయంలో సమాన హక్కు ఉండాలి
‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు.
వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment