CrPC
-
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత మాగంటి బాబుకు మరోసారి షాక్ తగిలింది. పోలీసులపై దాడి కేసులో మాగంటి బాబుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, సెప్టెంబర్ 16వ తేదీన తన అనుచరులతో కలిసి మాగంటి బాబు హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్పై హంగామా చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి అంతుచూస్తానంటూ బహిరంగంగానే రెచ్చిపోయారు. దీంతో, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా నార్సింగి పోలీసులు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఘర్షణ జరిగిన రోజునే పోలీసులు.. మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇది కూడా చదవండి: అధికారంలో బీఆర్ఎస్ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్ -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరోసారి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?
దేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరి స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) కేసు తీర్పులో పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ జారీ చేసే విధానాన్ని సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆదేశించింది. అలాగే పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో సీఆర్పీసీలో తెల్పిన సెక్షన్ 41, 41ఏలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, గతంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు తీర్పులో తెల్పిన నిబంధనలను పాటించాలని పేర్కొంది. జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరా నికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశవ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకొని తగు ఆదేశాల ద్వారా వారికి రెండు వారాల్లో బెయిల్ మంజూరు చెయ్యాలని ఆదేశించింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు వ్యవస్థలోనే జరుగుతున్నవని గుర్తించి, అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. 2015లో ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసు తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్ స్టేషన్లలోనే జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్ ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతకుముందు 2014లో ‘అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ కేసు తీర్పులో... ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదే శించింది. సంబంధిత పోలీస్ అధికారులు సదరు కోర్టుతీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టుధిక్కార నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదే శించింది. కోర్టుల్లో కేసుల విచారణకు ఎక్కువ కాలం పట్టడం వల్ల నేరం చేసినవారూ, అమాయకులూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం. అలాగే పోలీసు వ్యవస్థ, కేసుల నమోదు ప్రక్రియ, కోర్టుల్లో విచారణ వంటివాటిపై ప్రాథమిక అవగాహన కల్పించే పాఠ్యాంశాలు విద్యలో భాగం కాకపోవడమూ మరోకారణం. అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ దిశలో చర్యలు తీసుకుని పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడాలి. (క్లిక్: ‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!) - కోడెపాక కుమారస్వామి సామాజిక కార్యకర్త -
ప్రత్యేక చట్టాలకూ సీఆర్పీసీ నిబంధనలు
సాక్షి, అమరావతి: నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్పీసీ)లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సెక్షన్ 41ఏ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ఐపీసీ నేరాలకు మాత్రమే కాకుండా ప్రత్యేక చట్టాలకు సైతం వర్తిస్తుందంటూ తీర్పునిచ్చింది. ఇందులో భాగంగానే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ చట్టం (ఎన్డీపీఎస్) కింద జరిగే నేరాలకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసే కేసులకు సీఆర్పీసీ 41ఏను వర్తింప చేయరాదన్న నిషేధం ఏదీ లేదంది. ఎన్డీపీఎస్ చట్టంలో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు, దర్యాప్తు అధికారులు నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. బెంగళూరుకు చెందిన కె.రంజిత్ వాహనంలో గంజాయి ప్యాకెట్లు దొరకడంతో చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అతడితోపాటు మరికొందరిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20(బీ(2)(సీ) కింద గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంజిత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. 25 ఏళ్లకు పొడిగించవచ్చు.. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వద్ద కేవలం 600 గ్రాముల గంజాయి మాత్రమే ఉందన్నారు. ఇలా స్వల్పంగా దొరికినప్పుడు నేరం నిర్ధారణ అయితే సెక్షన్ 20(బీ)(2)(ఏ) కింద ఏడాది మాత్రమే జైలుశిక్ష పడుతుందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనను పోలీసుల తరఫు రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వ్యతిరేకించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. దాన్ని 25 ఏళ్లకు సైతం పొడిగించవచ్చన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఎన్డీపీఎస్ చట్టం కింద పెట్టిన కేసులకు వర్తించదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. 1,000 గ్రాముల గంజాయి.. స్వల్ప పరిమాణం. 20 కిలోలు ఉంటే అది వాణిజ్య పరిమాణం. ప్రస్తుత కేసులో పిటిషనర్ వద్ద దొరికింది కేవలం 600 గ్రాములే కాబట్టి అతడిపై సెక్షన్ 20(బీ(2)(సీ) కింద కేసు సరికాదు. పిటిషనర్‌పై 20(బీ)(2)(ఏ) కింద మాత్రమే కేసు నమోదు చేయాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 4(2) ఇతర చట్టాల కింద నమోదైన కేసులను కూడా విచారించి తీరాలని చెబుతోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు.. ఏ రకంగా చూసినా ఎన్డీపీఎస్ చట్టం కింద ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు సీఆర్పీసీ నిబంధనలు వర్తిస్తాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా చేసే అరెస్టుల నుంచి పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సీఆర్పీసీ సెక్షన్ 41, 41ఏ ఉన్నాయి. పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన ఆ నిబంధనలు ప్రత్యేక చట్టాలకూ వర్తిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్ వాహనంలో 600 గ్రాముల గంజాయి దొరికినందున, అందుకు పడే శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ కాబట్టి అతడి విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నడుచుకోవాలి’ అని దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు. -
‘సెక్షన్ 107, 145 కింద ఎఫ్‌ఐఆర్‌లా? ’
సాక్షి, అమరావతి: అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నప్పుడు అనుమానిత వ్యక్తులు నిర్ణీత కాలానికి బాండ్ సమర్పించాలంటూ బైండోవర్ చేసే అధికారం సీఆర్పీసీ సెక్షన్ 107 కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్)కే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బైండోవర్ కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ 145 కింద భూమి, నీరు సంబంధిత వివాదాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న కారణంతో ఆయా వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్‌కు మాత్రమే సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఉందని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్లు 107, 145 కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా క్షేత్రస్థాయిలో పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అన్నీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఈమేరకు తగిన మార్గదర్శకాలతో సూచనలు చేయాలని స్పష్టం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గత వారం తీర్పు వెలువరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు తనపై సీఆర్పీసీ సెక్షన్ 107 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ బండి పరశురాముడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కాలంచెల్లిన చట్టాలో మార్పులు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో నేటికీ అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలతోపాటు ఇతర పురాతన చట్టాలను పునఃసమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) పరిధిలోని ఏడు విభాగాల పరిధిలో వివిధ చట్టాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షించి సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్మిక, తూనిక, కొలతలు, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, విద్యుత్, పురపాలన, వాణిజ్య పన్నుల విభాగాల పరిధిలో పాత చట్టాలను అధ్యయనం చేసి వాటి సరళీకరణతోపాటు ఆయా చట్టాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేయాలని సూచించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుండటంతో డీపీఐఐటీ కూడా కేంద్రం సూచించిన ఏడు విభాగాల పరిధిలోని చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను అధ్యయనం చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో 25 శాఖల పరిధిలో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం ఈ అధ్యయనాన్ని కేవలం కేంద్రం సూచించిన ఏడు విభాగాలకే పరిమితం చేయకుండా పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలకు వర్తింపచేయాలని ఆదేశించారు. పాత చట్టాలను అధ్యయనం చేయాల్సిన తీరు, వాటి సరళీకరణ, మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలపై డీపీఐఐటీకి చెందిన అధికారుల బృందం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రభుత్వ విభాగాలతో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 25 రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పౌర సేవలు సరళీకృతంగా అందించేందుకు అడ్డుగా ఉన్న చట్టాల్లోని నిబంధనలను గుర్తించడం, వాటికి చేయాల్సిన సవరణలను సూచించడం లక్ష్యంగా వర్క్‌షాప్‌లో కేంద్ర బృందం దిశానిర్దేశం చేసింది. చట్టాల్లోని నియమ నిబంధనలను సాకుగా చూపుతూ పౌర సేవలను అందించడంలో ఆలస్యాన్ని తొలగించేందుకు ఈ కసరత్తు దోహదం చేస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 31లోగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వ విభాగాల వారీగా ప్రణాళికను డీపీఐఐటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కేంద్ర అధికారుల బృందం గడువు విధించింది. ఈ నేపథ్యంలో డీపీఐఐటీ మార్గదర్శకాలకు అనుగుణంగా 25 రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో కసరత్తు ప్రారంభం కానున్నది. -
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్‌ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
పోలీసులకు ఆ అధికారం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: విచారణ సమయంలో నిందితుల స్థిరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ సెక్షన్ 102 ప్రకారం విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఇది చెల్లుబాటు కాదని ఇటీవల ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 102పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, సంజయ్ ఖన్నాల ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. విచారణ సమయంలో నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. -
భయంతో బెయిల్ పొందలేరు
సాక్షి, హైదరాబాద్: తనను అరెస్ట్ చేస్తారనే భయం లేదా అపోహలతో ముందస్తు బెయిల్ పొందలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదో జరిగిపోతుందనే భయంతో సీఆర్పీసీలోని 438 సెక్షన్ కింద ముందస్తు బెయిల్ పొందలేరని స్పష్టం చేసింది. కేసు నమోదయ్యాక అరెస్ట్ చేస్తారనే కారణాలు చూపినప్పుడే ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బెడిసికొట్టిన నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. సయ్యద్ మహబూబ్ అనే వ్యక్తి తన బంగారాన్ని కుదవపెట్టి రూ.4.15 లక్షలు, రూ.85 వేల నగదును కలిపి మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ ఖవీలకు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని మూడు నెలల్లో తిరిగి చెల్లించే వరకూ ప్రతి నెలా రూ.12,500 చొప్పున వడ్డీ ఇస్తామని చెప్పి తనను మోసం చేశారని మహబూబ్ ఆ ఇద్దరిపై చీటింగ్ (420)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు. సీఆర్పీసీ ప్రకారం పోలీసులు నోటీసు జారీ చేయడంతో వారిద్దరూ ముందస్తు బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించితే ఫలితం లేకుండా పోవడంతో.. హైకోర్టులో అప్పీల్ చేశారు. పంజాబ్, రాజస్తాన్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి ఉటంకిస్తూ, అరెస్ట్ చేస్తారని కచ్చితమైన కారణాలు చెప్పకుండా కేవలం భయం లేదా అపోహల కారణంగా ముందస్తు బెయిల్ మంజూరు పొందజాలరని హైకోర్టు తేల్చిచెప్పింది. వ్యాజ్యాల్ని తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. -
ఎన్నారై భర్తలపై కొరడా
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం... అక్కడ సొంత ఇల్లు, సొంత కారు–ఇలాంటి ఆకర్షణీయమైన కబుర్లు చెప్పి పెళ్లాడి, తీరా వెళ్లాక భార్యను శారీరకంగా, మాన సికంగా కష్టపెడుతున్న ప్రవాస భారతీయ (ఎన్నారై) యువకుల భరతం పట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లో అవసరమైన నిబంధనలు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. పెళ్లి చేసుకుని దేశంగాని దేశానికి కొత్తగా వెళ్లిన యువతులు అనుభవిస్తున్న కష్టాల గురించి దశాబ్దాలుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతక్రితం కలిగిన కుటుంబాలకే ఇలాంటి సమస్యలుండేవి. కానీ 90వ దశకం తర్వాత విదేశాల్లో లక్షలమందికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా ఉద్యోగావకాశాలు లభించడం పర్యవసానంగా మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా ఆ సమస్యలు తాకాయి. విదేశీ సంబంధమని మోజు పడి పెళ్లి చేసి పంపితే అక్కడ బాధల్లో కూరుకుపోతున్న కుమార్తెల విషయంలో ఏం చేయాలో తోచక వేలాదిమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. యువతుల్ని చిత్రహింసలపాలు చేయడం అర్ధాంతరంగా వెళ్లగొట్టడం రివాజైంది. మరికొందరు ఘనులు పెళ్లాడి ముచ్చట్లన్నీ తీర్చుకుని, కట్న కానుకలతో విదేశాలకు పోయి అక్కడినుంచి విడాకుల నోటీసులు పంపుతున్నారు. ఎన్నారైలకు ప్రాతినిధ్య ఓటింగ్ హక్కు కల్పించడానికి చాన్నాళ్లనుంచి మన ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మహిళల ఇబ్బందులపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. తాజా నిర్ణయంతో ఆ లోటు సరిదిద్దినట్టవుతుంది. మన విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలు విస్మయం కలిగిస్తాయి. 2015 జనవరి మొదలుకొని నిరుడు నవంబర్ వరకూ ఆ శాఖకు 3,328 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రతి 8 గంటలకూ ఒక ఫిర్యాదు వస్తున్నదని ఆ శాఖ వివరించింది. అంటే రోజుకు మూడు ఫిర్యాదులందుతున్నాయన్నమాట. అయితే బాధిత మహిళల అసలు సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. అన్ని దారులూ మూసుకుపోయాకే ఏ యువతి అయినా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తుంది. నిందితుల్లో 60 శాతం మంది యువకులని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లో ఎంతగా పురోగతి సాధించామనుకుంటున్నా మన దేశంలో మహిళలపై వేర్వేరు రూపాల్లో వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాలకు పోయే యువకులు తమతోపాటు ఈ కశ్మలాన్నంతటినీ మోసుకు పోతున్నారు. కుటుంబాల్లో యధావిధిగా తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శి స్తున్నారు. ఇక్కడిలాగే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆ దేశాల్లో సైతం మన మహిళలకు అవరోధంగా మారుతున్నాయి. వీటిని ధిక్కరించి ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితి. కొత్తగా కాపురానికెళ్లినవారికి ఇవన్నీ పెను అవ రోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్ అధి కారులకు సమస్యేమిటో అవగాహన కావడం కష్టమవుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగం చేసే మహిళ పరిస్థితి ఎంతో కొంత మెరుగు. ఆమె స్వతంత్రంగా జీవనం సాగిస్తూ సమస్యలపై పోరాడగలదు. కానీ హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న ఆడపిల్లలది దుర్భరస్థితి. వారు తప్పనిసరిగా భర్త సంపాదనపైనే ఆధారపడాలి. ఇక్కడ పెళ్లాడటం, అక్కడికెళ్లాక ఆ దేశాల్లోని విడాకుల చట్టం ప్రకారం వదుల్చు కోవడం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అక్కడేం చేసినా అడిగే దిక్కుండదు... అత్తింటివారికి తెలియకుండా భారత్ వచ్చి దర్జాగా తిరిగి వెళ్లొచ్చునన్న భరోసా ఎన్నారై యువకుల్లో ఉంటున్నది. సీఆర్పీసీలో మార్పులు తీసుకురావాలన్న తాజా నిర్ణయం వల్ల ఇకపై ఇది అసాధ్యమవుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భార్యలను విడిచిపెట్టిన కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే సమన్లను వరసగా మూడుసార్లు బేఖాతరు చేసి నట్టయితే అలాంటివారిని ‘పరారీలో ఉన్న వ్యక్తులు’గా పరిగణించి వారి ఆస్తుల్ని, వారి తల్లిదండ్రుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాలు ఆదే శాలివ్వొచ్చు. దీంతోపాటు విదేశాంగ శాఖ వెబ్సైట్లో పెట్టే సమన్లకు చట్టబద్ధత కల్పించడానికి అనువుగా సీఆర్పీసీ నిబంధనలను సవరించాలని కేంద్ర హోం శాఖను విదేశాంగ శాఖ కోరింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ మార్పు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించినవారి ఇంటి తలుపుపైనో, గోడపైనో ఆ సమన్లను అతికిస్తే చట్టం దృష్టిలో ఆ సమన్లు వారికి అందినట్టే. ఇప్పుడు వెబ్సైట్లో ఉంచే నోటీసులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేయడం మంచి ఆలోచన. అలా మూడుసార్లు వెబ్సైట్లో పెట్టాక నిందితుల ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలవుతుంది. చూడటానికిది మొత్తంగా ‘ఎన్నారై వధువుల’ సమస్యేగానీ ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. కేవలం భార్య ద్వారా సంక్రమించే ఆస్తిపై కన్నేసి కొందరు, ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడానికి ఇంకొందరు, జీతం ఇవ్వనవసరం లేని పనిమనిషిగా భావించి మరికొందరు యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. పంజాబ్ నుంచి అయ్యే పెళ్లిళ్లలో 80 శాతం ఈ బాపతేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, గృహ హింసకు పాల్పడేవారిని, భార్యల్ని విడిచిపెట్టేవారిని అప్పగించేందుకు విదేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, అందుకొక ప్రత్యేక వెబ్సైట్ పెట్టడం వంటి చర్యలు కూడా చాలా అవసరం. సంబంధం కుదుర్చుకోవడానికి ముందు అవతలి వ్యక్తి ఇచ్చిన సమాచారంలోని నిజా నిజాలేమిటో నిర్ధారించుకోవడం అవసరమన్న చైతన్యం అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలగజేయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇవన్నీ సాకారమైనప్పుడే పెళ్లి చేసి పంపిన మన ఆడపిల్లలు విదేశాల్లో క్షేమంగా, హుందాగా, గౌరవప్రదంగా బతక గలుగుతారు. -
‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా?
న్యూఢిల్లీ : భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అనే విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. స్వలింగ సంపర్కంపై భారత్‌లో బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి నిషేధం ఉంది. బ్రిటిష్ వారు 1861లో రూపొందించిన క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీఆర్పీసీ) సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. అయితే, 2013లో స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా కొత్త చట్టాలు రూపొందించడం పార్లమెంటు పని అని పేర్కొంది. అప్పటివరకూ స్వలింగ సంపర్కం నేరమేనంటూ తీర్పునిచ్చింది. 2013లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం పేర్కొంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. ప్రకృతికి విరుద్ధంగా సంపర్కం జరపడాన్ని నేరంగా పరిగణిస్తున్న సీఆర్పీసీలోని సెక్షన్ 377ను సమీక్షించాలని విస్తృత ధర్మాసనంలోని జడ్జిలను కోరింది. కేవలం లింగ పరమైన కారణాలతో ఓ వ్యక్తి తన జీవితాన్ని భయంతో గడపాలా? అనే ప్రశ్నను బెంచ్ లేవనెత్తింది. ‘ఒకరికి సహజంగా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చ’ని ఈ సందర్భంగా ముగ్గురు జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం పట్ల ధోరణి మారుతుండటంతో గే సెక్స్‌ను నేరంగా పరిగణించాలని ప్రభుత్వం కూడా భావించడం లేదని సమాచారం. -
‘గాడ్సే’లకూ ఉంది వాక్ స్వేచ్ఛ
విశ్లేషణ రాజకీయ కారణాలతో గాంధీని చంపక తప్పలేదని గాడ్సేలు చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన పని లేదు. కానీ అంగీకారయోగ్యం కానంత మాత్రాన ఆ అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదు. వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. హత్యానేర నిందితులకు కూడా ఈ హక్కు ఉంటుంది. దోషులని రుజువై, శిక్ష అనుభవించిన వారైనా తాము చేసిన హత్య గురించి వివరిస్తూ పుస్తకాలు రాసు కోవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ హంతకులకు సైతం ఈ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా నిందితుడికి సమాచార స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుంది. నిందితుడికి అన్నీ తెలియాలి. ఆ తరువాత అతను ఏదైనా చెప్పకునే అవకాశం ఇవ్వాలి. సెక్షన్ 313 కింద ఆ అవకాశం ఉంది. కోర్టులో జడ్జి అడిగిన ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే శిక్ష పడదు. ఇష్టం వచ్చి నంత సేపు దోషి తన సంజాయిషీని చెప్పుకోవచ్చు. తాను గాంధీని ఎందుకు చంపవలసి వచ్చిందో వివ రిస్తూ నాథూరాం గాడ్సే కొన్ని గంటలపాటు వాంగ్మూ లం ఇచ్చాడు. నేరం రుజువై ఉరిశిక్షకు గురై అతడు చని పోయాడు. అతని తమ్ముడు గోపాల్ గాడ్సే నేరం కూడా రుజు వైంది. కొన్నేళ్ల జైలు శిక్ష తదుపరి విడుదలైనాక అతను తన అన్న నాథూరాం గాడ్సే వాంగ్మూలాన్ని, ఇతర విమ ర్శలను కలిపి ‘గాంధీ హత్య–నేను’ పేరుతో మరాఠీలో ఒక పుస్తకం ప్రచురించాడు. సెక్షన్ 99 ఏ (సీఆర్పీసీ) కింద భద్రతకు భంగం కలిగించే రచనలను నిరోధించే అధికారం ఉందని, ఈ పుస్తకం హిందువులు, ముస్లింల మధ్య ద్వేషాన్ని రగులుస్తుందని అంటూ 1967లో ప్రభుత్వం ఈ పుస్తక ప్రతులన్నిటినీ స్వాధీనం చేసు కోవాలని ఆదేశించింది. సెక్షన్ 99 ఏ రాజ్యాంగ వ్యతి రేకమని, ఆ సెక్షన్ కింద జారీచేసిన ఈ ఉత్తర్వు వాక్ స్వాతంత్య్రానికి భంగకరమనీ కనుక దాన్ని రదు ్దచేయా లని బొంబాయి హైకోర్టులో గోపాల్ వినాయక్ గాడ్సే భారత ప్రభుత్వంపై ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు (ఎఐఆర్ 1971 బాంబే 56లో ఈ తీర్పు ప్రచురించారు). వాక్ స్వాతంత్య్రానికి హామీ ఇచ్చే రాజ్యాంగ అధి కరణం 19(1)(ఏ) పైన పరిమితులను 19(2) వివరిం చింది. అందులో నిర్దేశించిన ఆధారాలపై పార్లమెంటు చట్టం ద్వారా వాక్ స్వాతంత్య్రంపైన పరిమితులు విధిం చవచ్చునని పేర్కొన్నది. సామాజిక శ్రేయస్సు కోసం సీఆర్పీసీ సవరణ చట్టం ద్వారా ఈ పరిమితిని విధిం చడం రాజ్యాంగబద్ధమే అని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. సెక్షన్ 99 ఏ రాజ్యాంగబద్ధమే అయినా, గోపాల్ గాడ్సే పుస్తకాన్ని నిషేధించడం చెల్లదని ఆదేశిం చింది. ఐపీసీ సెక్షన్ 153 ఏ కింద ఇరు మతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రాణాలకు ముప్పు తెచ్చే రచనలు చేయడానికి వీల్లేదని అడ్వకేట్ జనరల్ వాదిం చారు. గాంధీ హంతకులను గొప్పగా చూపుతూ, గాంధీతో సమానమైన కీర్తిని గాడ్సేకు ఆపాదిస్తూ, హత్యను సమర్థించుకునే ఈ పుస్తకం సమాజానికి ప్రమా దకరమనీ, కొత్తతరాల మనసుల్లో గాంధీ హత్యను సమర్థించే తప్పుడు అభిప్రాయాల్ని కల్గించడం కోసం ఇది ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని నిరోధించడం సమాజ శ్రేయస్సు రీత్యా అవసరం అని ఆయన నివేదించారు. గాడ్సే పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదింపచేసి, న్యాయమూర్తులు దాన్ని కూలంకషంగా పరిశీలించారు. దాని మూల కథనాన్ని, విమర్శను, సమకాలీన చారిత్రిక అంశాలను, హిందూ తత్వంపై వ్యాఖ్యలను లోతుగా అధ్యయనం చేసారు. ఇదొక తీవ్రమైన విమర్శే అయినా, ఆ పుస్తకం ప్రస్తుతం హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని తమకు అనిపించడం లేదని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. కలహాలు సృష్టించడమే రచయిత ఉద్దేశం అనిపించడం లేదన్నారు. గాంధీని ఒక మత పిచ్చివాడెవడో హత్య చేశాడనే అభిప్రాయం పోగొట్టి, ఇది గాంధీ సాగించిన వ్యవహారాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే హత్యనీ, రాజకీయ కారణాల రీత్యా గాంధీని చంపడం తప్ప మరో రకంగా ఆయన నిర్ణయాలను ఆపే మార్గం లేదని భావించి హత్య చేయవలసి వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం ఈ పుస్తకం చేసిందనీ హైకోర్టు వివరించింది. ముస్లింలను విపరీతంగా బుజ్జగిస్తూ గాంధీ తీసుకున్న నిర్ణయాల వల్ల హిందూ వర్గాలకు తీవ్రమైన హాని జరుగుతుందని రచయిత నమ్మారు. పాకిస్తానీ తెగల వారు కశ్మీర్‌పై దాడులు చేయడం వల్ల, ఆ దేశానికి రూ. 55 కోట్లు చెల్లించాలన్న ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం లేదని మొత్తం మంత్రివర్గం ఆమోదించినా... గాంధీ నిరాహార దీక్ష చేసి, పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు ఇప్పించారనీ, ఈ విధంగానే వ్యవహరిస్తూపోతే దేశానికి నష్టం కనుక ఒక దేశ భక్తునిగా గాడ్సే అర్జునుడి వలె గాంధీని చంపక తప్పలేదనీ వారు సమర్థించుకునే ప్రయత్నం చేశారని హైకోర్టు అంది. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదనీ, అలాగే అంగీకార యోగ్యం కానంత మాత్రాన అభిప్రాయం చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదనీ, కనుక పుస్తకంపై నిషేధం చెల్లదనీ అంటూ బొంబాయి హైకోర్టు ఆ పుస్త కాలను స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వును కొట్టి వేసింది. నాథూరాం గాడ్సే వాంగ్మూలంతోపాటు, ఇంకా ఎన్నో విమర్శలున్న పుస్తకంపైనే అభ్యంతరాలు చెల్లవన్న తరువాత... కోర్టులో గాడ్సే చేసిన ప్రకటనను వెల్లడి చేయడంపై అభ్యంతరాలకు తావే లేదు. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కొత్త బెయిల్ ప్రతిపాదనకు స్వస్తి
న్యూఢిల్లీ: బెయిల్ మంజూరుకు కొన్ని నిబంధనలతో కొత్త చట్టం తీసుకురావాలని ఏడాది క్రితం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. నేరశిక్షాస్మృతి(సీఆర్పీసీ)కి సవరణలు చేస్తే బెయిల్ మంజూరులో ప్రతిబంధకాలు తొలగిపోతాయని, కొత్త చట్టం అవసరం లేదని భావిస్తోంది. ఒక హక్కుగా బెయిల్ ఇవ్వాలని, నిందితుడు సాక్ష్యాలను తారుమారుచేసి, మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముంటేనే నిరాకరించాలని పేర్కొంటూ కొత్త చట్టం తేవాలని న్యాయ కమిషన్ చెప్పింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించిన ప్రభుత్వం కొత్త చట్టం అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపింది. -
సీఆర్పీసీకి సవరణలు చేయాలి
తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టానికి (సీఆర్పీసీ) సవరణలు చేయడంతోపాటు, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి నేతృత్వంలో శనివారం రాష్ట్ర కార్యవర్గం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో సమావేశమైంది. సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ సవరణలతో ఏడేళ్లలోపు శిక్షపడే నేరాల్లో నిందితులకు పోలీస్‌స్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేస్తున్నారని, దీంతో నిందితులకు చట్టవ్యవస్థపై భయంలేకుండా పోతోందని కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులుంటే బెయిల్ వస్తుందనే అభిప్రాయంతో కొందరు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమన్నారు. బెయిల్ కోసం కోర్టులను మాత్రమే ఆశ్రయించేలా సీఆర్పీసీకి సవరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరనున్నామన్నారు.