
సాక్షి, అమరావతి: అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నప్పుడు అనుమానిత వ్యక్తులు నిర్ణీత కాలానికి బాండ్ సమర్పించాలంటూ బైండోవర్ చేసే అధికారం సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్)కే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బైండోవర్ కేసుల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ 145 కింద భూమి, నీరు సంబంధిత వివాదాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న కారణంతో ఆయా వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కూడా వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
తహసీల్దార్‌కు మాత్రమే సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఉందని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్లు 107, 145 కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా క్షేత్రస్థాయిలో పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అన్నీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఈమేరకు తగిన మార్గదర్శకాలతో సూచనలు చేయాలని స్పష్టం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గత వారం తీర్పు వెలువరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు తనపై సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ బండి పరశురాముడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment