సాక్షి, అమరావతి: నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్‌పీసీ)లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సెక్షన్ 41ఏ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ఐపీసీ నేరాలకు మాత్రమే కాకుండా ప్రత్యేక చట్టాలకు సైతం వర్తిస్తుందంటూ తీర్పునిచ్చింది. ఇందులో భాగంగానే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ చట్టం (ఎన్‌డీపీఎస్) కింద జరిగే నేరాలకు కూడా సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదు చేసే కేసులకు సీఆర్‌పీసీ 41ఏను వర్తింప చేయరాదన్న నిషేధం ఏదీ లేదంది.
ఎన్‌డీపీఎస్ చట్టంలో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు, దర్యాప్తు అధికారులు నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. బెంగళూరుకు చెందిన కె.రంజిత్ వాహనంలో గంజాయి ప్యాకెట్లు దొరకడంతో చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అతడితోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20(బీ(2)(సీ) కింద గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంజిత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.
25 ఏళ్లకు పొడిగించవచ్చు..
పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వద్ద కేవలం 600 గ్రాముల గంజాయి మాత్రమే ఉందన్నారు. ఇలా స్వల్పంగా దొరికినప్పుడు నేరం నిర్ధారణ అయితే సెక్షన్ 20(బీ)(2)(ఏ) కింద ఏడాది మాత్రమే జైలుశిక్ష పడుతుందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనను పోలీసుల తరఫు రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వ్యతిరేకించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. దాన్ని 25 ఏళ్లకు సైతం పొడిగించవచ్చన్నారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఎన్‌డీపీఎస్ చట్టం కింద పెట్టిన కేసులకు వర్తించదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం.. 1,000 గ్రాముల గంజాయి.. స్వల్ప పరిమాణం. 20 కిలోలు ఉంటే అది వాణిజ్య పరిమాణం. ప్రస్తుత కేసులో పిటిషనర్ వద్ద దొరికింది కేవలం 600 గ్రాములే కాబట్టి అతడిపై సెక్షన్ 20(బీ(2)(సీ) కింద కేసు సరికాదు. పిటిషనర్‌పై 20(బీ)(2)(ఏ) కింద మాత్రమే కేసు నమోదు చేయాలి. సీఆర్‌పీసీలోని సెక్షన్ 4(2) ఇతర చట్టాల కింద నమోదైన కేసులను కూడా విచారించి తీరాలని చెబుతోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు..
ఏ రకంగా చూసినా ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు సీఆర్‌పీసీ నిబంధనలు వర్తిస్తాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా చేసే అరెస్టుల నుంచి పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సీఆర్‌పీసీ సెక్షన్ 41, 41ఏ ఉన్నాయి. పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన ఆ నిబంధనలు ప్రత్యేక చట్టాలకూ వర్తిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్ వాహనంలో 600 గ్రాముల గంజాయి దొరికినందున, అందుకు పడే శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ కాబట్టి అతడి విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నడుచుకోవాలి’ అని దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు.
ప్రత్యేక చట్టాలకూ సీఆర్‌పీసీ నిబంధనలు
Published Tue, Oct 12 2021 5:00 AM | Last Updated on Tue, Oct 12 2021 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment