marijuana smuggling
-
కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని గోహ్నియా గ్రామానికి చెందిన పివేస్ అలియాస్ ప్రైవేష్ బతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఐడీపీఎల్ బాలానగర్‌కు వలస వచ్చాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభా నగర్లో కిరాణాష్ కొట్టు పెట్టాడు. ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో తన స్వస్థలమైన యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొస్తున్నాడు. వీటిని స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు కిరాణా కొట్టులో ఆకస్మిక తనిఖీలు చేయగా.. 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లు లభించాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గంజాయి ఆరోపణలు.. వీడియోగ్రాఫర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: యువకుడిపై గంజాయి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై డెత్‌నోటు రాసి పెట్టి ఉరి వేసుకొన్నాడు. మృతుడు అభిషేక్ (23) వీడియోగ్రాపర్గా పనిచేసేవాడు. స్నేహితునికి ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవాలని అభిషేక్ అక్కడికి వెళ్ళిన సమయంలో కొందరు గంజాయి తాగుతుండగా పోలీసులు వచ్చి అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నీవు కూడ గంజాయి తాగుతావా అని అభిషేక్‌ని ప్రశ్నించారు. తాగలేదని చెప్పడంతో ఇంటికి పంపించారు. విచారణకు అవసరమైతే మళ్లీ రావాలని సూచించారు. ఈ సంఘటనతో తీవ్రంగా మథనపడ్డాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కానీ ఇలాంటి ఆరోపణలు రావడం భయంగా ఉందని, ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించానని, కానీ ఎలాంటి తప్పు చేయకున్నా గంజాయి తాగినట్లు పట్టుకుని వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ మేరకు సుసైడ్ లెటర్ రాసి ఉరి చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అశోకపురం పోలీసులు పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి దందాకు ఉమ్మడి బ్రేక్
సాక్షి, అమరావతి: సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘాను పటిష్టం చేస్తోంది. మొదటిదశగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో రెండురాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణ చేపట్టారు. దేశంలో ఇలా గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తరువాత దశల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడా ఉమ్మడి కార్యాచరణను విస్తరించాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా రాష్ట్రంలో గంజాయి సాగును దాదాపుగా ధ్వంసం చేసినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయిని రవాణా చేసేందుకు మన రాష్ట్ర భూభాగాన్ని గేట్వేగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ పోలీసు శాఖ ఒడిశా పోలీసులతో కలిసి కొన్ని నెలల కిందటే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ/ఓఎస్డీ, డీఎస్పీలు, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి, జైపూర్ జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఒడిశాలో గంజాయి సాగును శాసిస్తున్న ముఠాల వివరాలను కూడా ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర పోలీసులకు అందించారు. ఏపీ పోలీసులు ఇచ్చిన 38 మంది గంజాయి స్మగ్లర్ల వివరాల మేరకు ఆయా గ్రామాల్లో ఒడిశా ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. మరోవైపు రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులను భాగస్వాములుగా చేసుకుని నిఘాను పటిష్టం చేశారు. ప్రధానంగా ఒడిశాలోని చిత్రకొండ, జోలాపుట్, మల్కనగిరి ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి అనుసంధానించే ప్రధాన రహదారులతోపాటు ఇతర మార్గాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ఆ మార్గాల్లో ఇప్పటికే అటు ఒడిశా, ఇటు ఏపీ వైపు కొత్తగా ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒడిశా వైపు చిత్రకొండ, సుకుమా, జోలాపుట్, పడువ, సిమిలిగూడల్లో ఒడిశాకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సీలేరు, డొంకరాయి, మారేడుమిల్లి, రంపచోడవరం, గోకవరం, మోతుగూడేల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) బృందాలు తనిఖీలు విస్తృతం చేశాయి. త్వరలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో కలిసి.. ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులతో కూడా కలిసి త్వరలో కార్యాచరణ చేపట్టాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది. అందుకోసం ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖతో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించింది. త్వరలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు చర్చించనున్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతంగా నిర్వహించిన తీరును ఎన్సీబీ నిశితంగా పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యూహాన్ని అనుసరించమని ఇతర రాష్ట్రాలకు సూచించింది కూడా. గంజాయి ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో త్వరలో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. -
ఏజెన్సీ టు ఢిల్లీ.. వయా కందుకూరు
కందుకూరు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.10 లక్షల విలువజేసే 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్ వృత్తిరీత్యా సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసేవాడు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. దేశ రాజధాని ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఆపరేషన్ పరివర్తన్’.. గంజాయి సరఫరాకు ఇక చెక్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘‘గంజాయి సరఫరాకు ఇప్పటికే కళ్లెం వేశాం. ఆ మహమ్మారి సమూల నిర్మూలన అసాధ్యమేమీ కాదు. సర్వత్రా కట్టడి కష్టమూ కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఆ దిశగా నిరంతరాయంగా పటిష్ట చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల యత్నాలకు అన్నిస్థాయిల్లో తమవంతుగా ప్రజలూ స్పందించి సహకరిస్తే గంజాయితోపాటు మాదకద్రవ్యాలను సమాజం నుంచి పారదోలవచ్చు. వీటి బారి నుంచి విద్యార్థులు, యువతను దూరంగా ఉంచి భవితకు భరోసా ఇవ్వవచ్చు’’ అని చెప్పారు దక్షిణ కోస్తా డీఐజీ త్రివిక్రమ వర్మ. గంజాయ్ గెటవుట్... పోలీస్ టార్గెట్ అనే నినాదంతో పనిచేస్తున్నామని, గంజాయి నియంత్రణ విషయంలో ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధ్యమయ్యాయని, గంజాయి ధ్వంసం, స్వాధీనం, కేసుల నమోదు, అరెస్టులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనాలని డీఐజీ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పట్టుబడితే అంతే సంగతులు గంజాయి, మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలి. వాటిని ఉత్పత్తి చేసినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా, కొనుగోలుకు సహకరించినా, అక్రమ వ్యాపార లావాదేవీలకు ఆర్థిక సహాయం చేసినా, నిల్వ పెట్టుకున్నా, తమ స్థలాల్లో నిల్వకు అనుమతించినా చట్టరీత్యా నేరం. వారెంట్ లేకున్నా అరెస్టు చేయవచ్చు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్(ఎన్డీపీఎస్) యాక్ట్–1985 ప్రకారం నేర తీవ్రతను బట్టి ఏడాది నుంచి ఇరవయ్యేళ్ల వరకు శిక్ష ఖరారు కావచ్చు. అక్రమంగా వ్యాపారం చేయడం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సీజ్ కూడా చేయవచ్చు. ‘ఆపరేషన్ పరివర్తన్’తో గంజాయి ఉత్పత్తికే చెక్ గంజాయి నియంత్రణపై చర్యలకన్నా అసలు దాని ఉత్పత్తే లేకుండా చేయగలిగితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో విభిన్న శాఖల సహకారంతో ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించి సత్ఫలితాలను సాధిస్తోంది. గిరిజనులే స్వచ్ఛందంగా గంజాయి సాగుకు తిలోదకాలు ఇస్తున్నారు. అవగాహన సదస్సులతో గిరిజనుల్లో అధికారులు చైతన్యం తీసుకొస్తున్నారు. దేశంలోనే ఎన్నడూ.. ఎక్కడా జరగని రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే రోజున రూ.300 కోట్లకు పైగా విలువ చేసే రెండు లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేయడం రికార్డు. సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమిది.. అటవీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని సమూలంగా లేకుండా చేయడంలో భాగంగా గిరిజనులకు లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికను రూపొందింపజేశారు. మూడేళ్లలో రూ.144 కోట్లతో విభిన్న ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. వేలాది మంది గిరిజనులకు లక్షల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిచ్చి వారికి యాజమాన్య హక్కులు కలి్పంచి శాశ్వత జీవనోపాధికి బాటలు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో గంజాయికి చెక్ పెడుతున్నారు. ఏపీ నుంచి సరఫరా అనేది ఒకప్పటి మాట.. దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ నుంచి గంజాయి సరఫరా అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేనే లేవు. ఎస్ఈబీ, పోలీసులు తీసుకుంటున్న చర్యలు గంజాయి నియంత్రణకు బాగా ఉపకరిస్తున్నాయి. రెండేళ్ల కిందట చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో వచ్చిన అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించి ఆపాదించడం ఏమాత్రమూ సరికాదు. రాష్ట్రంలో 2020లో 650 కేసులు, 2021లో 2,200 కేసులు నమోదయ్యాయి. అలాగే 2020లో 90 వేల కిలోలు, 2021లో 2.31 లక్షల కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నాం. మేం తీసుకున్న చర్యలకు ఇవే నిదర్శనాలు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘ఆపరేషన్ నయా సవేరా’.. గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘ఆపరేషన్ నయా సవేరా’ పేరిట పైలెట్ ప్రాజెక్టును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రత్యేకంగా చేపట్టింది. ఎస్ఈబీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు రెండు జిల్లాల్లో గత ఏడాది మార్చి 25– 31 తేదీల మధ్య దాడులు నిర్వహించి 33 కేసులు నమోదుచేసి 56 మందిని అరెస్టు చేసి వారి నుంచి 78.7 కిలోల గంజాయితో పాటు 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్ డ్రగ్స్) స్వా«దీనం చేసుకుంది. -
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
ఒంగోలు: రెండు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తరలిస్తున్న కేసులో కీలక నిందితుడు మలిపెద్ది సాయిరాఘవ అలియాస్ సోనును అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ సూపరింటెండెంట్ అవులయ్య తెలిపారు. ఒంగోలు ఎస్ఈబీ కార్యాలయంలో ఆదివారం నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ గరికపాటి బిందుమాధవ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది ఈ నెల 18న స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గుజ్జు విజయశివభార్గవరెడ్డిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. అతనిని విచారించగా ఈ కేసులో బెంగళూరుకు చెందిన ఆంటోనీ, వైజాగ్‌కు చెందిన సోనులు కీలక పాత్రధారులుగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది వైజాగ్ వెళ్లి మలిపెద్ది సాయిరాఘవ అలియాస్ సోనును అరెస్టు చేసి విచారించగా.. 2019లో వైజాగ్‌లో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ గంజాయి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడుగా తేలిందన్నారు. సోనును రిమాండ్‌కు తరలించినట్టు అవులయ్య వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అసిస్టెంట్ ఎన్ఫోర్సుమెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, ఒంగోలు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ లత తదితరులున్నారు. -
కన్నపేగు కారాగారంలో.. పిల్లలు పాట్నాకు
పర్లాకిమిడి (ఒడిశా): పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్‌లో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఖైదీ పిల్లలను గజపతి జిల్లా అధికారులు వారి స్వగ్రామం పాట్నాకు బుధవారం తరలించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పాట్నాకు చెందిన వివాహిత ఇటీవల మోహానా వద్ద పోలీసులకు పట్టుబడింది. ఆమెను అరెస్టు చేసి, పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆమెతో పాటే 5, 7 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలను కూడా కారాగారానికే తరలించడంపై జిల్లా శిశు సంరక్షణ సమితి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికలను జైలులో ఉంచకుండా వారి స్వగ్రామానికి తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ లింగరాజ్ పండా, ఎస్పీ జయరాం శత్పథి సూచనల మేరకు పిల్లలిద్దరినీ పాట్నా తీసుకొని వెళ్తేందుకు డీసీపీయూ కార్యాలయానికి చెందిన నరేష్కుమార్ నాయక్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను వెంట పంపించారు. వారంతా పర్లాకిమిడి నుంచి పయనమై వెళ్లారు. చదవండి: (మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!) -
ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ‘తరలింపు’లో పోలీసుల నిర్లక్ష్యం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. ‘మిగిలిపోయిన’ గంజాయిని సొంతం చేసుకున్న అతగాడు స్థానికంగా విక్రయించాడు. ఇలా ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడంలో కథ మొత్తం బయటకు వచ్చింది. ఈ ‘గమ్మత్తు’ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డుపై రెండు కేసులు నమోదు కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్‌నగర్ పోలీసులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. చదవండి: HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్ ఠాణాకు మరమ్మతులు జరుగుతుండడంతో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్నాళ్లుగా పోలీసులు గంజాయిపై జంగ్ చేస్తున్నారు. ఫలితంగా వరుసగా విక్రేతలు, వినియోగదారులు పట్టుబడుతున్నారు. ఇటీవల హయత్‌నగర్ పోలీసులు ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న 9 కేజీల గంజాయిని కోర్టు ఆదేశాలతోనే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కచ్చితంగా దర్యాప్తు అధికారులు ఆ సరుకును తమ అధీనంలో ఉంచుకోవాలి. సాధారణంగా పోలీసులు ఇలా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఠాణాలోనే ఉంచుతారు. ఆ సమయంలో పోలీసుస్టేషన్‌కు మరమ్మతులు జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ గోదాంలో భద్రపరిచారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..! తరలింపులో నిర్లక్ష్యం.. ఠాణాకు మరమ్మతులు పూర్తయిన తర్వాత పోలీసులు ఈ గంజాయిని తీసుకురావచ్చారు. ప్యాకెట్లలో ఉన్న గంజాయిని తీసుకువచ్చిన బృందం వాటి కింద పరిచిన కార్పెట్ కింద పడిపోయిన దాన్ని పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే సదరు గోదాం సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. గోదాం శుభ్రం చేసే నెపంతో అక్కడ పడిన గంజాయిని అతడు సొంతం చేసుకున్నాడు. దాన్ని తన వద్దే భద్రపరిచి, స్థానికంగా కొందరికి విక్రయించాడు. విడతల వారీగా జరిగిన ఈ విక్రయంపై హయత్‌నగర్ పోలీసులకే సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఖరీదు చేసిన వారిని, వారి ద్వారా సదరు సెక్యూరిటీ గార్డును పట్టుకున్నారు. నిర్లక్ష్యం బయటకు... కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు జిల్లాలకు గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి సరఫరా అవుతోంది. ఈ సెక్యూరిటీ గార్డుకు గంజాయి అలానే చేరిందని పోలీసులు భావించారు. విచారణ నేపథ్యంలోనే తమ నిర్లక్ష్యం బయటపడింది. తాము భద్రపరిచిన గంజాయిలో కొంత భాగం చోరీ చేయడంపై దొంగతనం కేసు, ఆ సరుకును విక్రయించడంపై మాదకద్రవ్యాల చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును హయత్‌నగర్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు. ఈ ‘గమ్మత్తు’ కథ మొత్తం తెలుసుకున్న ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సీజ్ చేసిన గంజాయి నిల్వ, తరలింపులో నిర్లక్ష్యంగా ఉన్న హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎం.సురేందర్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు చార్జి మెమోలు జారీ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారని సమాచారం. -
టీడీపీ హయాంలో డ్రగ్స్ మాఫియా కనిపించలేదా..?
సాక్షి, విశాఖ జిల్లా: టీడీపీ కష్టాల్లో వున్నప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ తెరపైకి వస్తారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో విశాఖ డ్రగ్స్ మాఫియా కనిపించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు జరిగినట్లు అప్పటి మంత్రి గంటానే అంగీకరించారన్నారు. (చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా) టీడీపీ హయాంలో భారీగా గంజాయి అమ్మకాలు: కరణం ధర్మశ్రీ విశాఖలో గంజాయి తాగేవాళ్లే లేరని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇవ్వగానే పవన్ డ్రగ్స్‌పై ట్వీట్ పెట్టాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే భారీగా గంజాయి అమ్మకాలు జరిగాయన్నారు. చదవండి: పచ్చదళం దుష్ప్రచారం -
ప్రత్యేక చట్టాలకూ సీఆర్పీసీ నిబంధనలు
సాక్షి, అమరావతి: నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్పీసీ)లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సెక్షన్ 41ఏ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ఐపీసీ నేరాలకు మాత్రమే కాకుండా ప్రత్యేక చట్టాలకు సైతం వర్తిస్తుందంటూ తీర్పునిచ్చింది. ఇందులో భాగంగానే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ చట్టం (ఎన్డీపీఎస్) కింద జరిగే నేరాలకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసే కేసులకు సీఆర్పీసీ 41ఏను వర్తింప చేయరాదన్న నిషేధం ఏదీ లేదంది. ఎన్డీపీఎస్ చట్టంలో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు, దర్యాప్తు అధికారులు నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. బెంగళూరుకు చెందిన కె.రంజిత్ వాహనంలో గంజాయి ప్యాకెట్లు దొరకడంతో చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అతడితోపాటు మరికొందరిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20(బీ(2)(సీ) కింద గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంజిత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. 25 ఏళ్లకు పొడిగించవచ్చు.. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వద్ద కేవలం 600 గ్రాముల గంజాయి మాత్రమే ఉందన్నారు. ఇలా స్వల్పంగా దొరికినప్పుడు నేరం నిర్ధారణ అయితే సెక్షన్ 20(బీ)(2)(ఏ) కింద ఏడాది మాత్రమే జైలుశిక్ష పడుతుందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనను పోలీసుల తరఫు రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వ్యతిరేకించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. దాన్ని 25 ఏళ్లకు సైతం పొడిగించవచ్చన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఎన్డీపీఎస్ చట్టం కింద పెట్టిన కేసులకు వర్తించదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. 1,000 గ్రాముల గంజాయి.. స్వల్ప పరిమాణం. 20 కిలోలు ఉంటే అది వాణిజ్య పరిమాణం. ప్రస్తుత కేసులో పిటిషనర్ వద్ద దొరికింది కేవలం 600 గ్రాములే కాబట్టి అతడిపై సెక్షన్ 20(బీ(2)(సీ) కింద కేసు సరికాదు. పిటిషనర్‌పై 20(బీ)(2)(ఏ) కింద మాత్రమే కేసు నమోదు చేయాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 4(2) ఇతర చట్టాల కింద నమోదైన కేసులను కూడా విచారించి తీరాలని చెబుతోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు.. ఏ రకంగా చూసినా ఎన్డీపీఎస్ చట్టం కింద ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు సీఆర్పీసీ నిబంధనలు వర్తిస్తాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా చేసే అరెస్టుల నుంచి పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సీఆర్పీసీ సెక్షన్ 41, 41ఏ ఉన్నాయి. పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన ఆ నిబంధనలు ప్రత్యేక చట్టాలకూ వర్తిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్ వాహనంలో 600 గ్రాముల గంజాయి దొరికినందున, అందుకు పడే శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ కాబట్టి అతడి విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నడుచుకోవాలి’ అని దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు. -
నూటొక్క జిల్లాల.. కేటుగాడు!
అతను ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. అయితే తన ప్రతిభను, అర్హతలను సక్రమంగా కాకుండా వక్రమార్గంలో వాడాడు. కొన్నేళ్ల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్‌తోనే చీటింగ్ చేసి రూ.లక్షలు కొట్టేశాడు. చాలా సులువుగా డబ్బులు రావడంతో అప్పటినుంచి అదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి.. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు.. ఇలా అతని నేరాల చిట్టా చేంతాడంత ఉంది. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అతగాడి లీలలకు తెరపడింది. చిత్తూరు అర్బన్: పెళ్లికాని యువతులను మ్యాట్రిమోనీ (వివాహ సంబంధాల) వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు కాజేసే కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ (33) డిగ్రీ వరకు అద్దంకిలో చదివి, హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. ఆపై ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ఫొటో ఉంచగా.. ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్లైన్ చాటింగ్ చేసి రూ.లక్షలు కాజేశాడు. కష్టపడకుండానే డబ్బులు రావడంతో ఇదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. నకిలీ పేర్లతో పెళ్లికాని యువతులతో ఆన్లైన్లో చాటింగ్ చేయడం, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి వారితో డబ్బులు తన బ్యాంకు ఖాతాలోకి వేయించుకునేవాడు. అలా.. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ యువతి వద్ద రూ.40 లక్షలు కాజేసి రెండు సార్లు అరెస్టు కూడా అయ్యాడు. జైలు జీవితం అనుభవించినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ.1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తుండగా.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డు వద్ద నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్ లీలలు వెలుగుచూశాయి. నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం లాంటి నేరాల చిట్టా బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
2,520 కిలోల గంజాయితో వ్యాన్ సీజ్
పాడేరు: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో పోలీసు శాఖ పట్టుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ30యూ3517 నంబర్ గల ఐచర్ వ్యాన్ తనిఖీ చేయగా ఈ గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని ఎస్ఐ లక్ష్మణ్ బుధవారం తెలిపారు. వ్యాన్ వెనుక భాగంలో తనిఖీ చేస్తున్న సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బంది తప్పించుకుని పరారయ్యారని ఎస్ఐ తెలిపారు. ఈ ఐచర్ వ్యాన్‌ను సీజ్ చేశామని, 2,520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.75 లక్షలు ఉంటుందన్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
అరకు మత్తులో.. యువత చిత్తు..!
అందమైన ప్రకృతి ఒడిలో గంజాయి పెరుగుతోంది. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరుకు తరలిపోతోంది. ఈ మార్గంలోని చిత్తూరులో పిల్లలను మత్తుకు బానిసలుగా చేస్తోంది. ఇటీవల మైనర్లు గంజాయి తాగుతున్న వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీ సులు రంగంలోకి దిగారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. పిల్లలకు హెచ్చరికలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: బైకుల దొంగ.. 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం చిత్తూరు అర్బన్: అరకు.. ఈపేరు వింటేనే ఎత్తయిన కొండలు.. అందమైన లోయలు. ప్రకృతి హొయలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఇంత అందమైన వనంలో టన్నుల కొద్దీ గంజాయి సాగు చేసి స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరినవారూ ఉన్నారు. ఇటీవల అరకు నుంచి పెద్ద మొత్తంలో జిల్లాకు గంజాయి రవాణా అవుతుండడమే దానికి నిదర్శనం. దీనిమత్తులో యువత చిత్తవుతున్నారు. రవాణా ఇలా.. విశాఖ జిల్లాలోని అరకులో గంజాయి మొక్కల పెంపకం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఈ పంటను నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒకరూపంలో ఇతర ప్రాంతాలకు చేరుతోంది. ఇక విశాఖలోని అరకు, గాజువాక ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లాకు చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి ఆకులను బాగా ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 5 కిలోలు, 10 కిలోల సంచుల్లో జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కోసారి 20 కేజీల బ్యాగుల రూపంలో కూడా ఇక్కడకు వస్తోంది. వీటి రవాణాలో ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సుల్లోనే లగేజీ రూపంలో తీసుకొస్తుండగా, చాలా వరకు లారీల్లో ఇక్కడకు తరలిస్తున్నా రు. నిత్యావసర సరుకులు, గృహ నిర్మాణ పరికరాలతో పాటు గంజాయి బ్యాగులను లారీ అడుగు భాగంలో దాచి ఉంచి కొనుగో లుదారులకు వీటిని చేరుస్తున్నారు. మారువేషాలతో.. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె ప్రాంతంలో కొందరు మైనర్లు గంజాయి పీలుస్తున్న వీడియాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని నియమించి రంగంలోకి దింపారు. మొత్తం 15 మందితో ఉన్న ఈ బృందం అరకు, గాజువాక ప్రాంతాలకు వెళ్లి మధ్యవర్తుల అవతారం ఎత్తింది. వంద కేజీల గంజాయి కావాలంటూ మారువేషాల్లో బేరమాడి అరకుకు చెందిన ప్రధాన స్మగ్లర్లు రమణ, కుడా భాస్కర్, గాజువాకకు చెందిన పోతురాజును ఇటీవల అరెస్టు చేశారు. వీరి నుంచి రాబట్టిన సమాచారంతో పూతలపట్టు బండపల్లె, కల్లూరు, మదనపల్లె, పాకాల, తవణంపల్లె ప్రాంతాలకు చెందిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో మరో నింది తుడు బెంగళూరుకు చెందిన సిద్ధూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వయా బెంగళూరు.. విశాఖ జిల్లా నుంచి వస్తున్న గంజాయి తొలుత తిరుపతికి చేరుతోంది. ఇక్కడ రైల్వే స్టేషన్, బస్టాండు సమీప ప్రాంతాల్లో కొందరు చిన్నపాటి పొట్లాలుగా చుట్టి అమ్ముతున్నారు. పది సిగరెట్లలో ఉండే పొగాకు పరిమాణంలో ఉన్న ఒక్కో ప్యాకెట్ ధర రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. తిరుపతి తరువాత పశ్చిమ ప్రాంతాలకు పూతలపట్టు మండలంలోని బండపల్లె నుంచి పెద్దమొత్తంలో తరలిస్తున్నారు. పుంగనూరు, పలమనేరు, కల్లూరు, పాకాల, మదనపల్లెతోపాటు కుప్పం వరకు సరుకు బండపల్లె నుంచే వెళుతోంది. ఇంతటితో ఆగని గంజాయి స్మగ్లింగ్ బెంగళూరుకు సైతం పాకింది. బెంగళూరులోని మెజిస్టిక్, రైల్వే స్టేషన్లలో లభించే గంజాయి అరకుదేనని పోలీసులు తేల్చారు. జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష మాదకద్రవ్యా ల వాడకం, అమ్మకం రెండూ నేరమే. ఈ కేసులో పట్టుబడిన వారిపై నేరం రుజువైతే జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష పడుతుంది. గంజాయి కేసులో మూలాలను పట్టుకుని, ప్రధాన స్మగ్లర్లను ఇప్పటికే అరెస్టు చేశాం. మరికొందరిని అరెస్టు చేయడానికి నిఘా పెట్టాం. 18 మందిపై షీట్లు ఓపెన్ చేశాం. గంజాయి మత్తుకు ఎక్కువగా యువత చిత్తవుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు చదవండి: చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం -
మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మత్తును చిత్తు చేసేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. గుట్కా.. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుదిట్టంగా కసరత్తు చేస్తోంది. నిషేధిత పదార్థాల విక్రయాన్ని అరికట్టేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటోంది. పట్టుబడిన నిందితులపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కు నెట్టేస్తోంది. సాక్షి, తిరుపతి: జిల్లాలో మత్తు పదార్థాల విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలను ముమ్మరంగా చేసి అక్రమ వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఫిర్యాదుతో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సైతం ఆధ్యాతి్మక నగరంలో గుట్కా అమ్మకాలను అరికట్టే దిశగా తీర్మానం చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచే.. ప్రజల ఆరోగ్యరక్షణ కోసం ప్రభుత్వం గుట్కా, పాన్‌పరాగ్, హాన్స్ తదితర పదార్థాలపై నిషేధం విధించింది. అయితే కొందరు నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా చేస్తున్నారు. బస్సులు, కార్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా పార్సిళ్లు తెప్పించుకుంటున్నారు. ఈ విధంగా తీసుకువచ్చిన ప్యాకెట్లను తిరుపతి, చిత్తూరు , శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, మదనపల్లె తదితర అర్బన్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి నిత్యావసర సరుకుల మాటున గ్రామాల్లోని దుకాణాలకు సైతం చేరవేస్తున్నారు. సరదాగా మొదలై.. గుట్కా, గంజాయి, పాన్ పరాగ్, హాన్స్‌ని కొందరు స్నేహితులతో సరదాగా వినియోగిస్తున్నారు. అది కాస్తా వ్యసనంగా మారి మత్తు ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో పలు వ్యాధులకు గురై చివరకు ప్రాణాలనే కోల్పోతున్నారు. ముఖ్యంగా యువతే అత్యధికంగా నిషేధిత ఉత్పత్తులను వాడుతున్నారు. మత్తుకు అలవాటు పడి ఎంత ధర చెల్లించైనా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెట్టింపు రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి గుట్కా, పాన్ పరాగ్, హాన్స్, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ♦పాత తిరుచానూరు రోడ్డులో ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్న జయప్రకాష్ , కొందరు స్నేహితులతో కలిసి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. కిలో గంజాయిని రూ.16వేలకు కొనుగోలు చేసి ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ♦తిరుపతిలో పోలీసులు ఇటీవల చేసిన వరుస దాడుల్లో సుమారు రూ.కోటి విలువైన గుట్కా, పాన్ పరాగ్, హాన్స్, విదేశీ బ్రాండ్ సిగరెట్లు భారీగా పట్టుబడ్డాయి. ♦ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని పలు కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న గుట్కా, పాన్ పరాగ్, హాన్స్ ప్యాకెట్లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ♦మదపనపల్లె పరిధిలో ఇటీవల రూ.5 లక్షలకు పైగా విలువైన గంజాయిని స్వా«దీనం చేసుకుని 8మందిని అరెస్ట్ చేశారు. ♦నగరి పరిధిలో ఓజీ కుప్పం చెక్‌పోస్టు వద్ద 2.2 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ♦పిచ్చాటూరు సమీపంలోని కీళపూడి వద్ద రూ.1.50 లక్షల విలువైన హాన్స్ ప్యాకెట్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ♦బెంగుళూరు నుంచి కూరగాయల వాహనంలో తరలిస్తున్న రూ. 33 లక్షలు విలువైన గుట్కా, పాన్ పరాగ్ ప్యాకెట్లను గంగవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ♦పలమనేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు బెంగుళూరు నుంచి వాహనంలో తీసుకొస్తున్న రూ.82 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ♦తాజాగా ఆదివారం పుంగనూరులో గంజాయి విక్రయిస్తున్న ఆవుల కృష్ణ, ఆవుల కృష్ణప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా! కోవిడ్ సోకిందని గొంతుకోసుకున్నాడు! -
1,744 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు: విశాఖ జిల్లాలో బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరులో 1,200 కిలోలు, మర్రిబంద వద్ద 544 కిలోలు పట్టుకున్నారు. వ్యాన్‌లో పసుపు బస్తాల మాటున తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పాడేరు పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ సెంటర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు ప్రాంతం నుంచి పసుపు లోడుతో వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా పసుపు బస్తాల కింద గంజాయి బస్తాలున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో గిరిజనుడిని అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ రూ.36 లక్షలు ఉంటుందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 544 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు. దీన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
‘మత్తు’ వదిలిస్తున్న ‘ఆపరేషన్ నయా సవేరా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ఉన్న మాదకద్రవ్యాల ‘మత్తు’ వదిలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి ‘ఆపరేషన్ నయా సవేరా’ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో సమాజంలో మాదకద్రవ్యాలు రుగ్మతగా మారాయి. దీంతో ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సూచనల మేరకు ఎస్ఈబీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ‘ఆపరేషన్ నయా సవేరా’ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. గతనెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన విస్తృత దాడుల్లో గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేయడంతోపాటు 59.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాతోపాటు విజయవాడ నగరంలో 10 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసి 19 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గతనెల 29న గుంటూరు అర్బన్, విజయవాడలో ఎస్ఈబీ బృందాలు దాడులు నిర్వహించి 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 174 మందిపై 69 కేసులు నమోదు చేసి 2,176 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్ గంజాయి ఇతర మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ రెండు జిల్లాల్లోను క్షేత్రస్థాయిలో 179 కార్యక్రమాలు నిర్వహించి 24 వేలమందికి అవగాహన కలి్పంచినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై ర్యాలీలు, సదస్సులు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. చదవండి: పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు -
గంజాయి తరలిస్తున్న 9 మంది యువకులు అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు): గంజాయి తరలిస్తున్న 9 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7 కిలోల గంజాయి, 2 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ ఎం.సుబ్రమణ్యం, ఎస్సై జి.బాలకృష్ణలు తమ సిబ్బందితో శనివారం సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో రెండు కార్లను ఆపి తనిఖీలు చేశారు. భారీగా గంజాయి పట్టుబడటంతో వాహనాల్లో ఉన్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరంతా తాడేపల్లి టౌన్, పెనుమాక, తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం, మంగళగిరిలోని కాజ, ఎర్రబాలెం గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. చదువుకునే రోజుల నుంచే మిత్రులు అయిన వీరంతా చెడు వ్యసనాలకు అలవాటుపడి, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. వీరిపై రౌడీషీట్లు తెరిచి నిఘా ఉంచుతామన్నారు. సమావేశంలో నార్త్ డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐలు సుబ్రమణ్యం, జె.రాజారావు, ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రాకెట్లో చిరువ్యాపారులు!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ రాకెట్లో చిరువ్యాపారులు భాగస్వాములు కావడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ముంబై కేంద్రంగా పని చేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమార్కులు నగరంలోని కొందరు చిరు వ్యాపారులు, కొందరు నైజీరియన్లు, నిరుద్యోగులకు డబ్బు ఎరవేసి డ్రగ్స్ సరఫరాలో వారి సేవలను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బోయిన్పల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టైల్స్ వ్యాపారి హనుమాన్ రామ్ కారును తనిఖీ చేయగా.. రూ.1.20 లక్షల విలువైన ఓపియం డ్రగ్‌ను తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. రాజస్థాన్‌కు చెందిన ఇతను పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో టైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇలా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో ఇతను వెల్లడించడం గమనార్హం. కాగా ఇటీవల కాలంలో నగరంలో తరచు నమోదవుతున్న డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. సిటీలోతరచు డ్రగ్స్ కలకలం.. ఇటీవల నగరంలోని తార్నాక చౌరస్తాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రట్టుచేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.64 లక్షల విలువ చేసే 104 గ్రాముల కొకైన్‌తోపాటు ఒక యమహా ఎఫ్‌జడ్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జడీ పాస్కల్(35),అతని గర్ల్‌ఫ్రెండ్ ఎబిరె మోనికా(30) తార్నాక నాగార్జుననగర్‌లో ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరికి ముంబై కేంద్రంగా డ్రగ్స్‌రాకెట్ నడుపుతున్న ఎరిక్,బెన్,» బెంగళూరుకు చెందిన బనార్డ్‌లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ జంట వారు సరఫరా చేసిన కొకైన్ ను గ్రాము రూ.8 వేలు చొప్పున నగరంలో పలువురికి విక్రయిస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు సైతం ఈ జంట మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సెలబ్రిటీలకు సరఫరాపై అనుమానాలు.. నగరంలో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీఐపీలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ రాకెట్ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా పలువురు నైజీరియన్లకు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా చూపి ఈ వ్యాపారంలోకి దించుతూ..నగరంలో వినియోగదారులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. తాజా కేసు ఇలాంటి కోవకే చెందినది కావడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసులు నగరంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటుచేసి సమాచారం అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా..!
మార్టూరు: గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా వారి కళ్లు కప్పి కొత్త కొత్త దారుల్లో గంజాయిని తరలించేస్తున్నారు. తాజాగా శనివారం రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో రూ.కోటి విలువైన 600 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.. మూడు రోజులుగా నిఘా.. జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి, ఇంకొల్లు సీఐ ఆర్ రాంబాబు, ఎస్సై శివకుమార్‌లతో కలిసి మూడు రోజులుగా రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయానికి వినియోగించే కొబ్బరి పిట్టు లోడుతో వెళుతున్న లారీని ఆపి అధికారులు తనిఖీ చేశారు. లారీలో అడుగు భాగాన కంప్రెషర్ చేయబడిన గంజాయి ప్యాకెట్లు ఉంచి వాటి పైన కొబ్బరిపిట్టు లోడు చేసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు సుమారు 600 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కీలక నిందితులు మదనపల్లి ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రికి రాత్రే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ రూ.కోటి ఉండవచ్చని అధికారులఅంచనా. ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ నుంచి.. ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు సరఫరా అయిన గంజాయి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు ప్రాంతం నుంచి సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు గంజాయి అక్రమంగా తరలిపోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి 8, 9 జిల్లాలు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు గంజాయి అక్రమంగా తరలిపోతుండగా మధ్యలో ఉన్న జిల్లాల అధికారుల తీరు పలు అనుమానాలుకు దారితీస్తుంది. అక్కడక్కడ కొన్నిచోట్ల కీలక అధికారులు మామూళ్లకు అలవాటు పడి గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక నిందితులను అదుపులోనికి తీసుకున్న అనంతరం అధికారులు రేపోమాపో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మార్టూరులోను జోరుగా గంజాయి విక్రయాలు మార్టూరులోనూ గత పదేళ్లుగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. స్థానిక పోలీస్ స్టేషన్‌కు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది సహకారం ఉండటంతో దాడులు జరగడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రి ప్రాంతం నుంచి మార్టూరు నిత్యం వస్తున్న చేపలలోడు లారీలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ప్రాంతంలో గంజాయి విక్రయాలు కుటీర పరిశ్రమగా విస్తరించింది. స్థానిక నేతాజీ నగర్ కాలనీ సమీపంలోనూ జోరుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్ కార్మికులు, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని గంజాయి వ్యాపారం ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
‘ఖమ్మం’ ఘటనలో మరికొందరి ప్రమేయం!
భద్రాచలంఅర్బన్: కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. భద్రాచలం టౌన్ సీఐ వినోద్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఆదివారం టౌన్ ఎస్ఐ మహేష్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, గంజాయి లభ్యమయింది. షేక్ ముజామీల్, షేక్ డబ్రేజ్, షేక్ ఇమ్రాన్, షేక్ రేష్మా అనే వ్యక్తులు ఏపీ 15 ఏసీ 4748 నంబర్‌గల కారు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. కారులో ఉన్న సుమారు రూ. 25,80,000 విలువైన 175 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, రిమాండ్ విధించారు. ‘ఖమ్మం’ ఘటనలో మరికొందరి ప్రమేయం! ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంలో రెండు రోజుల క్రితం రూ.44 లక్షల విలువైన గంజాయి పట్టుబడిన ఘటనలో పోలీసులు ఇప్పటికే శంకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని ప్రచారం సాగుతోంది. గంజాయి దందాపై రవీంద్రనాయక్ పేరుతో ఆది వారం జిల్లా ఎస్పీ(కమిషనర్)కి సైతం ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటన వెలుగు చూసింది. ఖమ్మం శ్రీనగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కులో అడుగు భాగంలో నిల్వ ఉంచిన రూ. 44 లక్షల విలువైన 440 కేజీల విలువైన గంజాయిని గత శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన శంకర్ అనే నింది తుడు నిషేధిత గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే శంకర్‌తో పాటు, గంజాయి తరలింపు సమయంలో ఎస్కార్టుగా ఉన్న సాన్య అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గంజాయి దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
గంజాయి కిలో 1500కు కొనుగోలు...
నేరేడ్మెట్: విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరాచేస్తున్న ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, అబ్దుల్లాçపుర్మెట్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, వారి నుంచి 81 కిలోల గంజాయి ప్యాకెట్లు, రెండు కార్లు, రూ.1.45లక్షల నగదు, 9సెల్ఫోన్లతోసహ మొత్తం రూ.30లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. రెండేళ్లుగా గంజాయి దందా... సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు నునావత్ జగన్(29), మలోత్ వినోద్(24), నునావత్ సుధాకర్(27),నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కేతవత్ మురళి(25) గత రెండేళ్లుగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 2019లో తూర్పుగోదావరి జిల్లా మోత్కుగూడెం ఠాణాలో నిందితుడు మురళిపై కొత్తగూడెం జిల్లా భద్రచలం ఠాణాలో వినోద్‌పై, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కోండ పోలీసుస్టేషన్లో మరో నిందితుడు సుధాకర్‌పై కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో పోలీసులు మురళి, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో ఒప్పందం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడు మురళికి హైదరాబాద్‌లో ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్(27)తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేస్తే, రాజస్థాన్‌కు రవాణా చేస్తానని ఏజెంట్ మురళికి హామీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మురళి జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రధాన నిందితుడు నునావత్ జగన్ కలిసి జైలులో జరిగిన ఒప్పందం గురించి వివరించడంతో ఇందుకు అంగీకరించాడు. ఇందుకు సూర్యాపేట జిల్లాకు చెందిన మిగతా నిందితులు వంకుడోతు సాయి(21), వంకడోతు సుధాకర్, వంకుడోతు జితేందర్(33)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్లలో గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేసి, రాజస్థాన్‌కు చెందిన ఏజెంట్‌కు విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నారు. కిలో రూ.1500కు కొనుగోలు... విశాఖపట్నం జిల్లాలోని ధరకొండకు చెందిన గంజాయి విక్రేత రాజు(33)తో ప్రధాన నిందితుడు నునావత్ జగన్, మరో నిందితుడు మురళిలకు పాత పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా నలుగురు ముఠా సభ్యులందరితో కలిసి వారు ఈనెల 25వ తేదీన ధరకొండకు వెళ్లి విక్రేత రాజును కలిశారు. కిలో రూ.1500 చొప్పున 81 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్‌కు కిలో రూ.8వేలకు విక్రయించాలని ముఠా నిర్ణయించుకుంది. గంజాయిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్టు ప్రధాన నిందితుడు, కీలక సూత్రధారి అయిన నిందితుడు మురళిలు ఏజెంట్ రాకేష్‌కు సమాచారం ఇచ్చారు. తాను అందుబాటులో ఉండలేనందున ఏజెంట్ రాకేష్ హైదరాబాద్ నగర శివారులో ముఠా నుంచి గంజాయి ప్యాకెట్లను స్వీకరించేందుకు బోయినిపల్లికి చెందిన కూలీ అనూప్‌కుమార్(27)తో ఒప్పందం చేసుకున్నాడు. సీట్లు, డిక్కీల్లో గంజాయి ప్యాకెట్లు... అంబర్పేట్ సమీపంలో అనూప్‌కుమార్ వేచి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్ల సీట్లు, డిక్కీలలో దాచిపెట్టిన గంజాయి ప్యాకెట్లను తరలించిన ముఠా పెద్దఅంబర్‌పేటలో అప్పగించేందుకు వెళుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్బీ.నగర్ జోన్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు, ఏజెంట్ రాకేష్, గంజాయి విక్రేత రాజులు పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు,ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ దేవేందర్,సీఐలు రవికుమార్,సత్యనారాయణ, ఎస్ఓటీ ఎస్ఐ అవినాష్బాబులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు..
సూర్యాపేట: బొలెరో వాహనం ప్రమాదానికి గురి కావడంతో అక్రమ మార్గంలో జరుగుతున్న గంజాయి రవాణా గుట్టు రట్టయ్యింది. కట్టంగూర్ మండలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కురుమర్తి క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్లో కట్టంగూర్ వైపు వస్తుండగా చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలు కాగా, సమీపంలోని పంట పొలాల్లో ఉన్న రైతులు వారిని బయటకు తీశారు. కొద్దిసేపటికి గాయాలతో ఉన్న ఇద్దరు పరారీ అయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో సుమారు 50 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. గంజాయి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లా విద్యార్థికి ఆరు నెలల జైలు
ఇబ్రహీంపట్నంరూరల్: గంజాయితో పట్టబడ్డ విద్యార్థికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారని ఆదిబట్ల సీఐ నరేందర్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సాయిని అరవింద్ అనే విద్యార్థి గంజాయితో పట్టుబడ్డాడు. ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి. నగరంలోని దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో న్యాయవాద విద్య మూడో సంవత్సరం చదువుతున్నాడు. కరీంనగర్‌లోని చెడు వ్యసనాల వల్ల అతనికి గంజాయి అలవాటైంది. ఈ క్రమంలో 17– 7– 2017వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు సిల్వర్ కలర్ ఆల్టో కారులో గంజాయి పొట్లాలతో వస్తూ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అప్పటి సీఐ గోవింద్‌రెడ్డికి పట్టుబడ్డారు. దీంతో అతన్ని అరెస్టు చేసి గంజాయి, వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మంగళ్‌హాట్ దూళ్‌పేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశానని, తనకు గంజాయి తాగే అలవాటు ఉందని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితుడిని దోషిగా గుర్తిస్తూ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గోవింద్‌రెడ్డి, వరలక్ష్మి, శేఖర్ ఈ విచారణలో ఉన్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
పోలీసుల అదుపులో డ్రగుల్బాజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. నాలుగురోజుల క్రితం నెదర్లాండ్స్ నుంచి చెన్నై వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా భీమవరానికి చెందిన పి.భానుచంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న చెన్నైలో అరెస్టు చూపించారు. దీంతో అసలు భానుచంద్రకు డ్రగ్స్ మాఫియాకు ఉన్న లింక్‌లు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. బీటెక్‌ను మధ్యలోనే వదిలివేసినభానుచంద్ర చాలా కాలంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఎలా పట్టుబడ్డాడు... నెదర్లాండ్స్ నుంచి ఈ నెల 16న విమానంలో చెన్నైకి ఒక పార్శిల్ వచ్చింది. అందులో బొమ్మలు (టాయ్స్) ఉన్నట్లుగా ప్యాకింగ్‌పై ఉంది. నెదర్లాండ్స్ నుంచి భారతదేశానికి బొమ్మలు తెప్పించాల్సిన అవసరం ఏంటని అనుమానించిన కస్టమ్స్ అధికారులు దీన్ని తెరిచి పరిశీలించగా బొమ్మలలో 400కి పైగా పిల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎండీఎంఏ (మెథిలియా డ్యాక్సీ మెతంపెటామైన్) అనే డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని మత్తుతో పాటు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారని సమాచారం. గతంలో కూడా భానుచంద్ర పదిసార్లు ఈ డ్రగ్స్‌ను ఇండియాకి తెప్పించినట్లుగా గుర్తించారు. డార్క్ నెట్ ద్వారా... భానుచంద్ర డార్క్‌నెట్ ద్వారా ఈ డ్రగ్స్‌ను బుక్‌చేసి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఐదు వందల డాలర్లను ఆన్లైన్ ద్వారా చెల్లించి దీన్ని తెప్పించాడు. వీటి ధర ఇండియన్ మార్కెట్లో రూ.12 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. టెర్రరిస్ట్‌లు, డ్రగ్‌మాఫియా మాత్రమే ఉపయోగించే డార్క్‌నెట్‌తో భానుచంద్రకు సంబంధాలు ఎలా ఉన్నాయి? అతని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. రంగంలోకి పోలీసులు జిల్లా పోలీసు యంత్రాంగం దీనిపై రంగంలోకి దిగింది. భీమవరంతోపాటు పరిసర ప్రాంతాలు నరసాపురం ప్రాంతాలలో డ్రగ్స్‌ను రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. భీమవరం పరిసర ప్రాంతాలలో సంపన్న వర్గాలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా విషయంలో రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? ఇంకా డ్రగ్స్ ముఠాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలపై దృష్టి పెట్టారు. భీమవరం ప్రాంతాల్లో డ్రగ్స్‌తో పాటు గంజాయి అమ్మకాలు జరిపే వారి పాత్ర ఈ వ్యవహారంలో ఎంత ఉందనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపితే జిల్లాలో బిగ్షాట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. -
లాక్డౌన్లో సెలబ్రిటీలకు డ్రగ్స్ చేరవేశారా?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ పెద్దమొత్తంలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగరంలోని పంజగుట్ట, లోతుకుంట ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు..వారి వద్ద నుంచి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలో సుమారు 22 మంది వీఐపీలకు నిందితులిద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతోపాటు..నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న మాఫియా వీటి ధరలను రెండింతలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుకావడంతో పలువురు సినిమా సెలబ్రిటీలను ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా విచారించిన విషయం విదితమే. అయితే ఈ నెల 2న అరెస్టుచేసిన తరణ్ జ్యోతిసింగ్, అమిత్కుమార్ల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన కొకైన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కోవిడ్ మాస్క్‌లను బెంగళూరులో విక్రయిస్తామంటూ పోలీసుల వద్ద పాస్తీసుకొని అక్కడికి వెళ్లి నైజీరియాకు చెందిన మైక్ అనే వ్యక్తి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. వారు అక్కడి నుంచి బయలుదేరి మే 30న హైదరాబాద్ నగరానికి చేరుకున్నారని..మార్గమధ్యంలో నిందితులిద్దరూ సుమారు 16 గ్రాముల కొకైన్ సేవించినట్లు పేర్కొన్నారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన మైక్ పరారీలో ఉన్నారన్నారు. కాగా నిందితులు ప్రయాణించిన స్కోడా కారు,మొబైల్ఫోన్లను సైతం పోలీసులు సీజ్‌చేశారు. వీరిలో అమిత్‌కుమార్ అనే నిందితుడు గత 15 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతున్నారని..వివిధ నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలుచేయడంతోపాటు స్వయంగా వాటిని తీసుకునేవారని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇక మరో నిందితుడు తరణ్ జ్యోత్‌సింగ్ ఐదేళ్లుగా డ్రగ్స్వాడుతున్నారన్నారు. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసిన తరణ్జ్యోతిసింగ్, అమిత్‌కుమార్ సెలబ్రిటీలకు చేరవేశారా? నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. డ్రగ్స్ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న నిందితులు..నగరంలోని యువతరం, సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన సెలబ్రిటీలకు, వీఐపీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో తరచూ బయటపడుతోంది. అయితే తాజా డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు మినహా ఎవరూ నిందితులు లేరని..సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు పైకి చెబుతున్నా..ఇద్దరు నిందితులు సుమారు 22 మంది వీఐపీలకు సరఫరా చేసినట్టు సమాచారం గుప్పుమంటుండటం గమనార్హం. ఈవిషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆబ్కారీ శాఖ తటపటాయిస్తున్నట్లు సమాచారం. గతేడాది సినీ ప్రముఖుల డ్రగ్స్ రాకెట్గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేసినా..ఈ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. రెండింతల ధరలు... అత్యంత ధరపలికే నిషేధిత మాదకద్రవ్యాలను డ్రగ్స్ మాఫియా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో రెండింతల ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సుమారు గ్రాముకు ఐదు వేల విలువైన డ్రగ్స్‌ను సుమారు పది లేదా పదిహేను వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పట్టుబడిన డ్రగ్స్ సుమారు రూ.5 లక్షల విలువ కాగా..దీన్ని సొమ్ముచేసుకున్న పక్షంలో నిందితులకు పది నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టేవారిని ఆబ్కారీపోలీసులు చెబుతున్నారు. సెలబ్రిటీలకు, వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేయలేదు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో పట్టుబడిన నిందితుల కేసును తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పజెప్పాం. తాజా డ్రగ్స్ కేసులో నిందితులు ఇద్దరు డ్రగ్స్ సేవించారు. సెలబ్రిటీలు, వీఐపీలు ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గతేడాది నమోదైన పాత కేసుకు సంబంధించిన పాత వివరాలతో కొన్నిప్రసార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. సెలబ్రిటీలకు, వీఐపీలకు చేరవేసినట్లు ఎలాంటిఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నాం. – ఎన్.అంజిరెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్‌సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ -
అక్రమ మద్యంపై ‘ఎస్ఈబీ’ లాఠీ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం రవాణా, అమ్మకాల నిరోధానికి ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) లాఠీ ఝళిపిస్తోంది. యువ ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఎస్ఈబీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి రవాణా అవుతున్న అక్రమ మద్యం, రాష్ట్రంలోని నాటుసారా బట్టీలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్ఈబీ టీమ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే ఇసుక రవాణాలో లొసుగులను గుర్తించేందుకు ‘సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించిన సంగతి తెల్సిందే. అనంతరం అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం మత్తు వదిలించే పనిలో పడింది. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్‌లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఏఎస్పీలు రిషాంత్‌రెడ్డి (చిత్తూరు), వకుల్ జిందాల్ (కృష్ణా), గౌతమిశాలి (కర్నూలు) స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ మద్యం అంతు చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తూ.. రాష్ట్రంలో నాటుసారా తయారయ్యే ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. 953 మంది అరెస్ట్ ► తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి కారులో తీసుకొస్తున్న 1,846 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల వద్ద దాచేపల్లి ఎస్సై బాలనాగిరెడ్డి పట్టుకున్నారు. ► ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి అక్రమ మద్యం తరలిస్తున్న 953 మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఎక్సైజ్, ఎన్డీపీఎస్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. ► వీరి నుంచి 10,088 మద్యం బాటిళ్లు, 465 టెట్రా ప్యాకెట్లలోని మద్యం, మరో 442 టెట్రా ప్యాక్‌ల సుంకం చెల్లించని (ఎన్డీపీ) మద్యం స్వాధీనం చేసుకున్నారు. ► మరోవైపు నాటుసారా తయారీపై నిఘా పెట్టారు. 7,062.5 లీటర్ల నాటుసారా, 11,345 కిలోల బెల్లం, 25,794 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. ► గంజాయి రవాణాపైనా ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించింది. గడచిన నాలుగు రోజుల్లో 172.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. ► మొత్తానికి మద్యం, నాటుసారా, గంజాయి తరలిస్తున్న కేసులకు సంబంధించి 309 వాహనాలు సీజ్ చేశారు. -
మట్కారాయుడి కాంట్రాక్టర్ ముసుగు
ఆదోని టౌన్: రోడ్లు వేసే కాంట్రాక్టర్‌నని నమ్మించి ఓ యువకుడు స్థానిక టీజీఎల్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాంట్రాక్టర్ ముసుగులో ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మట్కా రాస్తూ, అవసరమైన వారికి గంజాయి విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడి వివరాలను మంగళవారం డీఎస్పీ రామకృష్ణ తన బంగ్లా వద్ద విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మేకల బజార్లో నివాసముంటున్న అదిమి మోహన్‌కుమార్ కాంట్రాక్టర్ ముసుగులో మట్కా రాయడం, గంజాయిని విక్రయి స్తూ నెలకు వేలకు వేలు సంపాదిస్తున్నాడు. ఇటీవల ఆదోని పట్టణంలోని టీజీఎల్ కాలనీకి మకాం మార్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కేపీ ప్రహ్లాద్, సిబ్బంది మంగళవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు గుట్టు బయటపడింది. మొబైల్లో కోడ్‌భాష వినియోగిస్తూ వాట్సాప్, వాయిస్ కాల్స్ ద్వారా మట్కా లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. నెలకు దాదాపు రూ.5లక్షలకు పైగానే ఆదా యం ఆర్జిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. అదనపు పనిగా కావాల్సిన వారికి గంజాయి కూడా సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మోహన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.66 వేల నగదు, 190 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, మోటార్ సైకిల్, 4ఏటీఎం కార్డులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్ఐ ప్రహ్లాద్, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ, సీఐ నగదు రివార్డును అందజేశారు. -
ఒడిశా టు సిటీ వయా భద్రాచలం!
మలక్‌పేట: నగర పోలీసులు ఇప్పటి వరకు గంజాయి విక్రేతలు, రవాణా చేసే దళారుల్ని మాత్రమే పట్టుకున్నారు. తొలిసారిగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ మాదకద్రవ్యాన్ని పండించేవారికీ చెక్ చెప్పారు. విశాఖ ఏజెన్సీకి చెందిన ఇద్దరు రైతులు సహా మొత్తం నలుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.6.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఒడిశాలో పండిస్తున్న గంజాయిని ఈ గ్యాంగ్ భద్రాచలం మీదుగా సిటీకి తరలిస్తున్నట్లు తెలిపారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆశతో.. విశాఖ ఏజెన్సీలోని జీకే వీధికి చెందిన కయ్యం నాగరాజు, పేరి చిన్నారావు సమీప బంధువులు. ఒకప్పుడు వీరు జొన్న సాగు చేసేవారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి పండించడం ప్రారంభించారు. జీకే వీధి ఆంధ్రా– ఒడిశా సరిహద్దుల్లో ఉండటంతో తమ ‘వ్యవసాయానికి’ అవతలి వైపు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒడిశా పరిధిలోని వచ్చే పోపులూరులో గంజాయి సాగు చేయడం మొదలెట్టారు. ఇలా పరిచయం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వేలర్తి గ్రామానికి చెందిన ఎం.దుర్గాబాబు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఈ నేపథ్యంలోనే ఇతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన మరో ఆటోడ్రైవర్ జి.నర్సింహతో పరిచయమైంది. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న ఈ ద్వయం గంజాయి అక్రమ రవాణాకు సహకరించడం ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న డి.శివశంకర్‌రెడ్డికి కొన్నాళ్ల క్రితం నాగరాజుతో పరిచయమైంది. అతడు గంజాయి పండిస్తున్నాడని తెలుసుకున్న ఇతగాడు దాన్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా నగరానికి తరలించిన విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇతడు ఇచ్చే ఆర్డర్ ఆధారంగా నాగరాజు, చిన్నారావు గంజాయిని రెండేసి కేజీల చొప్పున గాలి సోకని విధంగా ప్యాక్ చేసేవాళ్లు. వీటిని దుర్గాబాబు, నర్సింహల ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. నగరానికి ఇలా.. కేజీ రూ.1500 చొప్పున ఖరీదు చేస్తున్న శివశంకర్‌రెడ్డి దాన్ని ఇక్కడి వినియోగదారులకు గరిష్టంగా కేజీ రూ.7వేల చొప్పున అమ్ముతున్నాడు. దుర్గాబాబు, నర్సింహలు ఈ మాదకద్రవ్యాన్ని నేర్పుగా ప్రత్యేక బ్యాగుల్లో సర్దుకుని, ప్రైవేట్ బస్సుల ద్వారానే సిటీకి తీసుకువస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రం వీరితో పాటు నాగరాజు, చిన్నారావు సైతం వచ్చి డబ్బు వసూలు చేసుకుని వెళ్తుంటారు. ఇటీవల తనకు 100 కేజీల గంజాయి కావాలంటూ శివశంకర్‌రెడ్డి ఆర్డర్ ఇచ్చాడు. దీంతో అది తీసుకుని నలుగురూ తొలుత భద్రాచలం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులో సరుకుతో సహా సిటీకి బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్ మలక్‌పేట ప్రాంతంలో వల పన్నారు. ఓ బస్సును ఆపి తనిఖీ చేయగా.. ఈ నలుగురితో పాటు 96 కేజీల గంజాయి లభించింది. దీంతో నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న శివశంకర్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
పాడేరు టు తమిళనాడు
నెల్లూరు(క్రైమ్): విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం తేవారం గ్రామానికి చెందిన తంగమాయన్ మణిమాల కొంతకాలంగా విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలించేది. అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగింది. పాడేరు, చోడవరం పోలీసులు గతంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతకాలం క్రితం ఆమెను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం కండీషన్ బెయిల్ (ప్రతి గురువారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాలి)పై ఆమె జైలు నుంచి విడుదలైంది. వియ్యంకురాలితో కలిసి.. పలుమార్లు జైలుకు వెళ్లినా మణిమాల ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం కులంతేవర్కు చెందిన తన వియ్యంకురాలు జయపాల్ తమిళ్రాశితో కలిసి గంజాయి అక్రమరవాణా చేయసాగింది. అందులో భాగంగా వారు రెండురోజుల క్రితం పాడేరు దాని పరిసర ప్రాంతాల్లో రూ.2.20 లక్షలు విలువచేసే 22 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి తమిళనాడుకు బయలుదేరారు. అయితే గురువారం కండిషన్ బెయిల్ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండడంతో తిరిగి తమ గ్రామం నుంచి రావడం కష్టం అవుతుందని మణిమాల భావించింది. నెల్లూరులో దిగి రెండురోజులు ఏదో ఒక లాడ్జిలో ఉండి గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మణిమాల తన వియ్యంకురాలికి తెలియజేసి ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదీ సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. మద్రాస్ బస్టాండ్‌లో ఓ హోటల్ సమీపంలో ఆటో కోసం వేచి ఉండగా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే సమాచారం చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబుకు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనున్న బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు సెల్ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించి కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్సై రవినాయక్, ఏఎస్సై శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి, క్రైమ్ కానిస్టేబుల్ రాజా తదితరులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబు, ఎస్సై రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా గం‘జాయ్’!
ఎక్కడో పుడుతుంది.. ఎక్కడో పెరుగుతుంది.. ఊరిలోకి వస్తుంది.. తైతక్కలాడిస్తోంది! అదే గ‘మ్మత్తు’ గంజాయి. మన్యం ప్రాంతాల్లో సాగవుతూ రాష్ట్రం అంతటా రవాణా అవుతూ.. యువతను తనకు బానిసలుగా మార్చేసుకుంటోంది. దీనిని అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో తేలిగ్గా పాగా వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో గంజాయి దందా మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్న చందంగా సాగిపోతోంది. అంతేకాక ఇతర ప్రాంతాల రవాణాకూ నగరమే అడ్డాగా మారుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో: ఉత్తరాంధ్ర, తెలంగాణలోని దండకారణ్యం నుంచి గంజాయి బెజవాడను ముంచెత్తుతోంది. నగరంలో అనూహ్యంగా పట్టుబ డుతున్న గంజాయి పోలీసులను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు గుట్కా, నకిలీ నెయ్యి, కాల్‌మనీ కేసుల విచారణకే పరిమితమైన సిటీ పోలీసులకు గంజాయి మాఫియా సవాల్‌గా మారింది. కృష్ణలంక, వన్‌టౌన్, టూటౌన్, రైల్వేస్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో పనిపాటలేనివాళ్లు గంజాయి సేవనం నిత్యకృత్యం. రూ. పాతిక ఇస్తే చిటికెడు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుంటారు. చెత్త ఏరేవారు, యాచకులు, రిక్షా, ముఠాకూలీ కార్మికులు, నదిగట్లపై బైరాగులు గంజాయికి నిత్య వినియోగదారులు. వివిధ రూపాల్లో దీనిని వినియోగిస్తూ మత్తులో తేలిపోతుంటారు. యువత చిత్తు.. సాధారణ యువత, విద్యార్థులు సైతం ఇటీవల సంవత్సరాల్లో గంజాయికి దాసోహమవుతున్నారు. గతేడాది కాలంలో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తూ కొందరు.. గంజాయిని విక్రయిస్తూ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులకు నగర పోలీసులకు పట్టుపడ్డారు. అలాగే ఇటీవల ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు విశాఖ నుంచి గంజాయి తెస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇలా నగర శివార్లలో ఉన్న కళాశాలల్లో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు సమాచారం. దీంతో గంజాయి విక్రేతలు నగరంలోని కాలేజీల వద్దే విక్రయాలు సాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో జరిగే చెల్లర నేరాలకు గంజాయే కారణం. బ్లేడుబ్యాచ్లకు ప్రధాన మత్తు ఆదాయ వనరు ఇదే. విశాఖపట్నం అటవీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు తెప్పించి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఇందులో ఆధిపత్య పోరు తరచూ కొట్లాటలు, కొన్నిసార్లు హత్యలకు దారితీస్తోంది. జాతీయ రహదారిపై దర్జాగా.. తాజాగా పట్టుబడిన గంజాయి.. నగరం దీని రవాణాకు ఒక కేంద్రంగా మారిందనేది చెబుతోంది. ఏలూరు మీదుగా విజయవాడ, గుంటూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు, బెంగళూరు, చెన్నైలకు గంజాయి నిత్యం పెద్ద మొత్తాల్లో అక్రమ రవాణా అవుతోంది. పండ్లు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఇతరత్రా వస్తువుల లోడ్ల కింద గంజాయిని దాచి జిల్లాలను దాటిస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి పొడవునా ఉన్న రవాణా, పోలీసు, వాణిజ్య పన్నుల చెక్‌పోస్టుల్లో నిర్లక్ష్యం, అవినీతి వల్ల పట్టుబడడం చాలా తక్కువ. గంజాయి ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి దానిని పకడ్బందీగా ప్యాక్ చేసి ట్రక్కులు, మినీ లారీల్లో సరుకుల కింద ఉంచుతారు. అంత లోతుగా తనిఖీ చేసే ఓపిక లేక, లేదా భారీ ముడుపులకు లొంగిపోయిన సిబ్బంది వీటిని వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్ర అడవుల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. అక్కడ కిలో రూ. ఐదు వేలు పలికే గంజాయి మెట్రో నగరాల్లో రూ. 60 వేలకు చేరుతుంది. స్థావరంగా బెజవాడ! మెట్రో నగరాల సంగతి పక్కన పెడితే విజయవాడ గంజాయి నెట్వర్క్ సురక్షిత స్థావరంగా ఉందన్నది తాజా ఘటనల సారాంశం. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీపట్నం, లారీ టెర్మినల్, పటమట, పెనమలూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా గోదాములు నిర్వహిస్తోన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గోదాములపై ఎలాంటి నిఘా లేదు. వివిధ సరుకుల మాటున తెప్పించే గంజాయిని ఇక్కడే నిల్వ చేసి కావలసిన వ్యక్తులకు, ప్రదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాల అనుమానం. ముడి గంజాయిని ఇక్కడ శుభ్రంగా ప్రాసెస్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ఇతర ఉత్పత్తుల మాటున నగరాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్య రైళ్లు, బస్సుల్లో ఉత్తరాంధ్ర నుంచి ట్రావెల్బ్యాగుల్లో తెచ్చి విక్రయించే వ్యక్తులకు లెక్కలేదు. నిఘా పెట్టాం.. విజయవాడలో గంజాయి విక్రయ ముఠాల కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడకు గంజాయి సరఫరా అవుతోంది. అక్కడి మూలాల్ని గుర్తించే పనిలో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విక్రయదారులను కట్టడి చేసే పనిలో ఉన్నాం. విజయవాడ కేంద్రంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు గంజాయి సరఫరా అవుతోందని గుర్తించాం. సిటీ పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు బ్యాగుల ద్వారా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శుక్రవారం సైతం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.– ద్వారకా తిరుమలరావు,నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
విద్యార్థులే టార్గెట్
కర్నూలు: విద్యార్థులే లక్ష్యంగా కర్నూలు నగరంలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ధూమపానానికి అలవాటు పడిన విద్యార్థులు, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటవ పట్టణ సీఐ దస్తగిరిబాబు నేతృత్వంలో వలపన్ని నలుగురు రవాణా దారులు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేశారు. జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మల్లెపోగు మధు గంజాయిని పొట్లాలుగా కట్టి అదే ప్రాంతంలోని అల్లాబకాష్ దర్గా వెనుక విద్యార్థులకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వెలుగోడు మండలం రాజునగర్ వీధికి చిందిన ఖాదర్‌వలి, పాణ్యం ఏఆర్ కాలనీకి చెందిన మూర్తుజావలి, పగిడ్యాల మండలం వనుములపాడు గ్రామానికి చెందిన కర్నే దామోదర్, బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామానికి చెందిన ఖైరున్‌బీ ముఠాగా ఏర్పడి నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మధుకు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. వీరు కిలో గంజాయి 500 ప్రకారం కొని తులాల ప్రకారం పొట్లాలుగా చుట్టి ఒక్కొక్కటి రూ.20 ప్రకారం విద్యార్థులకు విక్రయాలు జరుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కర్నూలు నగరంలోని ఎల్కూరు విల్లాస్, ప్రధాన పార్కులు, ఇంజినీరింగ్ కాలేజీల వద్ద ఈ వ్యాపారాని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న విద్యార్థులు అందులోని పొగాకు తొలగించి గంజాయి పొడిని నింపుకుని తాగుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రవాణా దారులు కర్నే దామోదర్, ఖాదర్‌వలి, మూర్తుజావలి, ఖైరూన్‌బీలతో పాటు, జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, మల్లెపోగుమ«ధును అరెస్టు చేసిæ వారి వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసురేని కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు సీఐ వెల్లడించారు. -
వెంబడించి పట్టేశారు
నెల్లూరు, తడ: 180 కిలోల గంజాయిని తడ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన కారు నెల్లూరు వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తోందని జాతీయ రహదారి వెంబడి పోలీస్స్టేషన్లకు నెల్లూరు సీసీఎస్ (క్రైమ్) సీఐ శ్రీనివాసన్ ద్వారా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సూళ్లూరుపేట పోలీసులు ఓ చోట కాపుకాశారు. అయితే కారు తప్పించుకుని వేగంగా తడ వైపు వచ్చేసింది. పారిపోతుండగా.. తడ ఎస్సై జి.వేణు తన సిబ్బందితో శ్రీసిటీ కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన ఇసుక చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. అదే సమయంలో అనుమానాస్పద కారు వేగంగా చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. పోలీసులు పట్టుకునేందుకు అప్రమత్తం కాగా కారు డ్రైవర్ వారిని చూసి రూటు మార్చి కారుని తిరిగి తడ వైపు మళ్లించాడు. అదే సమయంలో రహదారికి మరో వైపు కాచుకుని ఉన్న కానిస్టేబుల్ రాజేష్ అప్రమత్తమై పోలీస్ వాహనంలో కారును వెంబడించాడు. కారు తడ బజారు కూడలికి వచ్చి శ్రీకాళహస్తి మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా మోటార్‌బైక్ అడ్డు రావడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనతో కారు వేగం తగ్గడంతో అందులోని ఓ నిందితుడు కిందకు దూకి పరారయ్యాడు. అనంతరం కారు డ్రైవర్ మరికొంత దూరం వెళ్లి వాహనాన్ని వదిలి పరారయ్యాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తొలుత కారులోంచి దిగి పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకున్నాడు. ఇంతలో ఎస్సై, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన వీరనన్‌తోపాటు కారుని స్టేషన్‌కి తరలించారు. తిరుచ్చికి వెళుతుండగా.. కారులో పరిశీలించగా రెండేసి కిలోల చొప్పున ఉన్న 90 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం నుంచి తిరుచ్చికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీని విలువ కొనుగోలు ప్రాంతంలో కిలో రూ.8 వేలు ఉంటుందని బహిరంగ మార్కెట్లో పదిరెట్లు అధికంగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్ సీఐ శ్రీనివాసన్, సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి తడకు చేరుకుని నిందితుడిని విచారించారు. పారిపోయిన వ్యక్తితోపాటు స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తులను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. -
టార్గెట్ న్యూ ఇయర్
కుషాయిగూడ: నూతన సంవత్సర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని నగరంలో మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేస్తున్న ముఠాను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్, గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, వస్రమ్ తండాకు చెందిన బాదావత్ కిషన్ గతంలో పదేళ్ల పాటు ముంబైలో నివాసం ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పలు రాష్ట్రాలకు చెందిన మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అతను భజర్‌తల్, జంకేడ్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ముఠాలతో కలిసి గత కొన్నేళ్లుగా గంజాయి, కొకైన్, హెరాయిన్ తదితర మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో మాదకద్రవ్యాలను విక్రయించాలని భావించిన అతను ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన రాజేష్ పరమేశ్వర్, అనిల్ వైద్యనాథ్ బోస్లేలను సంప్రదించాడు. తనకు గంజాయి, బ్రౌన్‌షుగర్ సరఫరా చేయాలని కోరుతూ 50 శాతం డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో రాజేష్ రాజస్థాన్‌కు చెందిన షబ్బీర్‌తో కలిసి కిషన్‌కు అవసరమైన మాదకద్రవ్యాలను సిద్ధం చేశాడు. కుషాయిగూడలోని తిరుమల లాడ్జిలో వారు కిషన్‌కు డ్రగ్స్ అందిస్తున్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్ఓటీ, కుషాయిగూడ పోలీసులు దాడి చేసి కిషన్, రాజేష్, అనిల్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన 150 గ్రాముల బ్రౌన్‌షుగర్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. పీడీ యాక్ట్ నమోదుకు సిఫార్సు: డీసీపీ నిందితులపై పీడీ యాక్టు నమోదుకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు. యన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందన్నారు. నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, రేవ్ పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ ముఠాను అరెస్టు చేయడంతో ప్రతిభ కనబరిచిన మల్కాజిగిరి ఎస్ఓటీ, కుషాయిగూడ పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ మల్కాజిగిరి నర్సింహ్మరెడ్డి, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా.. పోలీస్ వేట!
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన ప్రకాశం పోలీస్ రాజమండ్రి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు సమాచారం అందడంతో నిందితులను పట్టుకున్న పోలీసులు గంజాయి లారీని దారి మళ్లించి పరారైన మరో ఇద్దరు నిందితులు నెల్లూరు జిల్లా గూడూరు వరకూ ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు నిందితులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు లారీతోపాటు సుమారు రూ.25 లక్షల విలువ చేసే 400 కేజీల గంజాయి స్వాధీనం బుధవారం పట్టపగలు సినీ ఫక్కీలో ఛేజింగ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గంజాయి అక్రమ రవాణా సమాచారంతో రోడ్‌పై చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.. తెల్లవారు జామున పోలీసుల హడావిడి చూసి ఏదో జరిగే ఉంటుందని స్థానికులంతా అనుకున్నారు.. ఏం జరిగిందో మాత్రం వారికీ తెలీదు.. ఇదే సమయంలో రూట్ క్లియరెన్స్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.. తమ వారు పోలీసులకు దొరికిపోయారని పసిగట్టిన గంజాయి ముఠా లారీ రూట్ మార్చేశారు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు తమ వానాల్లో లారీని వెంబడిస్తూ వేట మొదలు పెట్టారు.. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా గూడురు వద్దకు వెళ్ళే సరికి గంజాయి లారీతోపాటు నిందితులను సైతం పట్టేశారు.. నిందితులంతా తమిళనాడుకు చెందిన అంతఃరాష్ట్ర గంజాయి ముఠా అని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.. ఇదేదో సినిమా కథ కాదు. ఇదంతా ప్రకాశం జిల్లా పోలీసులు చేసిన సాహసం. వీరికి సరిద్దులతో సంబంధం లేదు. “బియాండ్ ద బోర్డర్’ పేరుతో ఎల్లలు దాటి స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వెళ్తున్న గంజాయి లారీలను సినీ ఫక్కీలో తమిళనాడు బోర్డర్ వరకూ ఛేజ్ చేసి పట్టుకుని తమ సత్తా చాటారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి పంజా విసిరారు. ఈనెల 10న జె.పంగులూరు పోలీసుస్టేషన్ పరిధిలో హైవేపై బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పట్టుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇది జరిగి వారం రోజులకే రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టపగలు సినీ ఫక్కీలో వేటాడి పట్టుకున్న పోలీసులు రూ.25లక్షల విలువచేసే 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి లారీ వెళుతున్నట్లు సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు త్రోవగుంట–చీరాల జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా లారీని చీరాల వద్దనుంచి దారి మళ్లించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగి లారీని చేజ్ చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరు వద్ద పట్టుకుని నాగులుప్పలపాడు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కి రిమాండ్‌లో ఉన్న నిందితులు ముగ్గురు కూడా ఇదే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. అంటే తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన వ్యక్తులే గంజాయి అక్రమరవాణాకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో అసలు సూత్రధారులు ఎవరై ఉంటారనే దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అసలు ముఠా గుట్టు తెలిసేనా? నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు నిందితులు చెప్పే సమాధానంతో తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. అసలు తమకు గంజాయి ఇచ్చింది ఎవరో కూడా తెలియదని.. వారి ఫోన్ నంబర్ కూడా తమకు ఇవ్వరని చెబుతున్నట్లు తెలుస్తోంది. తాము లారీతో రాజమండ్రిలోని వారు చెప్పిన ప్రాంతంలో ఉంటే ఆటోలలో సరుకును తెచ్చి లోడింగ్ చేసి డబ్బు తీసుకుని వెళ్లిపోతారని, తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరని నిందితులు పేర్కొంటున్నట్లు తెలిసింది. తమకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుందని, ఆ తరువాత ఆ నంబర్ పనిచేయదని పోలీసుల వద్ద తెలిపినట్లు సమాచారం. పోలీసు విచారణలో అసలైన సూత్రధారుల గుట్టు బయట పడుతుందా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. -
కూలుతున్న గంజాయి కోటలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏజెన్సీలో నాడు టీడీపీ నేతల అండతో పెచ్చరిల్లిన్న గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కూలగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గంజాయి సాగు నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ దశాబ్దం నుంచి వేళ్ళూనుకున్న స్మగ్లర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరు నెలల వ్యవధిలోనే 95 కేసులు నమోదు చేసి 245 మందిని అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.60 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్యంలో గంజాయి వనాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆ మాట నిలబెట్టుకుంటూశరవేగంగా చర్యలు చేపట్టారు. ఫలితంగా తక్కువ వ్యవధిలోనే సాగు మూడొంతులకు పడిపోయింది. పదేళ్ల క్రితం నుంచే.. గంజాయి ఖిల్లాగా మారిన విశాఖ మన్యంలో ఆ పంట సాగు పదేళ్ళ కిందటే పురుడుపోసుకుంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన సరసపాడు అటవీ ప్రాంతంలో ఈ సాగు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. మన్యం దిగువన ఉన్న దేవరాపల్లి మీదుగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోని నేపథ్యంతో గిరిజనులు గంజాయి సాగు పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో క్రమేపీ పంట విస్తీర్ణం పెరిగి పదివేల ఎకరాలు దాటిపోయింది. ఓ దశలో సాధారణ పంటల సాగుకంటే గంజాయి సాగు వైపే పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితి వచ్చేసింది. ఏజెన్సీలోని మొత్తం 11 మండలాలకు గానూ ఏడు మండలాలు.. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాలకు గంజాయి సాగు విచ్చలవిడిగా విస్తరించింది. ఆరు నెలల్లోనే అనూహ్య మార్పు.. గంజాయి సాగు, రవాణా నిరోధంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన పరిస్థితులను గిరిజనులే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్ళారు. గంజాయి స్మగ్లింగ్ వల్ల అనేక మంది గిరిజనులు జైలు పాలవుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు వాపోయేవారు. అదే సమయంలో విశాఖ నగరంలో యువత గంజాయికి బానిసలుగా మారిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దాంతో అధికారంలోకి వచ్చాక గంజాయి సాగును పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే గంజాయి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, అధికారాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో గిరిజనులు గంజాయి సాగు జోలికి పోకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని, కాఫీ సాగు విస్తరించాలని సీఎం సూచించారు. ఆ మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్మగ్లర్లకు ముకుతాడు వేసే దిశగా చర్యలు చేపట్టారు. నిఘా తీవ్రతరం చేసి తక్కువ వ్యవధిలోనే ఎన్నడూ లేనన్ని కేసులు నమోదు చేశారు. ఫలితంగా గత ఏడాది వరకు సగటున పదివేల ఎకరాల్లో సాగైన గంజాయి విస్తీర్ణం ఇప్పుడు మూడు వేల ఎకరాలకు పరిమితమైంది. అది కూడా పూర్తిగా మారుమూల అటవీ ప్రాంతాలు, ఏవోబీ పరిధిలోకి వచ్చే ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే సాగవుతున్నట్టు అధికారులు గుర్తించారు. స్వచ్ఛందంగా సాగుకు స్వస్తి.. గంజాయి సాగు వద్దని ప్రభుత్వం నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలకు ఇస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి సాగు విడనాడారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంట సాగు ప్రారంభిస్తారు. అయితే జూన్ నుంచే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగును పూర్తిగా విరమించారు. ప్రభుత్వ పిలుపు మేరకు గంజాయి సాగును విరమించిన గిరిజనులు తమ దుస్థితిని, అవసరాలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. వ్యవసాయ యంత్ర పనిముట్లు కావాలనిఅధికారులను కోరుతున్నారు. ఏజెన్సీలో ఐదు తాత్కాలిక చెక్‌పోస్టులు.. ఏజెన్సీలో చాలా చోట్ల గంజాయి సాగుకు అడ్డుకట్ట వేశాం. గతంలో పండించిన పంట రవాణాను నిరోధించేందుకు ఐదు తాత్కాలిక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. శివలింగాపురం, భీమవరం, డౌనూరు, గరికనంద, జీనపాడు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు నెలకొల్పాం. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా నారోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్డీపీఎస్)–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – టి. శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ పెంచి పోషించిన టీడీపీ నేతలు.. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక గంజాయి స్మగ్లింగ్ బహిరంగ వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. సాగు, అక్రమ రవాణాలో అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. గంజాయి రవాణాకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఓ మాజీ మంత్రి పూర్తిస్థాయిలో అండదండలు అందించేవారనేది బహిరంగ రహస్యం. స్వయంగా ఆయనే ఈ మాఫియాకు డాన్‌గా చెలామణీ కావడంతో స్మగ్లర్లకు ఎదురు లేకుండా పోయింది. మాజీ మంత్రి అనుచరులు, సన్నిహితులైన టీడీపీ నేతలతో పాటు మన్యంలోని టీడీపీ నేతలు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపారు. గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాల్సిన అధికారుల చేతులు కట్టేయడంతో ఏజెన్సీలో పండిన గంజాయి యధేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోయేది. కేసుల కోసం అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినట్టు చూపించినప్పటికీ అసలు స్మగ్లర్లను వదిలేసి కూలి డబ్బుల కోసం సరుకును రవాణా చేస్తున్న గిరిజనులు మాత్రమే కటకటాల పాలయ్యేవారు. దీనికి 2014 ఆగస్టు 9 నాటి ఘటనే ఉదాహరణ. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో భారీఎత్తున గంజాయి తరలిస్తుండగా పోలీసులు సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్టు చేయగా.. ఆయన అసలు సూత్రధారులైన టీడీపీ నేతల పేర్లు వెల్లడించారు. కానీ నాటి పాలకుల ఆదేశాలతో ఈ కేసును ఒక్క డ్రైవర్ అరెస్టుతోనే సరిపెట్టేశారు. -
సమన్వయంతో పనిచేద్దాం..
సాక్షి, అమరావతి: గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల సమన్వయం కీలకమని, స్మగ్లర్ల డేటాను అన్ని శాఖల దగ్గర నిక్షిప్తం చేయడం ద్వారా వారి ఆగడాలను అరికట్టవచ్చని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘మాదక ద్రవ్యాల ఉత్పాదన, రవాణాల నిర్మూలన, నియంత్రణ’పై ఒక రోజు వర్క్‌షాప్ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో గంజాయి సాగు ఎక్కువగా సాగుతోందని, అది కర్ణాటక, తమిళనాడు రాష్రాలకు రవాణా అవుతోందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని డీజీపీ హితవు పలికారు. ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పర సహకారం అవసరమన్నారు. ఏపీ శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో అన్ని శాఖల అధికారులతోపాటు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, విద్యాలయాల నిర్వాహకులు కృషి చేయాలని కోరారు. అదనపు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆనంద్ కుమార్ ఝూ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఐజీ చంద్రశేఖర్, బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, బెంగళూరు జోనల్ డైరెక్టర్ సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ దయానంద్‌లు మాట్లాడారు. -
గంజాయి సరఫరా డోర్ డెలివరీ..
సాక్షి.సిటీబ్యూరో: విద్యార్థులు, యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు గంజాయి స్మగ్లర్లు యథేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారు ఉంటున్న ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. విద్యార్థులు బసచేసే హాస్టల్ గదులు, కళాశాలల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలే గంజాయి విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న అరవింద్ అనే యువకుడిని ఈ నెల 2న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను గత కొన్ని రోజులుగా మంగళ్‌హట్‌కు చెందిన కిషోర్ సింగ్ అనే వ్యక్తి నుంచి కిలోల చొప్పున గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా మార్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గత రెండేళ్లలో ఒక్క ధూల్‌పేట ప్రాంతంలోనే గంజాయి కొనుగోలు చేస్తున్న ఐదువేల మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు వారికి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వరుస పండుగలు, నూతన ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో బిజీగా ఉన్న అబ్కారీ అధికారులు గంజాయి రవాణాపై దృష్టి సారించకపోవడంతో నగరంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డోర్ డెలివరీ.. నగరంలోని అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మెహిదీపట్నం , హయత్‌నగర్, దిల్సుఖ్నగర్, బీఎన్.రెడ్డి నగర్, హస్తినాపురం, ఉప్పల్, రాజేంద్రనగర్, బాచుపల్లి , ఇబ్రహీంపట్నంతో పాటు శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రైవేట్ హాస్టళ్లు వెలిశాయి. వాటిలో వేల సంఖ్యలో విద్యార్ధులు బస చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థులకు భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇతర విషయాలను పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోనే సిగరేట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకున్న కొన్ని ముఠాలు నేరుగా హాస్టళ్లకే గంజాయి సరఫరా చేస్తున్నాయి. వివిధ మార్గాల్లో నగరానికి.. ఏపీలోని విశాఖపట్నం, అరుకుతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోంది. అక్కడ కిలో రూ. 1000 చొప్పున కొనుగోలు చేసి రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా నగరానికి తరలిస్తున్నారు. పోలీసులు అనుమానించకుండా ఖరీదైన వాహనాలతో పాటు, ఇతర సరకులతో పాటు లారీల్లో తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 10 టన్నులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రవాణాదారుల నుంచి గంజాయి కొనుగోలు చేసే స్థానిక వ్యాపారులు సురక్షితమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుని గుట్టుచప్పుడు కాకుం డా నగరంలో విక్రయిస్తున్నారు. 20 గ్రాముల చొప్పున ప్యాకెట్లలోకి మార్చి యువతకు అంటగడుతున్నారు. ధర తక్కువ..మత్తెక్కువ.. కొకైన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్టీ తదితర మత్తు పదార్థాలు గ్రాము ధర రూ.వేలల్లో ఉండటంతో సంపన్న కుటుంబాలకు చెందిన యువత వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే గంజాయి 20 గ్రాముల ప్యాకెట్ రూ. 100 నుంచి 200 మధ్యలో లభ్యమవుతుండటంతో విద్యార్థులు, యువత దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. మొదట సిగరెట్లకు అలవాటు పడి ఆ తర్వాత క్రమంగా గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి చేసుకునే పార్టీల్లో గంజాయి ప్రధానం ఉంటున్నట్లు సమాచారం. రూట్ మార్చిన స్మగ్లర్లు ... గతంలో ధూల్‌పేట, మంగళ్‌హాట్ ప్రాంతాలు గుడుంబా, నాటుసారాకు కేంద్రాలుగా ఉండేవి. ప్రభుత్వం గుడుంబా తయారీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఈ దందాను వదిలేశారు. అయితే ఈజీమనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు రూటు మార్చుకుని ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. గోల్కొండ, సీతాఫల్మండి, టక్కర్ వాడీ, జుమ్మేరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు విక్రయించే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయా ముఠా ముఖ్యులపై వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెంచడంతో వారు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటూ అనుచరుల ద్వారా తమ దందా కొనసాగిస్తున్నారు. -
మత్తు.. చిత్తు
యువత మత్తులో చిత్తవుతోంది. స్నేహితులతోనో.. సరదాగానో మత్తు పదార్థాల వైపు ఆకర్షితులైన వారు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యువతనే లక్ష్యంగా చేసుకున్న కొందరు గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు(క్రైమ్): జిల్లాలో గంజాయి వ్యాపారం చాలాకాలంగా గుట్టుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు ఒడిశా, విజయనగరం, విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లోని గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతూ గుట్టుచప్పుడు కాకుండా రైళ్లు, రోడ్డుమార్గాన పెద్దఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరు నగరంతోపాటు కోవూరు, ఉదయగిరి, మనుబోలు, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కపాడిపాళెం, శెట్టిగుంటరోడ్డు, ఇరుకళల పరమేశ్వరిగుడి ప్రాంతం తదితర చోట్లకు చెందిన కొందరు వ్యక్తులు కళాశాల విద్యార్థులు, యువతకు ప్యాకెట్ల రూపంలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రవాణా ఇలా.. వ్యాపారులు గంజాయిని రైళ్లు, రోడ్డుమార్గాల ద్వారా జిల్లాకు చేరవేసే సమయంలో వాసన రాకుండా ఉండేందుకు సెంటు జల్లుతున్నారు. ప్ర యాణికుల్లా నటిస్తూ తమ వెంట తెచ్చుకున్న గంజాయి బ్యాగ్‌లను సీట్ల కింద, పైన ఉన్న క్యారియర్లల్లో ఉంచుతున్నారు. స్టేషన్ వచ్చిన వెంటనే వాటిని తీసుకుని వెళ్లిపోతున్నారు. ఒకవేళ మార్గమధ్యలో ఎవరైనా అధికారులు తనిఖీలు చేస్తే బ్యా గ్లు తమవి కావని చల్లగా జారుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఉత్తరాంధ్ర నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని నెల్లూరు నుంచే తమిళనాడు, సేలం, కోయంబత్తూరు, మధురై, అండమాన్, పోర్టుబ్లెయిర్లతోపాటు శ్రీలంక దేశానికి సైతం తరలిస్తున్నారు. ఏఓబీ విశాఖ ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు విస్తృతంగా ఉంది. ఇక్కడ పండే గంజాయికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో స్మగ్లర్లు ఇక్కడినుంచి పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల కేజీల విక్రయాలు ఏజెన్సీ ఏరియాల్లో కేజీ గంజాయి రూ.3 వేలకు దొరుకుతోంది. అక్కడినుంచి జిల్లాకు తీసుకువచ్చిన వ్యాపారులు వాటిని చిన్నచిన్న పొట్లాలుగా తయారుచేసి ప్యాకెట్ రూ.50 నుంచి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. రూ.3 వేలకు కొనుగోలు చేసిన గంజాయిని రూ.25 వేలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. నెలకు వేల కేజీల గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. దీనిని బట్టిచూస్తే జిల్లాలో రూ.కోట్లలో వ్యాపారం సాగుతోన్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల ప్రత్యేక దృష్టి గంజాయి వల్ల తమ పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని పలువురు తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఎస్పీ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం ఇటీవల కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే ముఠాను అరెస్ట్ చేసింది. తాజాగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 16 కేజీల గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి ఉదయం ఇంటి నుంచి చదువుకునేందుకు, పనులకు వెళుతున్న పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. కళాశాలకు వెళ్లే విద్యార్థుల్లో అధికశాతం మంది మత్తుకు బానిసై అనారోగ్యం పాలవుతున్నారు. రూ.లక్షలు చెల్లించి కళాశాలల్లో చేర్పించడంతోనే తమ పని అయిపోయిందని తల్లిదండ్రులు భావించరాదు. కళాశాలకు వెళుతున్నారా?, ఎలాంటి స్నేహిం చేస్తున్నారు?, రాత్రి ఇంటికి వచ్చే సమయంలో ఎలా ఉన్నారు? ఏ విధంగా వ్యవహరిస్తున్నారు?, వారి మానసిక పరిస్థితి?, సెల్‌ఫోన్ వినియోగం తదితరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనిస్తే అందుకు గల కారణాలను తెలుసుకుని వారిని చక్కదిద్దాలి.– ఐ.శ్రీనివాసన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బయటపడిందిలా.. ఇటీవల ఓ విద్యార్థి తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు యువకుడు గంజాయికి అలవాటుపడినట్లుగా ధ్రువీకరించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు అతడిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. ఈక్రమంలో యువకుడు తనతోపాటు అనేకమంది నిత్యం గంజాయి సేవిస్తున్నట్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గంజాయి సేవనానికి అలవాటుపడిన పిల్లలో అధికశాతం మంది సంపన్నవర్గాలకు చెందిన వారే. కొందరు మత్తులో జోగేందుకు సరిపడా నగదు లేకపోవడంతో స్మగ్లర్లుగా మారి గంజాయిని దిగుమతి చేసుకుని స్వయంగా విక్రయిస్తున్నారు. -
విజయవాడలో డ్రగ్స్ గంజాయి ముఠా గుట్టురట్టు
-
ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్
నేరేడ్మెట్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. కొంతకాలంగా తెలంగాణ, మహరాష్ట్ర కేంద్రంగా గంజాయి దందా చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి çరూ.31.62లక్షల విలువవైన 130 కిలోల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు, రూ.12వేల నగదను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, చిన్నగారికుంట తండాకు చెందిన కారు డ్రైవర్లుగా పని చేస్తున్న బానోతు సుధాకర్, గూడెపుకుంట తండాకు చెందిన జర్పుల హుస్సేన్ స్నేహితులు. వీరు తమ అనుచరులైన జతోత్తండాకు చెందిన దరావత్ చిరంజీవి అలియాస్ రఘు, మహ్మదాపురానికి చెందిన కంభంపాటి నాగేశ్వర్రావు, పెద్దగారికుంటకు చెందిన బానోతు వెంకన్న, చిన్నగారికుంటకు చెందిన బానోతు సురేష్ నాయక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొన్ని నెలలుగా గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. విశాఖపట్నం పరిసరాల్లో చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వీరు ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని ధారాకొండ నుంచి కిలో రూ.2వేల చొప్పుర గంజాయి కొనుగోలు చేసి, కార్లలో హైదరాబాద్‌లోని దూల్పేట్, ఓల్డ్‌సిటీ తదితర ప్రాంతాలతోపాటు మహరాష్ట్రలోని ఏజెంట్లకు కిలో రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఏజెంట్లు వాటిని చిన్న ప్యాకెట్లగా మార్చి, యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా వనస్థలిపురం ఠాణా పరిధిలోని ఆటో నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా వస్తున్న మహింద్రా టీయూవీ, స్విఫ్ట్ టూర్ కార్లను ఆపి సోదా చేయగా సీట్లు, డోర్లలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ప్రధాన నిందితులు బానోతు సుధాకర్, జర్పుల హుస్సేన్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారం అధారంగా దారావత్ చిరంజీవి, కంభపాటి నాగేశ్వర్రావు, బానోతు వెంకన్న, బానోతు సురేష్లను అరెస్టు చేశారు. ఎవరినీ వదలిపెట్టం గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఎవరినీ వదలిపెట్టమని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ గంజాయి సాగు లేదన్నారు. ఓఆర్ఆర్, ఇతర రాష్ట్రాలకు హైవే కనెక్టివిటీ ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడున్నరేళ్లలో 4వేల కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నార్కోటిక్, డ్రగ్స్ ట్రాఫికర్ చట్టం కింద గంజాయి వ్యాపారం చేసే వారి ఆస్తిని జప్తు చేయడంతోపాటు పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. గతంలో గంజాయి వ్యాపారం కేసులో కీసరలో రూ.కోటి విలువైన ఆస్తిని జప్తు చేసిన విషయాన్ని సీపీ గుర్తు చేశారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 248 కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇందులో 8మందికి జీవితఖైదు విధించినట్లు సీపీ వివరించారు. పోలీసులకు క్యాష్ రివార్డులు అందజేశారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐలు రవికుమార్, వెంకటయ్య, ఎస్ఐలు వెంకటేశ్వ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. – సీపీ మహేష్‌భగవత్ పరారీలో గంజాయి విక్రేత ధారాకొండకు చెందిన గంజాయి విక్రేత సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సురేష్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, తెలంగాణ, మహరాష్ట్రలకు రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. -
ఛత్తీస్‌గఢ్ టు సిటీ!
సాక్షి, సిటీబ్యూరో: భద్రాచలం సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి సిటీలో విక్రయిస్తున్న ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ గురువారం వెల్లడించారు. ధూల్‌పేటలోని గంగాబౌలి ప్రాంతానికి చెందిన బి.భరత్‌సింగ్ వృత్తిరీత్యా రియల్టర్. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రేతగా మారాడు. గతంలో అతడిపై లంగర్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ ఠాణాలతో పాటు ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌లోనూ గంజాయి సంబంధిత కేసులు ఉన్నాయి. ఇటీవల ఇతడికి ఛత్తీస్‌గడ్‌కు చెందిన మరాయ్‌గూడకు చెందిన కర్కా రాముతో పరిచయమైంది. భరత్‌సింగ్ కోరినప్పుడల్లా ఏజెన్సీ నుంచి గంజాయి సమీకరించి విక్రయించేవాడు. దీన్ని నగరానికి రవాణా చేసే బాధ్యతల్ని భరత్ తన బంధువు, స్నేహితుడు అయిన కొండారెడ్డి శ్రీకాంత్, రమాత్ రమేష్‌లకు అప్పగించాడు. వీరిద్దరూ తరచుగా అక్కడకు వెళ్ళి ఆటోలో గంజాయి తీసుకువచ్చి భరత్‌కు అందజేసేవారు. నగరంలో ఉన్న కస్టమర్లకు భరత్ విక్రయిస్తూ వచ్చిన మొత్తంలో వారిద్దరికీ కొంత కమీషన్ ఇచ్చేవాడు. ఇటీవల రాముకు 23 కేజీలు గంజాయి కోసం ఆర్డర్ ఇచ్చిన భరత్ తన వారిని పంపుతున్నానని, వారితో పాటు వచ్చి డబ్బు తీసుకువెళ్లాలని కోరడంతో రాము అలానే చేశాడు. దీనిపై తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు తమ బృందాలతో వలపన్నారు. గురువారం నలుగురు నిందితులను పట్టుకుని గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు.. -
విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీగా గంజాయిపట్టుబడింది. డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై- శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్‌ని డీఆర్ఐ ఇంటెలిజన్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.1.52 కోట్ల విలువ చేసే గంజాయి బయటపడింది. డ్రైవర్ కాబిన్లో పెట్టి గంజాయిను తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు ఒకప్పుడు ఇక్కడి వారితో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన నేరగాళ్ల బెడద మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు విదేశీయులతో కొత్త భయం పట్టుకుంది. నేరాలు, మోసాలకు తోడు ఏకంగా మాదకద్రవ్యాల విక్రయాలు సైతం ప్రారంభించడమే అందుకు కారణం. సోమవారం 254 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరంతా నైజీరియా నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న వారే కావడం గమనార్హం. ఆఫ్రికా దేశాల నుంచి పలువురు మన దేశానికి వస్తున్నారు. వీళ్లలో ఆఫ్రికా, నైజీరియా, ఇథియోపియా, ఉగాండా దేశాల వారే ఎక్కువ. వీరంతా హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి మహానగరాల్లో స్థిరపడుతున్నారు. వీరిలో కొందరు చదువు కోసం, మరి కొందరు బతుకుతెరువు కోసం వస్తున్నారు. ఇక్కడకు చదువు కోసం వచ్చే వారిలో చాలావుందికి మన దేశం, అమెరికా లాంటి సంపన్న దేశాలు ఉపకార వేతనాలను మంజూరు చేస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న నల్లజాతీయులూ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వీరు తమకు వచ్చే జీతాలు, ఉపకార వేతనాలతో హాయిగా బతికే వాళ్లు. కానీ ప్రస్తుతం సీను మారింది. ఇటీవల జాతీయంగా పెరిగిపోయిన విలాస సంస్కృతి ప్రభావం వీరిపై పడింది. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. జల్సాలకు మరిగారు. చీకటి పడితే చాలు... పబ్‌లు, డిస్కోల్లో చిందులేస్తున్నారు. గడువు ముగిసినా ఇక్కడే తిష్ట విలాస జీవితం గడపటానికి అవసరమైన డబ్బుల కోసం కొందరు నల్లజాతీయులు పెడదారి పడుతున్నారు. మోసాలైతే తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో వాటికే తెగబడుతున్నారు. తమకున్న సాంకేతిక పరి/ê్ఞనాన్ని వినియోగించుకుని సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు... ఢిల్లీ, ముంబైల్లో స్థిరపడిన నల్లజాతీయులకూ హైదరాబాదీయులు టార్గెట్‌గా మారుతున్నారు. ఇప్పుడు వీరు మరో అడుగు ముందుకు వేశారు. మహానగరాల్లో డ్రగ్స్‌కు ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ పెడ్లర్స్‌గా మారుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీలర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసిపోయినా... డబ్బు సంపాదన, విలాసాలకు అలవాటుపడి నల్లజాతీయులు తమ వ్యాపకాలను కొనసాగిస్తూ అక్రమంగా ఇక్కడే నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో నివసిస్తున్న విదేశీయులపై పక్కా నిఘా ఏర్పాటు చేయడానికి సన్నాహిలు ప్రారంభించారు. అరెస్ట్ అయింది వీరే.. ♦ నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా కేసు లో సూడాన్ జాతీయులు సబ్రీ, మొమెమ్ ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ♦ షిల్లాంగ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నగరానికి చెందినయువతి నుంచి రూ. 9 లక్షలు వసూలు చేసి మోసం చేసిన జాన్సన్, విలియంపై గోపాలపురం ఠాణాలో కేసు నమోదైంది. ♦ నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్న సులేవూన్ అబ్దుల్‌ను టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. ♦ దక్షిణాఫ్రికాకు చెందిన ఫిలిప్ హెన్రీ, నైజీరి యాకు చెందిన అక్మలాఫే సావుయుల్ అల్బా నకిలీ డాలర్లు తయారు చేస్తూ పట్టుబడ్డారు. ♦ వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటున్న ఇథియోపియన్లు ఒవుర్ ఇబ్రహీం, వుహవ్ముద్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ♦ లిబియాకు చెందిన కాస్మో రేవూండ్ సోవూజిగూడలో సాయి శంకర్‌ను మోసం చేయబోయి దొరికిపోయాడు. అదను చూసి కాస్మో ఏకంగా పంజగుట్ట ఠాణా నుంచే పరారయ్యాడు. ♦ కోట్ల రూపాయల లాటరీ తగిలిందంటూ ఎస్‌ఎమ్మెస్‌తో ఎరవేసి... రూ.లక్షలు స్వాహా చేసిన నైజీరియన్ నేరగాడు శామ్యుల్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ♦ హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌ను ఫోన్లో సంప్రదించి... రూ. 50 కోట్లు పెట్టుబడిపెడతామంటూ ఎరవేసి రూ.98 లక్షలు స్వాహా చేసిన నైజీరియన్ ఒజోబిలీ హెన్రీ ఓనేకి సీసీఎస్ సైబర్ సెల్ అధికారులు కటకటాల్లోకి నెట్టారు. -
గంజాయి చాక్లెట్
సాక్షి సిటీబ్యూరో/బాలానగర్ : గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు.నేరుగా సరఫరా చేస్తే దొరికిపోతామనే భయంతో కొత్త పుంతలు తొక్కి దందాను కొనసాగిస్తున్నారు. నగరంతో పాటు, శివార్లలోని యువత, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా కొత్త పంథాలో సాగుతున్న గంజాయి దందాకు బాలానగర్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారులు చెక్ పెట్టారు. చాక్లెట్ల రూపంలో తయారుచేసి పాన్ షాపులలో అమ్ముతున్న వ్యక్తితో పాటు, అతడికి సరఫరా చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ ప్రోహిబిషన్ పొలీసులకు ఫతేనగర్‌లోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న పాన్‌షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం పాన్‌షాపుపై దాడి చేయడంతో 80 గంజాయి చాక్లెట్లు దొరికాయి. అమ్ముతున్న పాన్‌షాపు నిర్వాహకుడు మిహిర్‌ను పొలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అదే ప్రాంతంలో బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అనిల్ అగర్వాల్ సరఫరా చేశాడని తెలిపాడు. అతడి దుకాణంపై దాడి చేయగా 35 ప్యాకెట్లలలో ప్యాక్ చేసి ఉన్న 1400 గంజాయి చాక్లెట్లు లభించాయి. 8 కేజీల 400 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీఐ జీవన్‌కిరణ్, ఎస్ఐ మహేందర్ ఇతర సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరికి మంగళ్‌హట్‌కు చెందిన ఒక వ్యక్తి సరఫరా చేశాడని ప్రాధమికంగా సమాచారం ఇవ్వడంతో సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకై.. స్మగ్లర్లు గంజాయి ఆకులను ముద్దలాగా చేసి చాక్లెట్లలా తయారుచేశారు. ఆకర్షణీయంగా ఉండే ప్యాకింగ్ కూడా వేయడంతో సాధారణంగా రవాణా చేసే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినా పెద్దగా ప్రమాదం ఉండదు. దీంతో ఇదే సులువైన మార్గం అని ఎంచుకున్నారు. నడి రోడ్డుపైన ఉన్న పాన్ షాప్‌లో ఉంచి యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు సరఫరా చేశారా.... హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో ఉండే యువత, ఐటీ ఉద్యోగులు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని ఇలా కొత్త పంథాలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పక్కాగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారి పని అని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలానగర్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ పొలీసులకు 6 నెలల క్రితం కూడా సుమారు 300 గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గతంలో రాజేంద్రనగర్ ఎక్సైజ్ పొలీసులకు కూడా గంజాయి చాక్లెట్లు సరఫరా చేసే ముఠా పట్టుబడింది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులు కుత్బుల్లాపూర్: చెడు వ్యసనాలకు బానిసలైన ఇద్దరు విద్యార్థులు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ సహదేవ్ తెలిపిన మేరకు.. కామారెడ్డిజిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జి.మహేశ్‌కుమార్ (22), రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలానికి చెందిన అన్వేష్‌రెడ్డి (22) స్నిహితులు. వీరిద్దరు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి గణేశ్ గౌడ్ ఆదేశాలతో శనివారం సూరారం చౌరస్తాలో మహేశ్‌కుమార్, సుచిత్రలోని లయోలా కళాశాల గేటు వద్ద అన్వేష్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐ సహదేవ్, వెంకటేశ్వరరావు, సత్తార్, శ్రీనివాస్, సంజయ్, చెన్నయ్య, జ్యోతిలు ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు -
జాయ్ రైడర్లకు జైలు
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులైన వారిద్దరిలో ఒకరు మేజర్... మరొకరు మైనర్. బైక్‌లపై తిరగాలనే కోరిక ఉన్నా వీరికి ఆ స్థోమత లేదు... గంజాయి బానిసలైన వీరికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. దీంతో వీరిద్దరూ దొంగలుగా మారారు. కేవలం 12 రోజుల వ్యవధిలో నగర వ్యాప్తంగా నాలుగు బైక్‌ల దోపిడీ, ఓ సెల్‌ఫోన్ చోరీకి పాల్పడిన వీరిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా గండుపల్లికి చెందిన మామిడి ప్రణయ్ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. వీరి కుటుంబం ప్రస్తుతం సైనిక్‌పురి నిర్మలనగర్‌లో నివసిస్తుండగా ప్రణయ్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మద్యం, గంజాయి సహా అనేక దురలవాట్లకు బానిసైన అతడికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. ద్విచక్ర వాహనాలపై షికార్లు చేయాలనే కోరిక ఉన్నప్పటికీ ఇతడికి బైక్ లేదు. బైక్ కావాలని అడిగినా అడిగినా తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి లేకపోవడంతో జాయ్ రైడింగ్ కోసం బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. మరికొన్ని చిన్న చిన్న చోరీలు చేస్తూ జల్సా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థి అయిన మరో మైనర్ (16) కూడా ఇలాంటి నేపథ్యమే కలిగి ఉండి ఇతడితో జట్టు కట్టాడు. ప్రణయ్‌పై గతంలో కుషాయిగూడ ఠాణాలో ఒకటి, మైనర్‌పై రామ్‌గోపాల్‌పేట్, మియాపూర్, కుషాయిగూడ ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ముఠాగా ఏర్పడిన వీరి గత నెల 19 నుంచి మళ్లీ నేరాలు చేయడం మొదలెట్టారు. అదే రోజు చందానగర్ పరిధిలో బైక్‌ను చోరీ చేశారు. 21న రాత్రి దీనిపై తిరుగుతూ బేగంపేటలోని బైసన్‌పోలో గ్రౌండ్స్ వద్దకు వచ్చారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సెల్ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అడ్డగించిన వీరు ఆ ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దోపిడీ కేసు నమోదైంది. 25న దుండిగల్ పరిధిలో మరో బైక్, 30న తార్నాకలో ద్విచక్ర వాహనం చోరీ చేశారు. వీటితో పాటు మరో వాహనాన్ని వీరు తస్కరించినా దానిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. ఈ వాహనాలపై పెట్రోల్ అయిపోయే వరకు తిరిగే వీరు ఆపై ఏదో ఒక ప్రాంతంలో వదిలేస్తుంటారు. ఇలా చేసే వారిని సాంకేతిక పరిభాషలో జాయ్ రైడర్స్ అంటారు. బేగంపేట పరిధిలో నమోదైన దోపిడీ కేసు దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని వీరి నుంచి నాలుగు బైక్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
రోటీ మేకర్ టు గంజాయి స్మగ్లర్!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వలసవచ్చిన షేక్ ఆరిఫ్ సిటీలో రోటీ మేకర్‌గా మారాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నేహితులతో కలిసి గంజాయి దందా మొదలెట్టాడు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా తీసుకువచ్చి నాందేడ్‌లో విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ దందాకు చెక్ చెప్పిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు. వీరి నుంచి 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాందేడ్‌కు చెందిన షేక్ ఆరిఫ్ నగరానికి వలసవచ్చి ఛత్రినాక ప్రాంతంలో స్థిరపడ్డాడు. అదే ఏరియాలో రోటీ మేకర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో వచ్చే డబ్బు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ విషయాన్ని నాందేడ్‌కు చెందిన తన స్నేహితుడు అష్వఖ్‌కు చెప్పడంతో అతను గంజాయి అక్రమ రవాణా చేస్తే భారీ లాభాలు ఉంటాయని సూచించాడు. ఇందుకు ఆరిఫ్ అంగీకరించడంతో అష్వఖ్ విశాఖ ఏజెన్సీకి చెందిన తన స్నేహితుడు శ్రీకాంత్‌ను సంప్రదించి గంజాయి సమకూర్చాలని చెప్పడంతో అతను అంగీకరించాడు. కొన్ని రోజుల క్రితం ఆరిఫ్ నాందేడ్‌కే చెందిన షేక్ సమీర్‌తో కలిసి కారులో విశాఖ ఏజెన్సీకి వెళ్ళాడు. శ్రీకాంత్ నుంచి 200 కేజీల గంజాయి ఖరీదు చేసి వేర్వేరుగా ప్యాక్ చేయించాడు. దీనిని కారు డిక్కీ, వెనుక సీట్ల వద్ద పెట్టుకుని సిటీకి తీసుకువచ్చిన వీరు ఆదివారం ఛత్రినాకలోని ఆరిఫ్ ఇంట్లో బస చేశారు. సోమవారం నాందేడ్ వెళ్లడానికి సిద్ధం కాగా దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్ తమ బృందాలతో దాడి చేసి ఆరిఫ్, సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయి, కారు స్వాధీనం చేసుకుని కేసును ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న అష్వఖ్, శ్రీకాంత్‌ల కోసం గాలిస్తున్నారు. -
ఫిల్మ్‌నగర్ కేంద్రంగా డ్రగ్స్ అక్రమ రవాణా
సాక్షి, సిటీబ్యూరో: మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల వినియోగదారులుగా మారిన ముగ్గురు యువకులు అందుకు అవసరమైన డబ్బుల కోసం వాటినే అమ్మడం మొదలెట్టారు. అరకు ఏజెన్సీతో పాటు బెంగళూరు నుంచి వీటిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. వారి నుంచి నాలుగు రకాలైన నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం ప్రాంతానికి చెందిన కె.భాస్కర్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. బతుకుదెరువు నిమిత్తం ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఇతను ఫిల్మ్‌నగర్ ప్రాంతంలోని గదిలో స్నేహితుడైన ఎం.విశాల్‌తో కలిసి ఉంటున్నాడు. నిరుద్యోగి అయిన విశాల్ సైతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వీరిద్దరూ మత్తుకు బానిసలుగా మారి గంజాయి పీల్చడం ప్రారంభించారు. ఈ వ్యసనంతో పాటు ఇతర ఖర్చులూ పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. వీటి నుంచి బయటపడేందుకు తామే డ్రగ్ పెడ్లర్స్‌గా మారి మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేయాలని పథకం వేశారు. వీటిని అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని భావించారు. ఇలా చేస్తే తాము సేవించడానికి, అమ్మితే కొంత డబ్బు కూడా వస్తుందని భావించాడు. ఇందులో భాగంగా భాస్కర్ కొన్ని రోజుల క్రితం అరకు వెళ్లి గంజాయి కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న దాని అనుబంధ ఉత్పత్తి హష్ ఆయిల్‌ను తీసుకువచ్చాడు. విశాల్‌తో పాటు అతడి స్నేహితుడు ఎం.అభిషేక్ (విద్యార్థి) ఇటీవల బెంగళూరు వెళ్లి అక్కడ ఓ పబ్‌లో పెడ్లర్ నుంచి ఎక్స్టసీ, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ ఖరీదు చేసుకుని తీసుకువచ్చారు. ఈ డ్రగ్స్‌ను ముగ్గురూ విశాల్ రూమ్‌లో ఉంచి కొనుగోలుదారుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌స్వామి తమ బృందాలతో శనివారం దాడి చేశారు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని వారి గదిలో ఉన్న 100 మిల్లీ లీటర్ల హష్ ఆయిల్, తొమ్మిది ఎక్స్టసీ ట్యాబ్లెట్లు, ఐదు ఎల్ఎస్డీ బోల్ట్‌లు, ఒక గ్రాము ఎండీఎంఏ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. 200 కేజీల గంజాయి స్వాధీనం... మరోపక్క ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసు ఆదివారం 200 కేజీల గంజాయి సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసి కారులో నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన టాస్క్‌ఫోర్స్ టీమ్ నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
గాజువాక టు హైదరాబాద్
అత్తాపూర్: ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 132 కిలోల గంజాయి, రూ. 1.85 లక్షల నగదు, ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. గురువారం డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి నిందితుల వివరాలను వెల్లడించారు. ధూల్‌పేటకు చెందిన శుభంసింగ్ (24) విశాఖ జిల్లా గాజువాక నుంచి వెంకట్ అనే వ్యక్తితో గంజాయిని నగరానికి చేరుస్తుంటాడు. శుభంసింగ్‌కు వరుసకు తమ్ముడు సతీష్‌సింగ్ (30) ఎలక్ట్రిషన్, నల్లగొండకు చెందిన నరేష్ (29) ట్రాక్టర్ డ్రైవర్, నవీన్(19), ధూల్‌పేటకు చెందిన సునైనా(18), కార్వాన్కు చెందిన రోహినిదేవి(19) ముఠాగా ఏర్పడి జల్పల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి వచ్చిన గంజాయిని ప్యాకింగ్ మెషిన్ల సాయంతో 12 గ్రాముల ప్యాకెట్లను తయారు చేస్తుంటారు. తయారు చేసిన ప్యాకెట్లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. పక్కా సమాచారంతో.. గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆరాంఘర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా అంగీకరించారు. దీంతో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యుల నుంచి 132 కిలో గంజాయి, రూ. 1,85,240 నగదు, ఒక ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక్ చక్రవర్తిలు తెలిపారు. -
రాజేంద్రనగర్‌లో గంజాయి మూఠా గుట్టురట్టు
-
70 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం, పెందుర్తి: ఏజెన్సీ నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయి ఆటోను టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. పాడేరు మండలం సుడ్రిపట్టు గ్రామానికి చెందిన జె.బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆటోలో 70 కిలోల గంజాయిని నగరానికి తరలిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వేపగుంట వద్ద మాటు వేశారు. ఆటోను పరిశీలించగా అందులోని గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయి సహా మంగళవారం తహసీల్దార్ జె.రామారావు వద్ద హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకునాయుడు వెల్లడించారు. ఎస్ఐ శ్యామల, వీఆర్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు
కాకినాడ క్రైం: కాకినాడ నగరం, రూరల్ మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాలపై ఆదివారం, సోమవారం ఉదయం దాడులు చేసి ఎనిమిది మంది సభ్యుల ముఠాను ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.మూడు లక్షల విలువైన గంజాయి, ఒక ఆటో, హీరోహోండా మోటర్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డినగర్‌లో నలుగురు వ్యక్తుల నుంచి ఎనిమిది కిలోలు, విశాఖపట్నం, తునిలకు చెందిన నలుగురు వ్యక్తులను కాకినాడ–సామర్లకోట కెనాల్ రోడ్డులోని కోటిపల్లి రైల్వే బ్రిడ్జి కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన కేడీపేట, రొంపుల పరిసర ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొని ఎక్కువ ధరకు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అందిన సమాచారం మేరకు.. కాకినాడ రూరల్ మండలం, సిటీ ప్రాంతాల్లో జోరుగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఇంద్రపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీనిపై ఎస్సై పి.విజయశంకర్, రూరల్‌సర్కిల్ సీఐ పి ఈశ్వరుడు, కాకినాడ రూరల్ తహసీల్దార్ బి.సోమశేఖరరావు ఆదివారం సాయంత్రం తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి కాలనీ బైపాస్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద సోదాలు చేయడంతో నలుగురు ముద్దాయిలు ఎనిమిది కిలోల గంజాయిని ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. అదే విధంగా సామర్లకోట–కాకినాడ కెనాల్‌రోడ్డులో కోటిపల్లి బ్రిడ్జి కింద సోదాలు చేయగా నలుగురు వ్యక్తులు 52 కిలోల గంజాయిని తరలిస్తుండగా సోమవారం ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనల వివరాలను కాకినాడ డీఎస్పీ రవివర్మ సోమవారం ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి నగర్‌కు చెందిన అనుపోజు రామ్‌కుమార్, ఇతడి భార్య అనుపోజు శ్రావణి, కాకినాడ రేచర్లపేట అనసూరమ్మ కాలనీకి చెందిన కోడిదాసు శివ అలియాస్ దాసు, ఇంద్రపాలెం పల్లపు వీధికి చెందిన దొడ్డిపాటి శివాజీ అనే వ్యక్తులను అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. వీరు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కేడీ పేట, రొంపుల పరిసరప్రాంతాల్లో కేజీ ఒక్కొంటికి రూ.మూడు వేలకు కొనుగోలు చేసి అనిశెట్టిబుల్లబ్బాయిరెడ్డి కాలనీలో వీటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రిక్షా, భవన నిర్మాణ కార్మికులకు, యువకులకు అమ్మకాలు చేస్తూ కిలో ఒక్కొంటికి రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు అమ్మకాలు చేస్తున్నారన్నారు. అదే విధంగా కాకినాడ–సామర్లకోట కెనాల్ రోడ్డులో విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం కేడీ పేట వినాయకుడి గుడి వీధికి చెందిన శివంగి, నూకరాజు, అదే జిల్లా జీకే వీధిమండలం రొంపుల గ్రామానికి చెందిన భీమవరపు మల్లేశ్వరరావు, తుని మండలం కొత్తసూరవరం గ్రామానికి చెందిన దాడి హరిబాబు, తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక నెహ్రూనగర్‌కు చెందిన కోరుప్రోలు దుర్గాప్రసాదరావులపై దాడి చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ ముద్దాయిల నుంచి ఏపీ 31 టీఏ 6283, ఏపీ 31 బీసీ 2018 ప్యాషన్ ప్లస్ మోటార్ బైక్‌లు, రూ.2.60 లక్షల విలువైన 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ విలేకర్లకు తెలిపారు. గంజాయిని అమ్మకానికి తరలిస్తు పట్టుబడ్డ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి స్మగర్లను అరెస్టు చేసిన ఇంద్రపాలెం ఎస్సై విజయశంకర్, రూరల్ సీఐ ఈశ్వరుడు, ఇంద్రపాలెం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవివర్మ అభినందించారు. -
భారీగా పట్టుబడిన గంజాయి
శ్రీకాకుళం , ఇచ్ఛాపురం/రూరల్: జాతీయ రహదారి–16 అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు గుట్కా, పాన్ వంటి నిషేధిత ఉత్పత్తులు పట్టుబడగా, తాజాగా రూ.14.06 లక్షల విలువైన 281 కేజీల కలిగిన 125 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. లొద్దపుట్టి కూడలి ధనరాజ్ తులసమ్మ అమ్మవారి ఆలయం వద్ద వాహనాల తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడింది. ఇక్కడ ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్సై కోటేశ్వరరావు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇదేక్రమంలో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఇన్నోవా(ఓఆర్05యూ5404) వాహనంలో గంజాయిని తరలిస్తున్నారు. ఇక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు గుర్తించి తమ వాహనాన్ని వదిలేసి దయో పరారీ అయ్యాడు. విభూమిభూషణ్ ప్రదాన్‌ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లెక్కించగా రూ.14.6 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ గురుప్రసాద్, ఆర్ఐ కృష్ణప్రసాద్ రౌళో, సీతారామ్, పోలీస్ సిబ్బంది నీలకంఠం, చిరంజీవి, శాంతమూర్తి, రవి పాల్గొన్నారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
కర్నూలు : గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జొహరాపురంలో భారీగా గంజాయి నిల్వ ఉంచి ఓ మహిళ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో పట్టణ సీఐ విక్రమ సింహ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. గ్రామ శివారులోని అల్లాబకాష్ దర్గా వెనుక ఖాళీ స్థలంలో చంద్రకంటి లక్ష్మమ్మ గంజాయి నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా గురువారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 1030 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విక్రయేత చంద్రకంటి లక్ష్మమ్మతో పాటు ఆమె వద్ద కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులను కూడా అరెస్ట్ చేశారు. బాలాజీనగర్, కండేరి, గనిగల్లీ ప్రాంతాలకు చెందిన యువకులు లక్ష్మమ్మ వద్ద కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసేవారు. పక్కా సమాచారంతో వారందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. లక్ష్మమ్మ ఆత్మకూరు నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. దర్యాప్తులో భాగంగా అసలైన వ్యక్తుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గుప్పు.. గుప్పుమంటూ..
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: గంజాయి సాగు, రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. జిల్లాలో 11 మండలాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏఓబీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వెళ్ల లేని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి కూలీలను ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ పండించిన గంజాయి 99 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో అన్ని విధాలుగా రైలు, రోడ్డు మార్గాలు ఉండడం వల్ల గంజాయి రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. నిరాటంకంగా సాగుతూ.. జనసమర్థమైన ప్రదేశాలకు, జాతీయ రహదారులకు చేర్చేందుకు గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. 25 కేజీల మూటలు రెండింటిని జాతీయ రహదారికి చేర్చితే గిరిజనులకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు కిరాయి ఇస్తుంటారు. దీంతో రాత్రి సమయాల్లో గంజాయి రవాణా అటవీ ప్రాంతం గుండా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా ఈ జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది. విస్తారమైన అటవీ ప్రాంతం ఉండడం వల్ల జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఆటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిరాటంకంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో నిల్వలు చేసి రవాణా చేస్తున్నారు. కేసులు.. అరెస్టులు.. గత మూడేళ్లలో గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ శాఖ అధికారులు 29 మందిని అరెస్ట్ చేసి 19 కేసులు నమోదు చేశారు. 1312.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 91823 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల జైలు శిక్షలు ప్రస్తుతం గంజాయి కేసులో పట్టుబడిన వారికి కోర్టులు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. దీని వల్ల గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్ వల్ల కలిగే నష్టాలపై ఐటీడీఏ అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిజనులే బలి.. సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో రిమాండ్‌లో ఉన్న, శిక్ష పడిన ముద్దాయిలు దాదాపు 500 మందికి పైగా ఉన్నారంటే ఈ గంజాయి సాగు, రవాణాపై ఎంతమంది ఆధారపడ్డారో అర్ధం అవుతుంది. అక్షర జ్ఞానం లేని గిరిజనులు తమకు వచ్చే కొద్ది సొమ్ముల కోసం ఆశపడి ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నర్సరీ మొక్కలు, కాయగూరల మాటున స్మగ్లింగ్ తవుడు బస్తాలు, నర్సరీ మొక్కలు, కాయగూరలు, బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. టూరిస్ట్ బ్యాగ్‌లలో, రైల్వేలో ప్రయాణికుల మాదిరిగా గంజాయి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఇతర ముఖ్య పట్నాల నుంచి హైటెక్ బస్సులు లగేజీల ద్వారా కూడా గంజాయి రవాణా చేస్తున్నారు. వీటితో పాటు లారీ ట్రాన్స్‌పోర్టులు ద్వారా జరుగుతోంది. జిల్లా నుంచి హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపం.. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలంటే స్థానిక పోలీసులతో పాటు, ఎక్సైజ్, రెవెన్యూ, ఫారెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్, ఎన్సీబీ(నార్కోట్సె కంట్రోల్ బోర్డు, సెంట్రల్ రెవెన్యూ ఇంటిలిజన్స్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే వారి మధ్య సఖ్యత లేకపోవడం గంజాయి స్మగ్లర్లకు వరంగా మారింది. నిరంతరంనిఘా ఏర్పాటు గంజాయి రవాణా సాగుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది రాయవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సుమారు 192 కేజీల గంజాయిని స్వా«ధీనం చేసుకున్నాం. ఏడుగురు ముద్దాయిలలో ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉంది.– కె.ఎస్.ఎన్. ప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. రాజమహేంద్రవరం -
విద్యార్థులు, యువతే టార్గెట్
సుల్తాన్‌బజార్: నర్కోటిక్ డ్రగ్స్, గంజాయి, లిక్విడ్ డ్రగ్స్, డ్రగ్స్ సిగరెట్స్‌ను అమాయక విద్యార్థులకు విక్రయిస్తున్న ఓ యువకుడిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి రెడ్‌హిల్స్‌కు చెందిన షేక్ ఇమ్రాన్(25), డ్రగ్స్‌కు బానిసయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల వద్ద డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి వాటిని తానూ వినియోగించుకుంటూ యువతకు విక్రయిస్తుంటాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంట చౌరస్తాలోని బంగారు మైసమ్మ అలయం వద్ద వాహన తనికీలు నిర్వహిస్తున్న పోలీసులు షేక్ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 10 ప్యాకెట్ల గంజాయి ముడిసరుకు, గంజాయితో నింపిన 5 సిగరేట్స్, 3 బాటిళ్ల లిక్విడ్ నర్కోటిక్ డ్రగ్స్ లభించాయి. దీంతో అతడి అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలకు బానిసైన విద్యార్థులు, యువతకు విక్రయిస్తుంటానని తెలడంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును డీఎస్ఐ నరేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
గం‘జాయ్’గా రవాణా!
అరకులోయ: అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పర్యాటకుల ముసుగులో గంజాయిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాలతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో సాగైన గంజాయిని అరకు రోడ్డు మార్గంలో భారీగా తరలిస్తున్నారు. పాడేరు నుంచి అరకులోయ మీదుగా ఎస్.కోట రోడ్డు గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అరకులోయ వరకు రోడ్డు ఉండడంతో ఈ మార్గాన్ని గంజాయి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాడేరు, ఒడిశాల నుంచి అరకులోయకు పర్యాటకుల వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. కుటుంబ సమేతంగా పర్యటనకు వచ్చినట్లు గంజాయి మాఫియా అధునాతన కార్లు, ఇతర వాహనాల్లో సంచరిస్తూ గంజాయిని మైదాన ప్రాంతాలకు తరలించి..సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన హుకుంపేట మండలం సంతారి జంక్షన్ రోడ్డులో భార్యా భర్తలు, ఇతర కుటుంబసభ్యుల మాదిరిగా నలుగురు గంజాయిని కారులో తరలిస్తుండగా హుకుంపేట పోలీసులు పట్టుకున్నారు. గతంలోను ఇలాంటి అక్రమ గంజాయి రవాణా ఘటనలు వెలుగు చూశాయి. ఒడిశా నుంచి గంజాయిని తరలించే వారంతా మాచ్‌ఖండ్ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల్లాగా హల్చల్ చేస్తున్నారు. పాడేరు–అరకులోయ రోడ్డు నిత్యం పర్యాటకులతో కళకళాడుతుంది. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాల్లో పండించే గంజాయిని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ ఉంచి, అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పర్యాటకుల ముసుగులో వ్యాపారులు తరలిస్తున్నారు. పర్యాటకుల్లాగా ఒక్కో వాహనంలో నలుగురైదుగురు ప్రయాణిస్తూ, లగేజీ బ్యాగుల నిండా గంజాయిని నింపుతున్నారు. ఒడిశా, ఏపీల మధ్య పెదబయలు మండలం సమీపంలో మత్స్యగెడ్డ ఉంది. రాత్రి వేళల్లో గంజాయిని వ్యాపారులు నాటుపడవల్లో గెడ్డను దాటించి, ఒడిశాలోని పాడువా రోడ్డు మీదుగా వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఒడిశా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టలేకపోతోంది. దీంతో గంజాయి రవాణాకు జైపూర్ రోడ్డు అనుకూలంగా మారింది. తగ్గిన పోలీసు తనిఖీలు ఐదు నెలల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన తరువాత జరిగిన పరిణామాలతో డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు పూర్తిగా తగ్గాయి. గతంలో డుంబ్రిగుడ మండలం జైపూర్ జంక్షన్లో డుంబ్రిగుడ పోలీసులు నిరంతరం తనిఖీలు చేపట్టేవారు. అప్పట్లో ఒడిశాతో పాటు, పాడేరు ప్రాంతాల నుంచి గంజాయి రవాణాకు వ్యాపారులు భయపడేవారు. ఇటీవల పోలీసు తనిఖీలు విస్తృతంగా లేకపోవడంతో గంజాయి వ్యాపారులు అక్రమ రవాణాను పర్యాటకం పేరుతో విస్తరించారు. పగలు.. రాత్రి తేడా లేకుండా గంజాయితో కార్లు రయ్ రయ్ మంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. పర్యాటకులు ప్రయాణించే వాహనాలపై తనిఖీలు పెద్దగా ఉండవు. కొంతమంది మహిళలను కార్లలో ఉంచుతుండడంతో వారంతా పర్యాటకులు, కుటుంబసభ్యులుగా కనిపిస్తారు. అరకులోయలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఉన్నప్పటికీ గంజాయి రవాణాపై నిఘా మాత్రం కొరవడింది. తనిఖీలు విస్తృతం చేస్తాం డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసుల తనిఖీలను మమ్మురం చేస్తాం. గంజాయి రవాణాపై దృష్టిపెట్టాం.అనుమానిత పర్యాటకుల వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి సమయంలో తనిఖీలు నిరంతరం జరుగుతాయి. గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేస్తాం.– కోటేశ్వరరావు, సీఐ, అరకులోయ సర్కిల్ -
క్యాబేజీల మధ్యలో గంజాయి రవాణా
తూర్పుగోదావరి, రాజానగరం: పదమారో నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిపోతున్న రూ.10.25 లక్షల విలువైన 205 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ సురేష్‌బాబు, ఎస్సై జగన్మోహన్ల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి ముంబైకి ఐషర్ వ్యాన్‌లో క్యాబేజీ బస్తాలు రవాణా చేస్తున్నారు. వాటి మధ్య గంజాయి ఉంచి, పైకి క్యాబేజీ బస్తాలుగా చూపిస్తూ తరలిస్తున్నారు. రాజానగరం సమీపాన కలవచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దీనిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దేవదాసు లడ్డూ, దిలీప్‌సింగ్ పరదేశి, బేల్ధార్, అంబుదాస్ కచ్చిరు, సురేష్ కచ్చిరు, అనాబక్రీ, ఏక్‌నాథ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 9 సెల్ఫోన్లు, కారు, క్యాబేజీల్లో గంజాయితో ఉన్న ఐషర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు
కంటోన్మెంట్: నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముగ్గురు ముఠా సభ్యులను గురువారం బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ముగ్గురినీ మాటు వేసి పట్టుకోవడంతో వారి నుంచి విలువైన మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బేగంపేట ఏసీపీ రామ్‌రెడ్డి, బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం పట్టణానికి చెందిన తాడిమర్రి చెన్నకేశవులు రెడ్డి స్థానిక సీవీరామన్ జూనియర్ కళాశాలలో పీఆర్ఓగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తాను ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న ఎపిడ్రిన్ (క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని పెంచే పదార్థం) డ్రగ్‌ను విక్రయించేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. తాడిపత్రికి చెందిన టప్పల్ సిలార్ అహ్మద్ వలీ ద్వారా నగరంలోని గాజులరామారానికి చెందిన ఆకుతోట కిషోర్‌ను కలిశారు. బోయిన్‌పల్లిలోని స్వీట్ హార్ట్ హోటల్ వద్ద డ్రగ్ కొనుగోలుదారుడి కోసం వేచిచూస్తున్న క్రమంలో డీఐ స్వామి గౌడ్ ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. రూ.50 వేలకు కొని రూ.10 లక్షలకు అమ్మేయత్నం... ప్రధాన నిందితుడు చెన్నకేశవరెడ్డి తాను, అనంతపురానికి చెందిన సీనయ్య నాయుడు (పరారీలో ఉన్నాడు)తో కలిసి 2017లో 600 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండేళ్లుగా దాన్ని అమ్మలేకపోయాడు. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితం రమణ (పరారీలో ఉన్నాడు)కు తెలుపగా, అతడు డ్రగ్ సాంపిల్ తీసుకుని దాన్ని రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. రమణ సూచనల మేరకు అమ్మద్ వలీకి డ్రగ్ అప్పగించగా, అతడు కిశోర్‌ను సంప్రదించాడు. కిశోర్ ఓ కొనుగోలుదారుడితో మాట్లాడి, డ్రగ్ తీసుకుని రావాల్సిందిగా చెన్నకేశవులు, అహ్మద్ అలీకి సూచించాడు. వీరు ముగ్గురు బుధవారం రాత్రి స్వీట్హార్ట్ హోటల్ వద్ద కొనుగోలుదారుడి కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన డీఐ స్వామిగౌడ్, ఏఎస్ బలరామ్, కానిస్టేబుళ్లు రమణమూర్తి,మహేశ్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, సుధాకర్, శ్రీనివాస్, లింగమ్, వెంకటేశ్, మోహన్‌రెడ్డిలను ఏసీపీ రామ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రాజేశ్‌లు ప్రత్యేకంగా అభినందించారు. మరింత లోతుగా విచారణ.. డ్రగ్‌కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు ఓ జూనియర్ కాలేజీలో ఉద్యోగి కావడంతో కాలేజీలు కేంద్రంగా సాగుతున్న డ్రగ్ విక్రయాలపై ఆరా తీయనున్నట్లు ఏసీపీ తెలిపారు. చెన్నకేశవులుకు డ్రగ్ అమ్మిన వ్యక్తులెవరు? సదరు డ్రగ్ కొనేందుకు యత్నించిన వారి కోసం కూడా గాలిస్తున్నామన్నారు. ఇక డ్రగ్ విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి నెట్‌వర్క్‌పై కూడా ఆరాతీస్టున్నట్లు ఏసీపీ రామ్‌రెడ్డి తెలిపారు. త్వరలో డ్రగ్ రాకెట్‌ను చేధించనున్నట్లు వెల్లడించారు. -
293 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం, సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్రమంగా 293 కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం అడ్డరోడ్డుకు చెందిన ఈ.ధనరాజు, రోలుగుంట మండలం, భూపాలపట్నంకు చెందిన అడ్డా లోవ, అనకాపల్లి గాంధీనగర్ కాలనీకి చెందిన పగడాల దుర్గాబాబు, విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన త్రిపురాన వెంకటరమణ కలిసి గంజాయి నగరానికి తీసుకొచ్చి చెన్నైకు తరలిస్తున్నట్లు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. రైల్వే న్యూ కాలనీ దరి శ్రీకన్య థియేటర్ సమీపంలో ఓ కారులో 293 కిలోల గంజాయితో నలుగురూ అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో నలుగురినీ అరెస్ట్ చేసి ఫోర్తుటౌన్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో టాస్క్ఫోర్సు ఎస్ఐలు వాసునాయుడు, సతీష్‌కుమార్, నారాయణ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఫోర్త్‌టౌన్ ఎస్ఐ ఎర్రాజీ కేసు నమోదు చేసి కారు సీజ్ చేశారు. -
గంజాయి దందా గుట్టురట్టు!
సాక్షి, సిటీబ్యూరో: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయించేందుకు యత్నిస్తున్న ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 42 కేజీల గంజాయి, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా, మణుగూరుకు చెందిన కె.సత్యనారాయణ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి గంజాయి దందాపై పడింది. ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి సేకరించి హైదరాబాద్‌కు రవాణా చేసి లాభాలు ఆర్జించాలని భావించాడు. ఇందుకుగాను అతను తూర్పు గోదావరి జిల్లా, మండపేటకు చెందిన హరిబాబు, ఎం.ప్రసాద్‌లను సంప్రదించాడు. ఏజెన్సీ నుంచి గంజాయి సేకరించి సహకరించడానికి కమీషన్ పద్దతిలో వీరు అంగీకరించారు. ఆపై సత్యనారాయణ తన బాల్యమిత్రులు కె.శేషు, సమీప బంధువు కె.రామానంద్‌లను కలిసి ఈ అక్రమ దందాలో సహకరించాలని కోరాడు. వారు అందుకు అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితం విశాఖ ఏజెన్సీ నుంచి హరిబాబు, ప్రసాద్ సాయంతో కేజీ రూ.1500 చొప్పున 42 కేజీల గంజాయి ఖరీదు చేశాడు. శేషును హైదరాబాద్‌కు వెళ్లి కస్టమర్లను చూడాల్సిందిగా సత్యనారాయణ సూచించడంతో అతడు నగరానికి చేరుకున్నాడు. సోమవారం సరుకు తీసుకుని మిగిలిన నలుగురూ కారులో నగరానికి వచ్చి పూసలబస్తీలోని రామానంద్ ఇంట్లో బస చేశారు. గంజాయిని ప్యాక్ చేసి తీసుకురావడంతో ఎవరికీ అనుమానం రాకుండా సత్యనారాయణ జాగ్రత్తలు తీసుకున్నాడు. తన కారు డిక్కీ అడుగు భాగంలో ప్రత్యేక అరను ఏర్పాటు చేసి అందులో గంజాయి రవాణా చేశాడు. దీనిపై సమాచారం అందడంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు జి.శ్రీనివాసరెడ్డి, పి.రమేష్, గోవింద్ స్వామి, సి.వెంకటేష్ తమ బృందాలతో వలపన్ని ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. -
62 కిలోల గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఇన్‌గేట్ వద్ద మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గంజాయి స్మగ్లర్ల వద్ద నుంచి 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అక్రమణ రవాణా గురించి మహిళ పోలీసు స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ వివరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వద్ద సంచులతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పట్టుకొని ప్రశ్నించగా వారి వద్ద మూడు సంచులతో గంజాయి దొరికిందని తెలిపారు. రాజమహేంద్రవరం సింహాచలనగర్‌కు చెందిన తెపర్తి సత్యనారాయణ ఆటోడ్రైవర్‌గా జీవిస్తూ వీలు కుదిరినప్పుడు ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు. మంగళవారం ఆటోలో ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొచ్చి కిలో రూ.ఐలు వేలు చొప్పన ముంబైకి చెందిన స్మగ్లర్లకి అందజేశాడన్నారు. ముంబైకి చెందిన అమర్ నాందేవ్ పోనాని, నషీరుద్దీన్ ఖాన్, అక్షయ లక్ష్మణ్, హుస్సేన్ జావేద్ షేక్, మహ్మద్ అబ్దుల్ షేక్ తదితరులు ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ ముఠా ఈ గంజాయిని ముంబైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ టి.రాజేశ్వరరావు, అధికారుల సమక్షంలో వీరి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు చేధనలో టూటౌన్ సీఐ ముక్తేశ్వరారవు, పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కనకరాజు, కానిస్టేబుల్స్ ప్రదీప్, వీరబాబు, నాగరాజు, సుమన్, రాజశేఖర్, ప్రసాద్,కరుణబాబు, శ్రీనులను డీఎస్పీ అభినందించారు. -
ఇక కంటైనర్ చెక్‌పోస్టులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని వివిధ ప్రాంతా లకు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రాంతాల్లో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏటా పది వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. డిసెంబర్ నాటికి గంజాయి సాగు పూర్తవుతుంది. జనవరి నుంచి గంజాయి రవాణా ఊపందుకుంటుంది. దీంతో స్మగ్లర్లు గంజాయి రవా ణాకు ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఎక్సైజ్, పోలీసుల కళ్లుగప్పి స్మగ్లర్లు గంజా యిని వివిధ వాహనాలు, రైళ్లలో ఇతర ప్రాంతా లు, రాష్ట్రాలకు తరలించుకుపోతూనే ఉన్నారు. గంజాయి సాగు సీజను ముగిశాక స్మగ్లర్లు వాటి రవాణాపైనే దృష్టి సారిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తున్నారు. తొలుత విశాఖ జిల్లాలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇందుకు స్థలం సమస్య అడ్డంకిగా మారింది. కొన్నిచోట్ల రెవెన్యూ, మరికొన్ని చోట్ల అటవీ భూములు ఉన్నాయి. ఆ స్థలాల్లో చెక్‌పోస్టులకు అవసరమైన నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు రావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. దీంతో చెక్‌పోస్టుల ఏర్పాటు ఆలోచన ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నా అంతగా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం కొత్త ఆలోచన చేశారు. చెక్‌పోస్టుల నిర్మాణాలకు జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో కంటైనర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికయితే భూమి కేటాయింపులకు అవసరమైన ప్రక్రియలో పెద్ద జాప్యం ఉండదు.కంటైనర్లను కొనుగోలు చేసి వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ వాటిని చెక్‌పోస్టులకు వీలుగా మార్పులు చేసి వినియోగంలోకి తెస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో కంటైనర్‌ను రూ.4.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. కాగా కంటైనర్ చెక్‌పోస్టులను ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోనే విశాఖలో తొలిసారిగా ఏర్పాటు చేస్తుండడం విశేషం. వంద మందికి పైగా అవసరం.. ఒక్కో చెక్‌పోస్టులో షిఫ్టుకు ఒక సీఐ/ఎస్ఐ, ఏడెనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబు ళ్లు అవసరమవుతారు. ఈ లెక్కన ఒక్కో చెక్‌పోస్టుకు 20–25 మంది చొప్పున ఐదింటిలో 100 మందికి పైగా సిబ్బంది కావల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అయినప్పటికీ గంజాయి రవాణాకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సిబ్బందిని చెక్‌పోస్టులకు సర్దుబాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే.. ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగే ప్రధాన జంక్షన్లయిన కేడీపేట సమీపంలోని భీమవరం, చింతపల్లి రోడ్డులోని డౌనూరు, పాడేరు సమీపంలోని వంట్లమామిడి, అరకు చేరువలో ఉన్న సీతన్నపాలెం, దేవరాపల్లిలో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తమ శాఖ కమిషనర్ ప్రతిపాదించిన కంటైనర్ చెక్‌పోస్టులు సాధ్యమైనంత త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
సుల్తాన్‌బజార్: గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 102 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, మాకవరం పాలెం మండలం, తామారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, అశోక్‌తేజ అనే ఇద్దరు వ్యక్తులు నగరంలోని ధూల్‌పేట్, కాటేదాన్, నారాయణఖేడ్‌లోని వ్యాపారులకు గంజాయి సరఫరా చేసేవారు. మంగళవారంశ్రీనివాస్ రెండు కిలోల గంజాయి ప్యాకెట్లను విక్రయించేందుకు మలక్‌పేటలోని టీవీ టవర్ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా మరో వ్యక్తితో కలిసి ఏపీలోని నర్సిపట్నం నుంచి గంజాయి విక్రయించేందుకు నగరానికి వచ్చినట్లు తెలిపారు. అతడిచ్చిన సమాచారం అధారంగా అబ్దుల్లాపూర్ మేట్లో హైవే పక్కన నిలిపి ఉన్న కారులోని 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిగా నగరంలోని వ్యాపారులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మొదట్లో 10 కిలోల చొప్పున విక్రయించానని, దశలవారిగా సరఫరా పెంచామన్నారు. పాడేరు, చింతపల్లి, నర్సిపట్నం ప్రాంతాల్లో కిలో రూ.1500 చొప్పున కొనుగోలు చేసి నగరంలో రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి పర్యవేక్షణలో ఏఈఎన్ అంజిరెడ్డి, సీఐ రవి, ఎస్ఐలు నిజాముద్దీన్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి పట్టివేత, నలుగురి అరెస్టు
తూర్పుగోదావరి, రామచంద్రపురం: వాహనాలను తనిఖీ చేస్తుండగా రామచంద్రపురం బైపాస్ రోడ్డు జంక్షన్లో పోలీసులకు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. రామచంద్రపురం ఎస్సై ఎస్.లక్ష్మి కథనం ప్రకారం..రామచంద్రపురం బైపాస్ రోడ్డులో సీఐ పి.శివగణేష్ నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వెళుతూ అనుమాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా వారి వద్ద ఉన్న చీరల మూటల్లో గంజాయి కనిపించింది. విషయాన్ని ఆర్డీవో ఎన్.రాజశేఖర్‌కు సమాచారం అందించిన పోలీసులు ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ పి. చిన్నారావు, ఆర్ఐ కె.మహాలక్ష్మినాయుడు, వీఆర్వో పెంకే సత్యనారాయణ, ఇతర రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వారి వద్ద నుంచి 48 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా రాజమండ్రికి చెందిన ఇద్దరు, చెన్నైకు చెందిన ఒక వ్యక్తి, రంగంపేటకు చెందిన ఒక వ్యక్తి మండపేట నుంచి కాకినాడ వైపునకు ఆటోలో గంజాయిని తీసుకు వెళుతున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
బెయిల్‌పై విడుదలైనా గంజాయి స్మగ్లింగ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గంజాయి కేసులో పట్టుబడి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్‌పై విడుదలైనప్పటికీ... తిరిగి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ముద్దాయి.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడాడు. రాజమహేంద్రవరం అర్బన్ తూర్పు మండలం డీఎస్పీ యు.నాగరాజు కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నడింపల్లి సీతారామరాజు, నల్లజర్ల మండలం సింగరాజు పాలేనికి చెందిన నెక్కలపూడి రాంబాబు, నెల్లూరు జిల్లా లక్ష్మీ నర్సంహపురానికి చెందిన షేక్ ఆహ్మద్, తమిళనాడుకు చెందిన పి.సురేష్ ఆదివారం రాత్రి గంజాయిని తమిళనాడు, చెన్నైకు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు చిక్కారు. నిందితులు పాడేరు నుంచి ఒక ఐషర్ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో బొమ్మూరు పోలీసులు హుకుంపేట వద్ద తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో సోమవారం తెల్లవారుజామున వారిని విచారణ చేస్తుండగా ముద్దాయి సీతారామరాజు స్టేషన్ వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లాడు. అతడు బయటకు ఎంతకీ రాకపోవడంతో బాత్రూమ్ తలుపులు తీసే సరికి అక్కడ రేక తో గొంతు కోసుకొని రక్తం కారుతున్న ముద్దాయి కనిపించాడు. అతడికి వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. సీతారామరాజుతో పాటు మరో ఇద్దరు నిందితులు షేక్ ఆహ్మద్ భాష, నెక్కలపూడి రాంబాబులను రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నిందితుడు తమిళనాడుకు చెందిన సురేష్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి సీతారామరాజు హైకోర్టు ఇచ్చిన పెరోల్ కండిషన్‌తో బెయిల్‌పై ఉన్నాడని, మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు. జైలుకు వెళ్లినా మారని తీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ముద్దాయి సీతారామరాజు 2015లో అన్నవరం పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఇతనికి అప్పట్లో రాజమహేంద్రవరం ఫస్ట్ అడిషినల్ సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష తోపాటు రూ.1.50 లక్షలు జరిమానా విధించింది. జైలులో సత్ప్రర్తనతో ఉన్నందున అతడు హైకోర్టు పెరోల్ కండీషన్‌తో 2017 జనవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదల తరువాత పాత నేరస్తులు నెక్కలపూడి రాంబాబుకు అతడు రూ.30 లక్షలు అప్పు పడ్డాడు. దీంతో రాంబాబు, ఇతడికి అప్పు తీర్చే మార్గం చెబుతానని చెప్పి ఈ నెల 11న అనకాపల్లి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి పాడేరు వెళ్లి అక్కడ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయి బస్తాలు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డారు. -
72 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం): గంజాయిని తరలిస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కిల్లీబడ్డీని ఢీ కొంది. ఆ కారు నుంచి 72 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.కె.వి.వి. ప్రసాద్ వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం పాడేరు నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న కారులో గంజాయి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాడుగుల మండలం ముకుందపురం నుంచి టాస్క్‌పోర్స్ పోలీసులు ఆ కారును వెంబడిస్తూ వచ్చారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు కారును వేగంగా నడిపారు. వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్లో ఎదురుగా వస్తున్న వాహనా న్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్క న ఉన్న కిల్లీషాపును ఢీ కొట్టారు. స్థానికులు గుమిగూడడంతో వారు ముందుక వెళ్లలేకపోయారు. పోలీసులు వచ్చి కారులో కేరళ రాష్ట్రం బల్టర్ జిల్లా మాలాపురానికి చెందిన నిందితులు మహామ్మద్ స్వలిహి, రఫీక్ పత్తార్, సలియన్ తామస్‌ను అరెస్టు చేశారు. 36 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ మూడు లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సీఐ కె.కామేశ్వరరావు,ఎస్సైలు ఎస్.ధర్మారావు, రాజ్యలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కిల్లీషాపు పూర్తిగా ధ్వంసమైంది. సంఘటన జరిగిన సమయంలో పాన్‌షాపు తెరిచి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కిల్లీబడ్డీ యజమానికి రూ. 40 వేల నష్టం జరిగింది. -
శివార్లలో ‘డ్రగ్’ ఇండస్ట్రీస్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు జిల్లాలు నియంత్రణ పదార్థాల జాబితాలోకి వచ్చే ఇంటర్మీడియరీ ప్రొడక్ట్ ఎఫిడ్రిన్, యాంఫెటామిన్ ఉత్పత్తి, స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నాయా... ? ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గత వారం ముంబైలోని అంబోలీ పోలీసులు 200 కేజీల ఎఫిడ్రిన్‌ను తీసుకువెళ్లిన చింతల్ ప్రాంతానికి చెందిన గులాం హుస్సేన్‌తో పాటు మరొకరిని పట్టుకోవడం కలకలం రేపింది. ఇదే తరహాకు చెందిన మరో మాదకద్రవ్యం యాం ఫెటామిన్ ఇప్పటికే అనేకసార్లు ఎన్సీబీ, డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లలోని బల్క డ్రగ్ ఇండస్ట్రీస్, ఖాయిలా పడిన పరిశ్రమల కేంద్రంగా సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడానికి అనేక విభాగాలు ఉమ్మడిగా పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సముద్రమార్గంలో సరఫరా... ఎఫిడ్రిన్, యాంఫెటామిన్ మాదకద్రవ్యాలు విదేశాలకు సముద్ర మార్గం ద్వారానే ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇతర మార్గాల్లో పంపాలంటే ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో... కంటైనర్లలో ఇతర సరుకుల మధ్య దాచి, దేశం దాటిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ కర్ణాటకలో తయారైన ఎఫిడ్రిన్ హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోనగర్‌లో డీఆర్ఐ పట్టుకున్న కేసులోనూ ‘సరుకు’ చెన్నైకి చేరాల్సి ఉంది. 2016లో దొరికిన యాంఫెటామిన్ను సైతం కర్ణాటక, తమిళనాడులకు పంపిస్తున్నారు. అంబోలీలో దొరికిన సరుకు హైదరాబాద్ శివార్లలో తయారైనట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. వివిధ ప్రాంతాల్లో తయారైన ఎఫిడ్రిన్, యాంఫెటామిన్లను ఓడ రేవులు ఉన్న ప్రాంతాలకు తరలించి, కంటైనర్ల ద్వారా బయటికి తరలించేందుకు అనేక ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఇతర మెట్రో నగరాల్లో సందర్భాలను బట్టి విక్రయిస్తున్నారు. ఆద్యంతం లింక్ సిస్టమ్‌లో... ఆగ్నేయాసియా, సౌదీ దేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఎఫిడ్రిన్‌ను తయారు చేయడం, అక్రమరవాణా చేయడం, విక్రయించడం ఇలా అంతా లింక్ సిస్టమ్‌లో జరిగిపోతోంది. తమకు ‘సరుకు’ ఇచ్చిన వారి వివరాలు కానీ, తాము ఇవ్వబోతున్న వారి వివరాలు కానీ మధ్యలో పని చేస్తున్న దళారులకు తెలీదు. వీరెవ్వరికీ అసలు ఈ మాదకద్రవ్యాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఎక్కడికి చేరుతున్నాయి? అనే అంశాలు తెలియకుండా సూత్రధారులు జాగ్రత్తపడతారు. కేవలం ‘పై నుంచి’ వచ్చే ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ఏజెంట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా లింక్ సిస్టంలో దందా చేయడం ద్వారా ఎవరు పట్టుబడినా... చైన్ అక్కడితో తెగిపోయి సూత్రధారులు సేఫ్‌గా ఉండిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ‘అంతా కలిసి’ పని చేస్తేనే... వ్యవస్థీకృత ముఠాలు నగర శివార్లలోని అనేక దివాళా తీసిన, సెకండ్ గ్రేడ్, లైసెన్స్‌లేని బల్క్ డ్రగ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. ఈ మాదకద్రవ్యాలను రాష్ట్రంలో వినియోగించిన దాఖలాలు అధికారికంగా లేనప్పటికీ... ఆగ్నే యాసియా, సౌదీ దేశాలకు అక్రమంగా పెద్ద ఎత్తు న రవాణా అవుతోంది. వీటి తయారీని అడ్డుకోవాలంటే డీఆర్ఐ, ఎన్సీబీలతో పాటు స్థానిక పోలీసులు, విద్యుత్, నీటి సరఫరా తదితర విభాగాల న్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాక ఆయా పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి నిషేధిత, నియంత్రిత పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని, అప్పుడే వారి నుంచి సమాచారం అందుతుందని పేర్కొన్నారు. గతంలో చిక్కిన కేసులివీ... ♦ 2009లో డీఆర్ఐ అధికారులు హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏకకాలంలో దాడులు చేసి 400 కేజీల ఎఫిడ్రిన్‌ను పట్టుకున్నారు. ♦ సైబరాబాద్ పోలీసులు 2010లో ఓ సినీ నిర్మాతతో పాటు అతడి అనుచరుడినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 25 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ♦ డీఆర్ఐ అధికారులు 2012లో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరి నుంచి 65 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ♦ 2014లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు చౌటుప్పల్, హయత్‌నగర్‌ల్లో జరిపిన సంయుక్త సోదాల్లో 300 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనమైంది. ♦ 2015లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం లిబర్టీ చౌరస్తా వద్ద పట్టుకున్న ముఠా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ♦ 2016లో రెండు నెలల వ్యవధిలోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆటోనగర్‌లో ని ఓ లాడ్జిపై దాడి చేసి రూ.5 కోట్ల విలువైన 50 కేజీల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్తున్న ఓ యువకుడి నుంచి 12 కేజీలు పట్టుకున్నారు. -
సీన్ రివర్స్!
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకల సహా ఇతర సందర్భాల్లో ఉత్తరాది నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు నగరానికి దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ డిసెంబర్ 31ని టార్గెట్‌గా చేసుకుని గోవా నుంచి కొకైన్‌ను తీసుకువచ్చిన గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే చింతల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులామ్ హుస్సేన్ మాత్రం ఈ సీన్‌ను రివర్స్ చేశాడు. నగర శివార్లలోని పారిశ్రామిక వాడలో తయారైన ఎఫిడ్రిన్ డ్రగ్‌ను మరో వ్యక్తితో కలిసి ముంబైకి అక్రమంగా చేరవేశాడు. సోమవారం తెల్లవారుజామున వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి అంబోలీ పోలీసులు రూ.3.4 కోట్ల విలువైన 20 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విశేషం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. చింతల్‌లోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులాం హుస్సేన్ కొన్నేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన దయానంద్ మాణిక్ ముద్దన్నార్ అతడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వీరు దేశవాళీ డ్రగ్‌గా పిలిచే ఎఫిడ్రిన్‌ను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్ యూనిట్ అధికారులు 2013లో వీరిని పట్టుకుని 200 కేజీల ముడి ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి వ్యవహారాలపై కన్నేసి ఉంచేందుకుగాను హిస్టరీ షీట్లు కూడా తెరిచారు. ఈ కేసులో బెయిల్ పొందిన వీరు 2015లో బయటికి వచ్చారు. ఈ ద్వయం అప్పటి నుంచి తమ దందాను హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చింది. అక్కడి కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తో (విక్రయదారులు) సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారు కొరినప్పుడల్లా సిటీ నుంచి రోడ్డు మార్గంలో ఎఫిడ్రిన్ తీసుకువెళ్లి అప్పగించి వస్తున్నారు. డిసెంబర్ 31 పార్టీలను టార్గెట్‌గా చేసుకున్న ముంబైలోని డ్రగ్ పెడ్లర్లు ఇస్మాయిల్ ద్వయానికి భారీ ఆర్డర్ ఇచ్చారు. దీంతో హై క్వాలిటీ ఎఫిడ్రిన్ తీసుకున్న వీరు ఆదివారం ఉదయం సిటీ నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఎఫిడ్రిన్తో ఉన్న బ్యాగ్‌ను డెలివరీ చేయడానికి వెళుతుండగా అంబోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగేశ్వరి వెస్ట్‌లో ఉన్న అగర్వాల్ ఎస్టేట్స్ వద్ద సంచరిస్తున్న వీరి వ్యవహారంపై అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున 2.40 గంటలకు రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ దయా నాయక్ నేతృత్వంలోని బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా... అందులో మూడు ప్యాక్స్‌లో పార్శిల్ చేసి ఉన్న 20 కేజీల 348 గ్రాముల ఎఫిడ్రిన్ లభించింది. దీనిని స్వాధీనం చేసుకున్న అంబోలీ పోలీసులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మాదకద్రవ్యం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అరెస్టుపై సమాచారం అందుకున్న ఇక్కడి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 2013లో, తాజాగా వీరి వద్ద లభించిన ఎఫిడ్రిన్ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నగర శివార్లలో దీనిని తయారు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించిన మూలాలను కనిపెట్టడానికి ఎన్సీబీ సైతం రంగంలోకి దిగింది. ఇస్మాయిల్‌తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసిన ముంబైలోని అంబోలీ ఠాణా ఇన్స్పెక్టర్ దయా నాయక్‌కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుంది. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌ల్లో ఈయన ఒకరు. 1995లో ముంబై పోలీసు విభాగంలో చేరిన దయా పేరు 2000 ప్రాంతంలో మారుమోగింది. డిటెక్షన్ యూనిట్లో పని చేస్తూ దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈయన అంబోలీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. -
గంజాయి...గుట్టురట్టు...!
ఆయనో స్మగ్లర్...ఢిల్లీకి చెందినవాడు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తరలించేందుకు సిద్ధపడ్డాడు. కానీ బస్సులో వెళ్తే పోలీసుల తనిఖీలు జరిగితే పట్టుబడతానని భావించి ఏజెన్సీలోని డిగ్రీ చదువుతున్న గిరిజన యువకులకు ఎరవేశాడు. గంజాయిని చెప్పిన చోటకు అప్పజెబితే రూ.12వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టే గంజాయిని స్మగ్లర్‌కు అప్పగిస్తుండగా ముగ్గురూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, శృంగవరపుకోట రూరల్: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద (విశాఖ – అరకు ప్రధాన రహదారిలో) గంజాయిని తరలిస్తున్న ఢిల్లీ, విశాఖ ఏజెన్సీలకు చెందిన అజయ్, సోలోమన్, సీతారామశాస్త్రి అనే యువకులు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్.కోట ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు శుక్రవారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అజయ్ అనే గంజాయి స్మగ్లర్ డుంబ్రిగుడ మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చాపరాయి గ్రామ సమీపానికి చేరుకున్నాడు. అరకు, అనంతగిరి మీదుగా ఆర్టీసీ బస్సులో గంజాయిని తీసుకువెళ్తే పోలీసుల సోదాలో పట్టుబడతామని భావించి ద్విచక్ర వాహనంపై గంజాయిని ఎస్.కోట పట్టణ శివారు ప్రాంతంలో అందజేసేందుకు డుంబ్రిగుడకు చెందిన డిగ్రీ యువకులు సోలోమన్, సీతారామశాస్త్రిలను స్మగ్లర్ సంప్రదించాడు. గంజాయిని తరలించేందుకు కేజీకి రూ.వెయ్యి చొప్పున రూ.12వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తరువాత స్మగ్లర్ అజయ్ ఆర్టీసీ బస్సులో ఎస్.కోట పట్టణ శివారున గల హోండా షోరూం సమీపానికి చేరుకున్నాడు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకొచ్చిన ఏజెన్సీ యువకులు స్మగ్లర్ అజయ్‌కు అందజేస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు కాపు కాచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.14వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను విశాఖలోని సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్ఐ అమ్మినాయుడు తెలిపారు. మధ్యవర్తులు హెచ్‌డీటీ ఎన్.కూర్మనాధరావు, వీఆర్వో వడ్డాది శ్రీనివాసరావు, కె.సన్యాసిరావు సమక్షంలో గంజాయితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. -
ఇద్దరూ ఇద్దరే..
సాక్షి, విశాఖపట్నం: వీర్‌కు కేటాయించిన అరకు సీఐ వెంకునాయుడు, సస్పెండ్‌కుగురైన డుం బ్రి గుడ ఎస్ఐ అమనరావు విధి నిర్వహణ ఏ పాటిదో తెలియజేస్తూ ఒక్కొక్కటిగా వారి ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. మన్యంలో మావోయిస్టుల ఆనుపానులనుకనిపెట్టాల్సిన వీరు అందుకు భిన్నంగా స్థానికులపై ప్రతాపం చూపడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్టు పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అమనరావు విధి నిర్వహణకంటే గంజాయిఅక్రమ రవాణాపై ఎక్కు వ ఆసక్తి చూపేవారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి అక్రమరవాణా చేసే వారిని పట్టుకోవడం, వారి నుంచి డబ్బులు గుంజి వదిలిపెట్టడం, గంజాయి అక్రమకేసుల్లో ఇరికిస్తానని బెదిరించ డం వంటివి చేసేవారని తెలిసింది. ఇలా రోజులో ఎక్కువ సమయం గంజాయిపైనే శ్రద్ధ చూపేవారని సమాచారం. అందుకే ఆయనను స్థానికులు గంజాయి డాన్‌గా పరోక్షంగా పిలుచుకునే వారని చెబుతారు. మరోపక్క అరకు సీఐ వెంకునాయుడిపైకూడా చాలాఆరోపణలున్నాయి. దిగువ స్థాయి సాయుధ సిబ్బందితో రోడ్లపై వెళ్లే వాహనాలను తనిఖీలు చేయించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేదనో, హెల్మెట్లు లేవనో చెప్పి కేసులు రాస్తామని బెదిరించి సొమ్ము గుంజేవారని స్థానికులు తెలి పారు. ఇలా వారం, పదిరోజులు కాదు.. నిరంత రం ఇదే తీరును కొనసాగించే వారు. అంతేకాదు.. ఉన్నతాధికారుల కోసమని అరకు పట్టణంలోని రిసార్టులు, హోటళ్లలోరోజు రెండుగదుల చొప్పున తమకు కేటాయించుకునే వారని, వాటిని ఇతరుల కు ఇచ్చేవారన్న ఆరోపణలున్నాయి. అరకులో కనీ సం ఒక్కొక్కగది అద్దె రూ.వెయ్యి నుంచి 3 వేల వరకు ఉంది. రిసార్టులు,హోటళ్లుసుమారు 50 వరకు ఉన్నాయి. ఈలెక్కనరోజుకు వీరికి కేటా యించిన వంద గదులకు కనీసం వెయ్యి రూపాయల చొప్పున చూసినా రూ.లక్ష అక్రమార్జనకు ఆస్కారంఉందని స్థానికుల ఆరోపణ. వీరి తీరుపై అరకు పట్టణ, పరిసర ప్రాంత వాసులు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై స్థానికులు దాడికి దిగి దగ్ధం చేశారు. వీరిపై ఆగ్రహంతో నే విధ్వంసకాండ దిగారని పోలీసు ఉన్నతాధికా రులు తమ విచారణలో తేల్చినట్టు సమాచారం. దీంతో ఘటన జరిగిన రెండు రోజులకే డుంబ్రిగుడ ఎస్ఐ అమనరావును సస్పెండ్ చేశారు. తాజాగా అరకు సీఐ వెంకునాయుడును రేంజ్ వీఆర్‌కు పంపారు. -
వంద కిలోల గంజాయి స్వాధీనం
చీడికాడ(మాడుగుల) : మండలంలోని కోనాం బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద బుధవారం వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 14 మందిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ ఎల్.శిరీష్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోనాం బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో కొందరు అపరిచితులు బ్యాగులతో ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేశారు. అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రం ఎన్నూరు జిల్లాకు చెందిన రాజకుమార్ చంద్రశేఖర్ అనే వ్యక్తి జి.మాడుగుల మండలం ఆగంపాడుకు చెందిన అన్నదమ్ములు గండేరి మత్య్సలింగం,గండేరి రవిబాబును గంజాయి కోసం సంప్రదించాడు. వంద కిలోల గంజాయిని సమకూర్చి, దానిని తరలించేందుకు జి.మాడుగుల సంతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మందిని ఏర్పాటు చేశాడు. ఒకొక్కరికీ రూ.వెయ్యి కూలి ఇచ్చేందుకు నిర్ణయించి, వారికి విద్యార్థులు వినియోగించే 13 బ్యాగుల్లో ఒక్కొక్కదానిలో ఆరు కిలోల చొప్పన ఉంచి ఇచ్చారు. మరో రెండు గోనే సంచుల్లో ఒక్కొక్క సంచిలో 17 కిలోలు చొప్పున 34 కిలోలు ఉంచి తరలిస్తున్నారు. ఈ గంజాయి విలువ రూ. రెండు లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. కేసునమోదు చేసి నిందుతులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. -
బ్యాంకు ఖాతాల్లోకి గంజాయి సొమ్ము
ఎలాంటి ఆదాయ వనరులు, సంపాదన లేని గిరిజన యువకులు రూ.లక్షలు ఖర్చు చేసి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఆదాయ వనరులు లేకపోయినా అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే గంజాయి స్మగ్లర్లు వారి ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారన్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు మన్యంలో ఎనిమిది మండలాల్లో కొన్ని ఖాతాల లావాదేవీలపై నిఘా ఉంచారు. వాటిలోకి పరిచయంలేని వ్యక్తుల ఖాతాల నుంచి నగదు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు తేలింది. ఇలాంటి ఖాతాలు ఐదు వేలు దాటి ఉంటాయని అనుమానిస్తున్నారు.రూ.50 వేల నుంచి లక్ష దాటి నగదు జమైన ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించనున్నారు. కొయ్యూరు(పాడేరు): రూపాయి ఆదాయం లేని వ్యక్తి ఒకేసారి లక్ష విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అంత సొమ్ము ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఏదో చేసి ఉంటాడన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మన్యంలో కొన్ని మండలాల్లో ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు ఖరీదైన ద్విచక్ర వాహనాలను కొంటున్నారు. విలాసాలకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు అలాంటి వారిపై నిఘా ఉంచారు. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిలో కొందరు గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్నట్టుగా తేలింది.గతంలో డబ్బులను నేరుగా ఇచ్చేవారు. ఇప్పుడు నగదు కొరత కారణంగా ఖాతాల్లో వేస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.ఇక్కడ వారిని విచారిస్తే గంజాయి స్మగ్లర్ల భరతం పట్టే వీలుంటుందని భావిస్తున్నారు. మన్యంలో 11 మండలాలు ఉంటే వాటిలో ఎనిమిది మండలాల్లో జరుగుతున్న వ్యవహారాలపై నిఘా ఉంచా రు. డుంబ్రిగుడ, పాడేరు,ముంచంగిపుట్టు, పెదబయలు,గూడెంకొత్తవీధి,హుకుంపేట, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో ఖాతాలను పరిశీలిస్తున్నారు. కొయ్యూరు మండలంలో గంజాయి పండించకపోయినా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న కొందరు అనుమానితులపై పోలీసులు నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని ఖాతాలను పరిశీలించినట్టు సమాచారం. వాటి ఆదారంగా స్మగ్లర్లకు సహకరిస్తున్న వారిని ప్రశ్నించనున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోను గంజాయి ఎక్కడ బయటపడినా అది విశాఖ మన్యం నుంచే రవాణా అయినట్టు తేలుతోంది. ఎౖMð్సజ్ శాఖ కూడా గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు వీలుగా నర్సీపట్నం,పాడేరుతో పాటు కొయ్యూరులో రెండు ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ♦ ఈ రెండున్నర సంవత్సరాల్లో పోలీసులు 150 టన్నుల గంజాయిని పట్టుకున్నారు. ♦ ఎక్సైజ్ శాఖ 35 టన్నుల గంజాయి పట్టుకుంది. ఇలా రెండు శాఖలు పట్టుకున్న గంజాయి విలువ రూ.60 కోట్ల వరకు ఉంటుంది. -
గంజాయి ముఠా ఆటకట్టు
నల్లగొండ క్రైం : నల్లగొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, అమ్ముతున్న పది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ ముఠా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన కొండ అంజమ్మ, నల్లగొండ పాతబస్తీకి చెందిన కల్లెపల్లి కిరణ్‌కుమార్, జేబీఎస్ వాసి రావిల్ల నర్సింహ, మునుగోడు రోడ్డులోని మహ్మద్ గౌస్, అక్కచెల్మకు చెందిన బల్గూరి రాజు, మహ్మద్ మూజుబుద్దీన్, షేక్ రఫీ, ప్రకాశం బజార్‌లోని టిటాంక్ రచన్‌సింగ్, తిల్పితీయ సమందర్‌సింగ్, నార్కట్‌పల్లికి చెందిన బాజ శివకుమార్‌లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోడ్రైవర్లుగా, పండ్లబండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేస్తున్నారు. సైడ్ బిజినెస్‌కు గంజాయి దందాను ఎంచుకున్నారు. వీరు అరకు, శ్రీశైలం, దూల్‌పేట ప్రాంతాలనుంచి ఒకటి, రెండు కేజీల చొప్పున తక్కువ ధరకు కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకువస్తున్నారు. టిప్పర్ సిగరెట్, చిన్న ప్యాకెట్లలో సర్దుబాటు చేసి ఒక్కోటి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. గంజాయి కస్టమర్లు నల్లగొండ పట్టణంలో వందమంది దాకా ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో వీరిపై పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం వీరు నల్లగొండ పట్టణ శివారులో గోకుల్ బీఈడీ రోడ్డులో, రైల్వెస్టేషన్ రోడ్డు, నార్కట్‌పల్లి ఎస్సీ కాలనీ, నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో గంజాయి అమ్ముతుండగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నాయి. వీరినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అంజమ్మపై గతంలో గంజాయి అమ్మిన కేసు ఉంది. అదే విధంగా బల్గూరి రాజుపై నల్లగొండ వన్‌టౌన్‌లో రౌడీషీట్, మూజుబుద్దీన్‌పై కిడ్నాప్, కొట్లాట, షేక్ రఫీపై ఎస్సీ, ఎస్టీ కేసు, టిటాంక్ రచన్‌పై గంజాయి, హత్యాయత్నం, చీటింగ్ కేసులు ఉన్నాయి. కాల్‌డేటా ఆధారంగా కదలిన డొంక గంజాయి డొంకను పోలీస్‌లు కాల్‌డేటా ఆధారంగా ఛేదించారు. అమ్మేవారిని, కొనేవారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఏడేళ్ల క్రితం గంజాయి అమ్మిన ఓ వ్యక్తి పోలీస్‌లకు దొరకడంతో అప్పుడు అమ్మడం మానివేశాడు. మళ్లీ ఆరు నెలలుగా గంజాయి అమ్ముతున్నాడు. అతని కాల్‌డేటా ఆధారంగా గుర్తింపు అదుపులోకి తీసుకుని విచారణ జరిపగా, డొంక బయటపడింది. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి మూలాలను కదిలిస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. సమావేశంలో సీఐలు వెంకటెశ్వర్లు, రవికుమార్, పీఎన్డీ ప్రసాద్, సుబ్బిరాంరెడ్డి, క్యాస్ట్రో రెడ్డి, గోవర్దన్, 2టౌన్ ఎస్ఐ మధు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై వేటు?
విశాఖపట్నం: గంజాయి అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ నాయుడుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్ నాయుడు పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంపై ‘ఎక్సైజ్, స్మగ్లర్ భాయిభాయి.. ఎంచక్కా గంజాయ్’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించారు. నాయుడుపై కేసు నమోదుకు సంబంధించి విజయవాడ పోలీసుల నుంచి ఎక్సైజ్ అధికారులకు అధికారిక సమాచారం ఇంకా అందలేదు. నేడో, రేపో సమాచారం రాగానే ఆయనపై చర్యలు (సస్పెన్షన్) తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో నాయుడు పరారీలో ఉన్నారు. ఈ గండం నుంచి తనను గట్టెక్కించాలని జిల్లాకు చెందిన ఓ మంత్రిని కానిస్టేబుల్ నాయుడు ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్ టీమ్ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎక్సైజ్ సోమవారం స్టాట్యుటరీ నోటీస్ జారీ చేయనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 120 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: రైళ్లలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను జీఆర్పీ బృందం క్రమంగా అడ్డుకట్ట వేస్తోంది. ఈ నెల 12న ఒక క్వింటాలు గంజా యిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన రైల్వే పోలీసులు సోమవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మరో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రయ్య, ఎస్ఐలు బి.ప్రమోద్‌కుమార్, నాగే«శ్వర్‌రెడ్డి, వీరలింగం నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చిన లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించింది. జనరల్ బోగీలో అనుమానాస్పదంగా లగేజీ బ్యాగులు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారివద్ద 120 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి ముంబైకి రవాణా చేస్తున్నట్లు నిందితులు బసుదేబ్(40), సంజయ్ కుమా ర్(21), గౌరవ్ చంచన్(40) పోలీసుల విచారణలో అంగీకరించారు. -
ముందు ‘పైలట్’.. వెనుక ‘ట్రాన్స్పోర్ట్’!
- పకడ్బందీగా గంజాయి అక్రమ రవాణా - విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు సరఫరా - ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు - పరారీలో మరో ముగ్గురు సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు, పెరిగిన పోలీసు నిఘా నేపథ్యంలో స్మగ్లర్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘పైలట్... ట్రాన్స్పోర్ట్’ విధానంలో అక్రమ రవాణా అవుతున్న 240 కిలోల గంజాయిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలి స్తున్నారు. నల్లకుంటకు చెందిన రవి, ఖానాజీ గూడ వాసి కృష్ణ, ఎల్బీనగర్కు చెందిన మధు, అంబర్‌పేటవాసి నరేశ్, భువనగిరి వాసి వెం కన్న ఓ ముఠాగా ఏర్పడ్డారు. 9 నెలలుగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు రెండు కార్లలో తీసుకువచ్చి మహారాష్ట్రలో హోల్‌సేల్‌గా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గడిచిన పది రోజులుగా పంథా మార్చి రెండు వాహనాల్లో ఒక దాన్ని పైలట్‌గా, మరోదాన్ని గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారు. రెండు వాహనాల మధ్య గరిష్టంగా రెండు కిలో మీట ర్ల దూరం ఉండేలా పథకం వేశారు. పోలీసుల కదలికలు, తనిఖీలను గుర్తించే పైలట్ వాహ నం లోనివారు వెనుక వస్తున్న వాహనంలోని వారికి సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చే ఈ గ్యాంగ్ రెండు వాహనాలను కొన్ని గంటలపాటు ఫీవర్ ఆస్పత్రి వద్ద పార్కింగ్‌లో ఉంచుతారు. ఆపై అదును చూసుకుని ముందుకు వెళ్తారు. దీనిపై ఇటీవల వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసు లకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వం లోని బృందం ఈ ముఠాపై నిఘా ఉంచింది. శుక్ర వారం ఈ గ్యాంగ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా హైటెక్ సిటీ సమీపంలో వాహనాలు నిలుపుకున్నారు. ఓ కారులో 240 కిలోల గంజాయి నింపుకున్నారు. సాంకేతిక ఆధా రాలను బట్టి ఈ రెండు వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఆపితే వెనుక వచ్చే రవాణా వాహనం తప్పించుకునే అవకాశం ఉందని భావించారు. దీంతో నార్సింగి టోల్గేట్ దగ్గర కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పైలట్ వాహనాన్ని విడిచిపెట్టి వెనుక వస్తున్న వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయగా అందులో 240 కిలోల గంజాయి పార్శిల్స్ లభించాయి. వాహనం నడుపుతున్న నరేశ్‌తోపాటు అందులో ఉన్న మధును అరెస్టు చేశారు. వెనుక వస్తున్న వాహనం కనిపించక పోవడంతో కొద్దిదూరం వెళ్లిన పైలట్ వాహనంలోని రవి, కృష్ణ వాహనాన్ని ఓఆర్ఆర్పై వదిలి పరారయ్యారు. దీంతో ఈ కారునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరితోపాటు వెంకన్న కోసమూ గాలిస్తున్నారు. -
270 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు రూరల్ : ఏజెన్సీ నుంచి మైదానానికి వాహనంలో తరలిస్తున్న 270 కిలోల ఎండు గంజాయిని గురువారం సాయంత్రం పాడేరు పోలీసులు పట్టుకున్నారు. దీనివిలువ రూ.6 లక్షలు ఉంటుం దని అంచనా.జి.మాడుగుల మండ లం బంధవీధి నుంచి బొలేరో వాహనంలో పాడేరు మీదుగా చోడవరానికి గంజాయి తరలిస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు పాడేరు-జి.మాడుగుల ర హదారిలోని కరకపుట్టు జంక్షన్ వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశామని ఎస్ఐ సూర్యప్రకాశ్ చెప్పారు. బంధవీధికి చెందిన ఉడిపి వరహాలును అరెస్ట్ చేశారు. -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : నలుగురు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి, వారి నుంచి *7 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ పింగిలి నరేష్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం... మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన దరంసోత్ రాంకోటి, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సమీపంలోని దామ ప్రాంతానికి చెందిన ధర్మేంద్రజైన్ కొంతకాలంగా మానుకోటలోనే నివాసముంటున్నారు. గతంలో ధర్మేంద్ర జైన్ నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా పనిచేసి అవినీతికి పాల్పడి సస్పెండయ్యాడు. అప్పటి నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాంకోటి, ధర్మేంద్రజైన్కు మానుకోటకు చెందిన వెంకటనర్సింహారావుతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మానుకోట రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. రెండు బ్యాగుల్లో 52 కేజీల ఎండుగంజాయితో దొరికారు. పక్కా సమాచారం మేరకే ఆదివారం సాయంత్రం రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస థియేటర్ ఎదుట ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొరికిన 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని విచారించగా మరొకరి పేరు బయటపెట్టారు. వారి సమాచారంతో మానుకోట శివారు ఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్న దరంసోత్ కమల ఇంటిపై దాడి చేయగా 13 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంతోపాటు మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. ధర్మేంద్రజైన్, రాంకోటి, నర్సింహారావు విశాఖపట్నంలో *మూడున్నర లక్షల ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. కేజీ *5 వేల చొప్పున కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి కిలో 10 వేలు ఆదాయం ఆర్జించేలా భోపాల్‌లో విక్రయించేందుకు మానుకోట రైల్వేస్టేషన్‌కు వస్తున్నట్లు విచారణలో తేలింది. అనంతరం ఆ నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ధర్మేంద్రజైన్, కమలతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడి శిక్ష అనుభవించారని, పాత కేసుల్లో ఇద్దరు నిందితులేనని తెలిపారు. గంజాయి కేసు నిందితులను పట్టుకున్న టౌన్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బందికి ఎస్పీతో మాట్లాడి వారికి రివార్డులను అందజేస్తామని సీఐ తెలిపారు. టౌన్ సీఐ ప్రసాదరావు, సిబ్బంది నర్సింగరావు, దేవ్‌సింగ్, శంకర్ పాల్గొన్నారు.