మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం | Police Check For Drug Trafficking | Sakshi
Sakshi News home page

మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Published Mon, Jun 7 2021 8:20 AM | Last Updated on Mon, Jun 7 2021 8:20 AM

Police Check For Drug Trafficking - Sakshi

పుంగనూరు : గంజాయి విక్రేతల అరెస్ట్‌ చూపుతున్న సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు

మత్తును చిత్తు చేసేందుకు పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. గుట్కా.. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుదిట్టంగా కసరత్తు చేస్తోంది. నిషేధిత పదార్థాల విక్రయాన్ని అరికట్టేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. చెక్‌పోస్టుల వద్ద  వాహనాలను తనిఖీ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటోంది. పట్టుబడిన నిందితులపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కు నెట్టేస్తోంది.  

సాక్షి, తిరుపతి: జిల్లాలో మత్తు పదార్థాల విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలను ముమ్మరంగా చేసి అక్రమ వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఫిర్యాదుతో తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే తిరుపతి మున్సిపల్‌ కౌన్సిల్‌ సైతం ఆధ్యాతి్మక నగరంలో గుట్కా అమ్మకాలను అరికట్టే దిశగా తీర్మానం చేసింది.

పొరుగు రాష్ట్రాల నుంచే.. 
ప్రజల ఆరోగ్యరక్షణ కోసం ప్రభుత్వం గుట్కా, పాన్‌పరాగ్, హాన్స్‌ తదితర పదార్థాలపై నిషేధం విధించింది. అయితే కొందరు నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా చేస్తున్నారు. బస్సులు, కార్లు, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల ద్వారా పార్సిళ్లు తెప్పించుకుంటున్నారు. ఈ విధంగా తీసుకువచ్చిన ప్యాకెట్లను  తిరుపతి, చిత్తూరు , శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, మదనపల్లె తదితర అర్బన్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి నిత్యావసర సరుకుల మాటున గ్రామాల్లోని దుకాణాలకు సైతం చేరవేస్తున్నారు.

సరదాగా మొదలై.. 
గుట్కా, గంజాయి, పాన్‌ పరాగ్, హాన్స్‌ని కొందరు స్నేహితులతో సరదాగా వినియోగిస్తున్నారు. అది కాస్తా వ్యసనంగా మారి మత్తు ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో పలు వ్యాధులకు గురై చివరకు ప్రాణాలనే కోల్పోతున్నారు. ముఖ్యంగా యువతే అత్యధికంగా నిషేధిత ఉత్పత్తులను వాడుతున్నారు. మత్తుకు అలవాటు పడి ఎంత ధర చెల్లించైనా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెట్టింపు రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 

అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు, విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి గుట్కా, పాన్‌ పరాగ్, హాన్స్, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.

పాత తిరుచానూరు రోడ్డులో ఫిజియోథెరపీ ప్రాక్టీస్‌ చేస్తున్న జయప్రకాష్‌ , కొందరు స్నేహితులతో కలిసి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. కిలో గంజాయిని రూ.16వేలకు కొనుగోలు చేసి ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  
తిరుపతిలో పోలీసులు  ఇటీవల చేసిన వరుస దాడుల్లో  సుమారు రూ.కోటి విలువైన గుట్కా, పాన్‌ పరాగ్, హాన్స్, విదేశీ బ్రాండ్‌ సిగరెట్లు భారీగా పట్టుబడ్డాయి. 
ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని పలు కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న గుట్కా, పాన్‌ పరాగ్, హాన్స్‌ ప్యాకెట్లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. 
మదపనపల్లె పరిధిలో ఇటీవల రూ.5 లక్షలకు పైగా విలువైన గంజాయిని స్వా«దీనం చేసుకుని 8మందిని అరెస్ట్‌ చేశారు. 
నగరి పరిధిలో ఓజీ కుప్పం చెక్‌పోస్టు వద్ద 2.2 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. 
పిచ్చాటూరు సమీపంలోని కీళపూడి వద్ద రూ.1.50 లక్షల విలువైన హాన్స్‌ ప్యాకెట్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.  
బెంగుళూరు నుంచి కూరగాయల వాహనంలో తరలిస్తున్న రూ. 33 లక్షలు విలువైన గుట్కా, పాన్‌ పరాగ్‌ ప్యాకెట్లను గంగవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. 
పలమనేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు బెంగుళూరు నుంచి వాహనంలో తీసుకొస్తున్న రూ.82 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. 
తాజాగా ఆదివారం పుంగనూరులో గంజాయి విక్రయిస్తున్న ఆవుల కృష్ణ, ఆవుల కృష్ణప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్‌’ జెండా!  
కోవిడ్‌ సోకిందని గొంతుకోసుకున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement