షాపు తెరవడానికి వీలు లేకుండా నిలిపి ఉంచిన ట్రాక్టర్ (ఫైల్)
‘పోలీసైతే చాలు.. లైసెన్స్ లేదని వంద నొక్కేయొచ్చు... దొంగోడి దగ్గర సగం కొట్టేయొచ్చు.. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి దగ్గరా దండుకోవచ్చు.. అంతెందుకు అసలు ఎవడినైనా తొక్కేయొచ్చు.. ’’
ఓ సూపర్ హిట్ తెలుగు సినిమాలో అవినీతి పోలీసులపై పూరీ జగన్నాథ్ పంచ్ డైలాగ్ ఇది.. ఇప్పుడు ఇదే డైలాగ్ జిల్లాలోని ఒకరిద్దరు అక్రమార్కులకు కచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాలి. చాలామంది పోలీసులు నిజాయితీగానే పని చేస్తున్నప్పటికీ.. కొద్దిమంది చేతివాటం, అడ్డగోలు అక్రమార్జన ఇప్పుడు వివాదాస్పదమై జిల్లా పోలీసు శాఖలోనే చర్చనీయమైంది. అసలు విషయమేమిటంటే...
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న హథీరాంజీ కాలనీలో బొడ్డు జయ చంద్ర అనే వ్యాపారి రెయిన్‌బో కలెక్షన్స్ పేరిట చిన్నపాటి రెడీమేడ్ దుస్తుల షాపు పెట్టుకున్నారు. ఈ మేరకు షాపు భవన యజమాని మాధవీదేవితో 2018 మే నెల 9వ తేదీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. కనీసం ఐదేళ్లపాటు ఆ షాపును అక్కడే కొనసాగించేందుకు సమ్మతిస్తూ ఇరువర్గాలు మాట్లాడుకున్నాయి.
చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో
ఆ క్రమంలో అక్కడ జయచంద్ర దాదాపు ఏడులక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉండగా, సరిగ్గా 16 నెలలకు మాధవీలత తరఫున కొందరు వచ్చి షాపు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ‘ఇదేమిటి.. ఇప్పుడే చాలా పెట్టుబడి పెట్టాను.. ఐదేళ్ల వరకు కాకపోయినా కొన్నాళ్లు ఆగండి’ అని జయచంద్ర చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. వాదోపవాదాలు, ఘర్షణల స్థాయికి వెళ్తుండడంతో అతను 2019 నవంబర్‌లో తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. అప్పటి నుంచి వివాదం కోర్టులోనే ఉంది. ఇక్కడి వరకు జరిగిన పరిణామాలు చాలా చోట్ల అందరూ చూసే ఉంటారు. వినే ఉంటారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది.
అక్రమంగా చొరబడి.. దౌర్జన్యం చేసినా..
వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈనెల 5వ తేదీన ఆదివారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి షాపులోకి జొరబడి.. అక్కడ పనిచేస్తున్న ఓ యువతిని బయటకి పంపివేసి.. షాపునకు తాము తెచ్చుకున్న తాళం వేసి వెళ్లిపోయారు. ఇదంతా సీసీ రికార్డుల్లో నమోదు కావడంతో ఆ ఫుటేజీని తీసుకుని జయచంద్ర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే తన షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆ స్టేషన్‌లోని ఓ అధికారి ముందు కూర్చుని ఉన్నారు. దీంతో జయచంద్ర ‘సర్.. వీళ్లు నేను లేని సమయంలో నా షాపులోకి వచ్చి దౌర్జన్యం చేశారు... కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడైన జయచంద్రపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం తమాషాలు చేస్తున్నావా.. వెంటనే ఖాళీ చేయి.. లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేస్తా.. అని బెదిరించారు. దీంతో బిత్తరపోయిన జయచంద్ర వెంటనే ఉన్నతాధికారిని కలిసి విషయం చెప్పడంతో ఎట్టకేలకు 6వ తేదీన ఎఫ్‌ఐఆర్(నెం721) నమోదైంది. 448, 427, 341, 506 డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద మాధవీదేవీపైనా కేసు నమోదు చేశారు. కానీ షాపు తాళాలు మాత్రం ఇప్పించేందుకు పోలీసులు నిరాకరించారు.
విషయం కోర్టులో ఉంది కదా.. వేచిచూడాలంటూ దాటవేశారు. అయితే ఇదిలా ఉండగానే డిసెంబర్ 21వ తేదీన మరోసారి గుర్తుతెలియని దుండగులు వచ్చి షాపు షట్టర్ తెరిచి లోపల ఉన్న దుస్తుల సరుకును చిందర వందర చేసి పడేశారు. మొత్తం సరుకుతో పాటు టేబుల్స్, రాక్స్, హాంగర్స్, డిస్‌ప్లే మోడల్స్ అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంటనే బాధితుడు జయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఎఫ్‌ఐఆర్ (నం.735)తో 448, 427 సెక్షన్ల కింద మాధవీదేవిపైనా కేసులు నమోదు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా దౌర్జన్యం చేసినా, దానిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడమే ఇప్పుడు చర్చకు తెరలేపింది.
పోలీసులే నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరం
నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి జీవనోపాధికి బట్టల షాపు పెట్టుకున్నాను. ముందుగానే మాట్లాడుకుని ఓనరుతో ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ వివాదం రేగడంతో కోర్టును ఆశ్రయించాను. కానీ ఓనర్ తరఫున వాళ్లు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఓ అధికారి అయితే స్వయంగా బెదిరించారు. కనీసం షాపు వద్దకు వచ్చి విచారణ చేయాల్సిందిగా ఎన్నిమార్లు బతిమాలినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఘటనా స్థలానికి కూడా రాలేదు. పోలీస్‌స్టేషన్‌కు 200 అడుగుల దూరంలోనే మా షాపు ఉంటుంది. ఇలాగైతే ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎలా ఎక్కుతారు?
– జయచంద్ర, ఫిర్యాదుదారు
Comments
Please login to add a commentAdd a comment