రాజ్యలక్ష్మి (ఫైల్)
తిరుపతి(చిత్తూరు): తల్లి మరణించిందన్న సంగతి తెలియని కుమారుడు 4 రోజుల పాటు ఆమె మృతదేహం పక్కనే నిద్రించాడు. తల్లి నిద్రపోతోందని భావించి.. రోజూ స్కూల్‌కు కూడా వెళ్లొచ్చేవాడు. ఇంట్లో మిగిలి ఉన్న ఆహారాన్ని, చిరు తిండ్లను భుజిస్తూ గడిపేశాడు. చివరకు మృతదేహం నుంచి దుర్వా సన రావడంతో మేనమామకు ఫోన్ చేసి ‘అమ్మ నిద్రపోతోంది. ఇల్లంతా వాసన వస్తోంది. ఆపరేషన్ చేయిద్దాం రండి’ అని చెప్పడంతో బిత్తరపోయిన ఆయన హుటాహుటిన వెళ్లగా.. అసలు విషయం వెలుగు చూసింది. తిరుపతి విద్యానగర్ కాలనీలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజ్యలక్ష్మి (41) ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయి మానసిక ఎదుగుదల లేని కుమారుడు శ్యామ్‌కిశోర్ (10)తో వేరుగా ఉంటోంది. ఈ నెల 8న రాజ్యలక్ష్మికి వాంతులయ్యాయి. దీంతో తీవ్రంగా నీరసపడిన ఆమె నేలపై పడుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు శ్యామ్‌కిశోర్ గమనించినా.. తల్లి నిద్ర పోతోందనుకున్నాడు. లేపితే కోప్పడుతుందేమోననుకుని అలాగే ఉండిపోయాడు.
రోజూ రాత్రివేళ తల్లి మృతదేహం పక్కనే పడుకునేవాడు. 4 రోజులు తర్వాత శవం నుంచి దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం రాత్రి మేనమామ దుర్గాప్రసాద్‌కు ఫోన్‌చేశాడు. అమ్మ 3 రోజులుగా నిద్రపోతోందని, ఇల్లంతా వాసన వస్తోందని, అందువల్ల అమ్మకు ఆపరేషన్ చేయిద్దాం రండి అన్నాడు. మేనమామ దుర్గాప్రసాద్ వెంటనే ఘటనా స్థలికి వెళ్లి చూశాడు. నేలపై కుళ్లిన చెల్లెలి మృతదేహాన్ని చూసి విలపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మానసిక ఎదుగుదల లేని కారణంగానే శ్యామ్‌కిషోర్ ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment