సాక్షి, అమరావతి: అక్రమ మద్యం రవాణా, అమ్మకాల నిరోధానికి ఏర్పాటైన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) లాఠీ ఝళిపిస్తోంది. యువ ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఎస్‌ఈబీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి రవాణా అవుతున్న అక్రమ మద్యం, రాష్ట్రంలోని నాటుసారా బట్టీలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్‌ఈబీ టీమ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే ఇసుక రవాణాలో లొసుగులను గుర్తించేందుకు ‘సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించిన సంగతి తెల్సిందే. అనంతరం అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం మత్తు వదిలించే పనిలో పడింది. ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్‌ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్‌లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఏఎస్పీలు రిషాంత్‌రెడ్డి (చిత్తూరు), వకుల్ జిందాల్ (కృష్ణా), గౌతమిశాలి (కర్నూలు) స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ మద్యం అంతు చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తూ.. రాష్ట్రంలో నాటుసారా తయారయ్యే ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు.
953 మంది అరెస్ట్
► తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి కారులో తీసుకొస్తున్న 1,846 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల వద్ద దాచేపల్లి ఎస్సై బాలనాగిరెడ్డి పట్టుకున్నారు.
► ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి అక్రమ మద్యం తరలిస్తున్న 953 మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఎక్సైజ్, ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు.
► వీరి నుంచి 10,088 మద్యం బాటిళ్లు, 465 టెట్రా ప్యాకెట్లలోని మద్యం, మరో 442 టెట్రా ప్యాక్‌ల సుంకం చెల్లించని (ఎన్‌డీపీ) మద్యం స్వాధీనం చేసుకున్నారు.
► మరోవైపు నాటుసారా తయారీపై నిఘా పెట్టారు. 7,062.5 లీటర్ల నాటుసారా, 11,345 కిలోల బెల్లం, 25,794 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.
► గంజాయి రవాణాపైనా ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించింది. గడచిన నాలుగు రోజుల్లో 172.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు.
► మొత్తానికి మద్యం, నాటుసారా, గంజాయి తరలిస్తున్న కేసులకు సంబంధించి 309 వాహనాలు సీజ్ చేశారు.
అక్రమ మద్యంపై ‘ఎస్‌ఈబీ’ లాఠీ
Published Tue, May 19 2020 4:09 AM | Last Updated on Tue, May 19 2020 8:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment