Illegal alcohol sales
-
అక్రమ మద్యంపై ‘ఎస్ఈబీ’ లాఠీ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం రవాణా, అమ్మకాల నిరోధానికి ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) లాఠీ ఝళిపిస్తోంది. యువ ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఎస్ఈబీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి రవాణా అవుతున్న అక్రమ మద్యం, రాష్ట్రంలోని నాటుసారా బట్టీలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్ఈబీ టీమ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే ఇసుక రవాణాలో లొసుగులను గుర్తించేందుకు ‘సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించిన సంగతి తెల్సిందే. అనంతరం అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం మత్తు వదిలించే పనిలో పడింది. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్‌లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఏఎస్పీలు రిషాంత్‌రెడ్డి (చిత్తూరు), వకుల్ జిందాల్ (కృష్ణా), గౌతమిశాలి (కర్నూలు) స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ మద్యం అంతు చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తూ.. రాష్ట్రంలో నాటుసారా తయారయ్యే ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. 953 మంది అరెస్ట్ ► తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి కారులో తీసుకొస్తున్న 1,846 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల వద్ద దాచేపల్లి ఎస్సై బాలనాగిరెడ్డి పట్టుకున్నారు. ► ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి అక్రమ మద్యం తరలిస్తున్న 953 మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఎక్సైజ్, ఎన్డీపీఎస్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. ► వీరి నుంచి 10,088 మద్యం బాటిళ్లు, 465 టెట్రా ప్యాకెట్లలోని మద్యం, మరో 442 టెట్రా ప్యాక్‌ల సుంకం చెల్లించని (ఎన్డీపీ) మద్యం స్వాధీనం చేసుకున్నారు. ► మరోవైపు నాటుసారా తయారీపై నిఘా పెట్టారు. 7,062.5 లీటర్ల నాటుసారా, 11,345 కిలోల బెల్లం, 25,794 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. ► గంజాయి రవాణాపైనా ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించింది. గడచిన నాలుగు రోజుల్లో 172.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. ► మొత్తానికి మద్యం, నాటుసారా, గంజాయి తరలిస్తున్న కేసులకు సంబంధించి 309 వాహనాలు సీజ్ చేశారు. -
మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి
వరంగల్ రూరల్: రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడినందున అక్రమ మద్యం, బెల్లం,గుడుంబా అమ్మకాలను నియంత్రించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఐఎంఎఫ్ఎల్, ఐడీసీ, అక్రమ తరలింపులను అడ్డుకోవాలని సురేష్ రాథోడ్ చెప్పారు. ప్రతి వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పనిచేసేలా చూడాలని ఆయన తెలి పారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్1, ఆర్2, రిజిష్టర్లను నిర్వహించాలని తెలిపా రు. ఎక్కువ మద్యం అమ్మితే ఆ రిటేల్ షాపుల వివరాలు తమకు ఇవ్వాలని సురేష్ రాథోడ్ వివరించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వాట్సప్ గ్రూపునకు అందుబాటులో ఉండాలని చెప్పారు. సెల్ మెసేజ్‌లకు స్పందించాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అరగంటలోపే స్పందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు అడగవద్దని ఆయన స్పష్టం చేశారు. సి–విజిల్ ఫిర్యాదులకు స్పందించాలని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరినైనా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినప్పుడు కొట్టకూడదని సురేష్ రాథోడ్ అన్నారు. 24 గంటలు పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వరంగల్ రూరల్ పి.శ్రీనివాసరావు, వరంగల్ అర్బన్ బాలస్వామి, మహబూబాబాద్ డీపీఈఓ దశరథ్, భూపాలపల్లి డీపీఈఓ శశిధర్‌రెడ్డి, జనగామ డీపీఈఓ మహిపాల్ రెడ్డి, సీఐలు, పాల్గొన్నారు. -
సిండికేట్లే నిర్ణేతలు!
సాక్షి, గుంటూరు: సిండికేట్ల కనుసన్నల్లో జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత కూడా యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మండలం లేదా మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నింటిని సిండికేట్‌గా చేసి, నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సిండికేట్లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తుండటంతో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 353 మద్యం షాపులు, 185 బార్లు ఉన్నాయి. ఒక్కొక్క మద్యం దుకాణం పరిధిలో పదికి పైగా చొప్పున జిల్లా వ్యాప్తంగా 800 వరకు బెల్టు షాపులు ఉన్నాయని సమాచారం. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించి వాటి పర్యవేక్షణ బాధ్యతలు ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. ఎక్సైజ్ అధికారులు మాత్రం మద్యం దుకాణాల సిండికేట్ల కనుసన్నల్లో నడుస్తూ వారు చెప్పినట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బెల్టుషాపులు రద్దు చేస్తామంటూ నాలుగేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం విదితమే. అయితే అప్పటి నుంచి నేటి వరకు బెల్టుషాపుల తొలగింపుపై పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ ముఖ్యనేతలే బెల్టుషాపుల జోలికి వెళ్లొద్దంటూ ఎక్సైజ్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారపార్టీ నేతలు పలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సిండికేట్లుగా మారి హవా సాగిస్తున్నారు. ఇష్టం వచ్చిన సమయానికి మద్యం దుకాణాలు తెరిచి అర్ధరాత్రి దాటాక కూడా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం షాపుల్లోనూ లూజు విక్రయాలు సాగిస్తున్నారు. సిండికేట్ల నుంచి అధికార పార్టీ ముఖ్యనేతలకు, ఎక్సై జ్, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటంతో వారు ఏం చేసినా పట్టించుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చేశారు. వేలంలో బెల్టుషాపుల కేటాయింపు జిల్లాలోని ఓ మంత్రి నియోజకవర్గంతోపాటు, అధికారపార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సిండికేట్ల హవా ఎక్కువగా ఉంది. బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించి మరీ లక్షల్లో డబ్బు దంకుంటున్నారు. వేలం పాటల్లో బెల్టుషాపులు దక్కించుకున్న నిర్వాహకులు గ్రామాల్లో వీధికో బ్రాంచ్ చొప్పున ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలు వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. తెనాలి, రేపల్లె వంటి ప్రాంతాల్లో బెల్టుదుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించినా వాటిని అడ్డుకునే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారంటే అధికార పార్టీ నేతల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మిగతా ప్రాంతాల్లో సైతం మద్యందుకాణాల నిర్వాహకులు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. సిండికేట్ అయితే అధిక ధరలకు మద్యం అమ్మడంతోపాటు, ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామాలు, వార్డుల్లో బెల్టుదుకాణాలు నడుపుకోవచ్చనే ఆశతో వారి గుప్పెట్లోకి వెళ్తున్నారు. సిండికేట్‌లో చేరకుంటే ఇబ్బందులే.. తమతో చేతులుకలపని మద్యం దుకాణాలపై సిండికేట్లు కక్షసాధింపు చర్యలకు దిగుతూ వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. ఎక్సైజ్ శాఖను తమ గుప్పెట్లో పెట్టుకుని దాడులు చేయించి, కేసులు పెట్టిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సైతం సిండికేట్ల ఆదేశాలను పాటిస్తూ అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం జిల్లాలో పల్నాడు ప్రాంతంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాం. బెల్టుషాపులపై గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో గతంలో బెల్టుషాపులు నిర్వహిస్తూ పట్టుబడిన 30 మందిని తహసీల్దారు వద్ద హాజరు పరిచి రూ.15వేల వరకు జరిమానా విధిస్తున్నాం.మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. – శ్రీమన్నారాయణ, ఎక్సైజ్ డీసీ -
మద్యం మాఫియా!
మద్యం మాఫియా పేట్రేగిపోతోంది. పొరుగు రాష్ట్రం నుంచి విచ్చల విడిగా మద్యం దిగుమతి అవుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ మాఫియా అక్రమ మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయలను దండుకుంటోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తూ మేమున్నామని గుర్తు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దాడులు చేసే సమయంలో మద్యం స్వాధీనం చేసుకొని యజమానులపై కాకుండా అక్కడ ఉండే పనోళ్లపై కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉంది. జోరుగా ‘నకిలీ’ దందా - జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు - సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి - మెండుగా అధికారుల అండదండలు - మామూళ్లలో తేడా వస్తేనే దాడులు - ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి సంగారెడ్డి క్రైం: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెల్టు షాపుల్లోకి సరిహద్దు రాష్ట్రాల సరుకు దిగుతోంది. జిల్లాలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తోన్న లిక్కర్ మాఫియా గోవా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి బెల్ట్ షాప్‌ల ద్వారా గ్రామీణ ప్రాం తాల్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగి స్తోంది. ఇందులో నకిలీ మద్యం కూడా ఉంటోంది. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కాసులు కురిపిస్తే చాలనుకుంటున్న మాఫియా పల్లెపల్లెకూ విస్తరించింది. జిల్లాలో ప్రభుత్వ లెసైన్సులతో నడుస్తోన్న మద్యం దుకాణాల కంటే పదింతలు బెల్ట్ షాప్‌లు నడుస్తున్నాయి. బెల్ట్ షాప్‌ల విషయంలో ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడం, ఆదాయం తగ్గకూడదంటే జనం ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదన్న ధోరణితో వ్యవహరిస్తోండడం.. అటు మాఫియాకు, ఇటు అధికారులకు కలిసొచ్చిన అంశంగా మారింది. మామూళ్ల రాకలో తేడావస్తే దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇటీవల వెలుగు చూసిన నకిలీ మద్యం గుట్టు.. సంగారెడ్డి మండలం కవలంపేట వద్ద గల ఓ ఫాంహౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు గత నెల 17న దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు రూ.15 లక్షల విలువ చేసే 445 కాటన్ల ఆఫీసర్ చాయిస్ నకిలీ మద్యం (విస్కీ) పట్టుకున్నారు. ఫాంహౌస్ యజమానితోపాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం కోహీర్‌లోని భవానీ వైన్స్‌కు సంబంధించినదిగా గుర్తించారు. దీంతో సదరు వైన్స్ యజమాని సంగమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వైన్స్‌లో సుంకం చెల్లించిన రూ.20 లక్షల విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని లెసైన్స్ రద్దు చేశారు. సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని సాయి భవాని వైన్స్‌లో పనిచేస్తున్న ఇద్దరికి ఈ నకిలీ మద్యంతో సంబంధం ఉన్న కారణంగా ఈ షాప్ లెసైన్స్‌ను కూడా రద్దు చేశారు. కాగా ఈ కేసులో నిందితుడైన మంజునాథ్‌ను జనవరి 22న ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ృందం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో అరెస్టు చేసింది. అయితే మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈ కేసులో అసలు నిందితులను వదిలి పనోళ్లను పట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ఒంటిపై దుస్తులు కూడా సరిగ్గా లేని పనివారిని ఇందులో నిందితులుగా చూపారు. ఈ కేసులో అసలు సూత్రధారులను మాత్రం వదిలిపెట్టినట్టు విమర్శలు గుప్పు మంటున్నాయి. ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారుల మధ్య తలెత్తిన ముడుపుల వివాదం కారణంగానే ఈ అక్రమ మద్యం విక్రయాల బాగోతం వెలుగు చూసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుల వెల్లువ.. జిల్లాలోని చాలాచోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు మాత్రం కేవలం కోహీర్, పెద్దాపూర్, కవలంపేటలోనే దాడులు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్ ప్రాంతాల్లోని కొన్ని దుకాణాల్లో మద్యం కల్తీ అవుతున్నట్టు కూడా ఫిర్యాదులున్నాయి. ఈ విషయం ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చినా వారు కనీసం ఆయా దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. నకిలీ మద్యంతో ఓవైపు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుండగా.. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల మేర గండిపడుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
కాసులు దొరవారికి.. కేసులు పనివారిపై..
సాక్షి, సంగారెడ్డి/ సంగారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంటగల దాబాలు, రెస్టారెంట్లలో రాత్రింబవళ్లు అక్రమ మద్యం విక్రయాలు, అనధికార సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాథం ఈ అంశంపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌కు నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖరేషీ నేతృత్వంలో గత నెల 23 నుంచి ఈ నెల 3 తేదీ వరకు దాడులు జరిగాయి. గజ్వెల్, సిద్దిపేట, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లోని ధాబాల పై దాడులు జరిపి అక్రమ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మూడు ధా బా టల యజమానులపై కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులు మరో మూడు ధాబాల విషయంలో మాత్రం పనివాళ్లపై కేసులు పెట్టారు. గత నెల 14న గజ్వేల్‌లోని ఆధిత్య ఫ్యామిలీ రెస్టారెంట్, నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు జరపగా బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అయితే, ఈ రెస్టారెంట్ల యజమానులకు బదులు అందులో పనిచేస్తున్న యువకులపై కేసులు పెటారు. పొట్ట కూటి కోసం ఆధిత్య రెస్టారెంట్లో పనిచేస్తున్న సాయి కుమార్, నక్షత్ర రెస్టారెంట్లో పనిచేస్తున్న ఎల్. వంశిలపై కేసులు పెట్టారు. మెదక్ మండలం పిల్లికొట్యాల వద్ద గల రాజ్దాబాపై ఈ నెల 3న దాడులు జరపగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభ్యమైంది. 18 విస్కీ బాటిళ్లు, 22 బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ దాబా యజమానికి బదులు అందులో సప్లయర్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ అనే యువకుడిపై కేసు పెట్టి జైలుపాలు చేశారు. సిద్దిపేటలోని మయూరి, కొకకోలా దాబాలతో పాటు గజ్వేల్‌లోని యోగేష్ ఫ్యామిలీ దాబాల విషయంలో మాత్రం యజమానులపై కేసులు పెట్టారు. షరా‘మామూళ్లే’ జిల్లాపై నుంచి 65వ, 44వ నంబర్ల జాతీయ రహదారితో పాటు రాజీవ్ రహదారి వెళ్తున్నాయి. ఈ రహదారులపై పక్క రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలుంటున్నాయి. దీంతో రహదారులకు ఇరువైపుల వందల సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లు వెలిసాయి. ప్రతి రోజూ తెల్లవారుఝామున వరకు ఈ ధాబాల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో 147 లెసెన్సైడ్ మద్యం దుకాణాలున్నాయి. అయితే, అంతే సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ప్రతి ధాబా నుంచి నెలనెల మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేసులపై పరిశీలిస్తాం దాబాలు, రెస్టారెంట్లలో అక్రమ మద్యం నిల్వలు లభించినప్పుడు అందుకు బాధ్యులైనవారిపై మాత్రమే కేసులు పెడతాం. గజ్వేల్, మెదక్‌లోని రెస్టారెంట్లు, దాబాల్లో అక్రమ మద్యం వ్యవహారంలో పనివారిపై కేసులు పెట్టిన విషయంపై పరిశీలన చేస్తాం. -డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్, మెదక్ జిల్లా