సాక్షి, గుంటూరు: సిండికేట్ల కనుసన్నల్లో జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత కూడా యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మండలం లేదా మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నింటిని సిండికేట్‌గా చేసి, నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సిండికేట్లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తుండటంతో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 353 మద్యం షాపులు, 185 బార్‌లు ఉన్నాయి. ఒక్కొక్క మద్యం దుకాణం పరిధిలో పదికి పైగా చొప్పున జిల్లా వ్యాప్తంగా 800 వరకు బెల్టు షాపులు ఉన్నాయని సమాచారం.
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ
ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించి వాటి పర్యవేక్షణ బాధ్యతలు ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. ఎక్సైజ్ అధికారులు మాత్రం మద్యం దుకాణాల సిండికేట్‌ల కనుసన్నల్లో నడుస్తూ వారు చెప్పినట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బెల్టుషాపులు రద్దు చేస్తామంటూ నాలుగేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం విదితమే. అయితే అప్పటి నుంచి నేటి వరకు బెల్టుషాపుల తొలగింపుపై పట్టించుకున్న దాఖలాలు లేవు.
అధికార పార్టీ ముఖ్యనేతలే బెల్టుషాపుల జోలికి వెళ్లొద్దంటూ ఎక్సైజ్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారపార్టీ నేతలు పలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సిండికేట్‌లుగా మారి హవా సాగిస్తున్నారు. ఇష్టం వచ్చిన సమయానికి మద్యం దుకాణాలు తెరిచి అర్ధరాత్రి దాటాక కూడా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం షాపుల్లోనూ లూజు విక్రయాలు సాగిస్తున్నారు. సిండికేట్‌ల నుంచి అధికార పార్టీ ముఖ్యనేతలకు, ఎక్సై జ్, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటంతో వారు ఏం చేసినా పట్టించుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చేశారు.
వేలంలో బెల్టుషాపుల కేటాయింపు
జిల్లాలోని ఓ మంత్రి నియోజకవర్గంతోపాటు, అధికారపార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సిండికేట్‌ల హవా ఎక్కువగా ఉంది. బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించి మరీ లక్షల్లో డబ్బు దంకుంటున్నారు. వేలం పాటల్లో బెల్టుషాపులు దక్కించుకున్న నిర్వాహకులు గ్రామాల్లో వీధికో బ్రాంచ్ చొప్పున ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలు వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు.
తెనాలి, రేపల్లె వంటి ప్రాంతాల్లో బెల్టుదుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించినా వాటిని అడ్డుకునే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారంటే అధికార పార్టీ నేతల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మిగతా ప్రాంతాల్లో సైతం మద్యందుకాణాల నిర్వాహకులు సిండికేట్‌ల చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. సిండికేట్ అయితే అధిక ధరలకు మద్యం అమ్మడంతోపాటు, ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామాలు, వార్డుల్లో బెల్టుదుకాణాలు నడుపుకోవచ్చనే ఆశతో వారి గుప్పెట్లోకి వెళ్తున్నారు.
సిండికేట్‌లో చేరకుంటే ఇబ్బందులే..
తమతో చేతులుకలపని మద్యం దుకాణాలపై సిండికేట్లు కక్షసాధింపు చర్యలకు దిగుతూ వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. ఎక్సైజ్ శాఖను తమ గుప్పెట్లో పెట్టుకుని దాడులు చేయించి, కేసులు పెట్టిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సైతం సిండికేట్ల ఆదేశాలను పాటిస్తూ అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం
జిల్లాలో పల్నాడు ప్రాంతంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాం. బెల్టుషాపులపై గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో గతంలో బెల్టుషాపులు నిర్వహిస్తూ పట్టుబడిన 30 మందిని తహసీల్దారు వద్ద హాజరు పరిచి రూ.15వేల వరకు జరిమానా విధిస్తున్నాం.మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం.
– శ్రీమన్నారాయణ, ఎక్సైజ్ డీసీ
Comments
Please login to add a commentAdd a comment