ఎక్సైజ్ కానిస్టేబుళ్ల తుదిజాబితా ఖరారు
Published Mon, Feb 17 2014 1:32 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
సాక్షి, గుంటూరు: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల కోసం రెండేళ్లుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు ఫలించింది. కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. జాబితాను నియామక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జిల్లా ఎక్సైజ్ శాఖ డీసీ కుళ్లాయప్ప ఖరారు చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 82 పోస్టుల్లో అర్హులైన కానిస్టేబుళ్లు కొలువు దీరనున్నారు. వీరికి సోమవారం నియామక పత్రాలు అందించనున్నారు. 2012లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయ గా.. అదే ఏడాది డిసెంబర్‌లో పరుగు, రాతపరీక్షలు నిర్వహించారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసినప్పటికీ అప్పట్నుంచి నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలోరాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శిక్షణ కేంద్రాలు ఖాళీగా లేకపోవడం తదితర కారణాల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. సుమారు 20 ఏళ్లుగా కానిస్టేబుళ్ల నియామకం జరగలేదు.
తీరనున్న సిబ్బంది కొరత..
రాష్ట్రఖజానాకు ఎక్సైజ్ శాఖ నుంచి సమకూరే ఆదాయంలో జిల్లాది అగ్రస్థానం. జిల్లావ్యాప్తంగా 342 వైన్స్ దుకాణాలు, 180 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు రూ.కోటి మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఇటీవల ఓ సంస్థ సర్వేలో తేలింది. అయితే, ఒక్కో దుకాణం పరిధిలో సగటున 25 మించి ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు కూడా నడుస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు.. వైన్స్‌ల్లో ఎమ్మార్పీ అమలుకు సంబంధించి నిఘాకు సిబ్బంది కొరత అంటూ ఇప్పటిదాకా ఎక్సైజ్ అధికారులు సాకులు చెబుతుండేవారు.
తాజాగా కానిస్టేబుళ్ల నియామకం ద్వారా ఆ శాఖలో సిబ్బంది కొరత ఉండదని చెప్పవచ్చు. ఇప్పటికే పలు విషయాలపై పనిభారం భరించే అధికారులకు తలనొప్పి తీరనుంది. సిబ్బంది తక్కువగా ఉండే ఎక్సైజ్ స్టేషన్‌లకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందులో ప్రతీ స్టేషన్‌కు ముగ్గురు మహిళాకానిస్టేబుళ్లను కూడా నియమించనున్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులంతా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అన్నీ సరిగా ఉన్న అభ్యర్థులను వైద్యపరీక్షలకు పంపనున్నారు. మార్చి ఒకటో తేదీలోగా వైద్యపరీక్షలు చేయించుకున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement