సాక్షి, కృష్ణా: అది మంగళగిరి ఆబ్కారీ స్టేషన్.. అక్కడ ఆమె చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం.. వరుసగా గంజాయి రవాణాదారులు.. బెల్టుషాపుల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపి.. ఆ ఏడాది ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకున్నారు. దీంతో జిల్లాలో ఆ అధికారి పేరు మార్మోగింది.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆమె వ్యవహారం భిన్నం. స్టేషన్ పరిధిల గంజాయి వ్యాపారులకు, మత్తుమందు విక్రేతలకు అండదండలు అందిస్తుంటారు.. బడా బాబుల పిల్లలు ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుపడినా... వారిపై ఎలాంటి కేసులు పెట్టరు. అక్రమంగా మద్యం విక్రయించే వారికి సహాయ సహకారాలు.. అందుకు ఫలితంగా మామూళ్లు దండుకోవడం ఇదీ ఆమె అసలు రూపం.
దుకాణాల ఏర్పాటు మాటున..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులను రద్దు చేసింది. ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. బార్లను సైతం 40 శాతానికి కుదించింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఆబ్కారీ స్టేషన్ పరిధిలో 23 ప్రభుత్వ మద్యం దుకాణాలను అక్టోబరు 1వ తేదీ నుంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆమె అక్రమార్కులతో కుమ్మక్కై.. షాపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
- తాడేపల్లి సెంటర్‌లో గతంలో ఉన్న ప్రైవేటు మద్యం షాపు కౌంటర్ సుమారు రూ. 5 లక్షలు ఉండేది. అలాంటి చోట ఓ బార్ యజమానికి అండగా నిలిచి.. ఆ సెంటర్‌లో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా పకడ్బందీగా ప్రణాళిక అమలు చేసినట్లు తెలిసింది.
- అలాగే తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఉన్న 12 మద్యం షాపుల సమీపంలోనే అటూ ఇటుగా కూల్‌డ్రింక్ షాపులకు అనుమతించారు. ఈ షాపులన్నీ టీడీపీ మండలస్థాయి నాయకుడివే. వారితో ప్రాంతాన్ని బట్టి నెలనెలా రూ.5 వేల నుంచి 10 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎర్రబాలెం, వడ్డేశ్వరం గ్రామాల్లోని మద్యం దుకాణాల పక్కన మరో టీడీపీ నేత అనుచరులు కూల్‌డ్రింక్ షాపులు పెట్టినా ఆబ్కారీ అధికారి ఎటువంటి అభ్యంతరం పెట్టకపోవడం విశేషం.
- గుంటూరులో నివాసం ఉంటోన్న ఈ అధికారిణిని రోజూ మంగళగిరి స్టేషన్ నుంచి ఓ వాహనం వెళ్లి తీసుకొస్తుంది. మళ్లీ రాత్రికి తీసుకెళ్లి ఇంటి వద్ద దించేసి తిరిగి వాహనాన్ని మంగళగిరికి చేరుస్తారు. ఆమె వినియోగించే ఈ వాహనం సైతం మంగళిగిరికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడి పీఏది కావడం గమనార్హం. ప్రభుత్వ వాహనాలు ఉన్నప్పటికీ ఆమె అదే వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ వాహనానికి సంబంధించిన డీజిల్ బిల్లులకు సైతం తాము వసూలు చేసిన మామూళ్ల నుంచే సొమ్ము చెల్లిస్తున్నారు.
- ప్రభుత్వ మద్యం దుకాణాలకు టెండర్ ద్వారా అద్దెలు ఖరారు చేశారు. మంగళగిరి, తాడేపల్లిలో ఒక్కో షాపునకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు అద్దెలు ఉండగా.. తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వీటి అద్దె రూ. 20 వేలు రూ. 30 వేలు మధ్య ఉంది. అయితే ఆయా షాపుల యజమానులతోనూ ఒక నెల అద్దె భయానా రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది.
- మంగళగిరి చెందిన ఓ టీడీపీ నేత అన్న కుమారుడు, మరో యువకుడు గంజాయి, మత్తు మందుతో దొరికితే వారిపై కేసు పెట్టకుండా వదిలేశారు. స్టేషన్‌లో కూర్చోబెట్టి ఒప్పందం తర్వాత వదిలేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకు టీడీపీ నేతకు చెందిన వస్త్ర దుకాణం నుంచి నాలుగు సూట్‌కేసుల నిండా దుస్తులు తీసుకున్నట్లు సమాచారం.
- విశాఖ–చెన్నైకు వెళ్లే ప్రైవేటు బస్సులు రోజూ కాజా టోల్‌ప్లాజా మీదుగా వెళ్తుంటాయి. ఇక్కడ ఎక్సైజ్ అధికారులు చేపట్టే తనిఖీల్లో బస్సుల్లో రవాణా అవుతున్న గంజాయి పాకెట్లు దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎవరు తరలిస్తున్నారో తెలియదు కాబట్టి ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం కావడంతో ఏకంగా కొందరు ప్రైవేటు బస్సుల యజమానులతో మామూళ్లు మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
- ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ వాహనం తీసుకుని మూడు రోజులపాటు శ్రీశైలం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆబ్కారీ అధికారిణి అధికారికంగా సెలవు పెట్టినట్లుగా ఎక్కడా రికార్డుల్లో లేకపోవడం విడ్డూరం.
- ఈ ఏడాది మార్చిలో స్టేషన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ పదవీ విరమణ పొందితే అతనికి వీడ్కోల పార్టీ హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించారు. ఈ పార్టీకి స్టేషన్ సిబ్బంది ఎవ్వరూ వెళ్లలేదు. అయినా ఆ పార్టీ కోసం ఏకంగా రూ. 21,050 ఖర్చు పెట్టినట్లు రోజువారీ నిర్వహణ పట్టికలో చూపడం విశేషం.
ఆమెకో లెక్కుంది..
ఇదంతా ఏదో రహస్యంగా జరుగుతోందని భావిస్తున్నారనుకుంటే పొరపడినట్లే.. అక్రమార్కుల ద్వారా వచ్చే మామూళ్లకు ఓ లెక్కుంది.. వాటిని ప్రతినెలా ఏ విధంగా రూపాయి రూపాయి ఖర్చు పెడుతున్న విషయాన్ని పట్టిక రూపంలో చూసిపెడుతున్నారు ఆమె ముఖ్య అనుచరులు.
విచారించి చర్యలు తీసుకుంటాం..
మంగళగిరి ఎక్సైజ్ అధికారిణి అవినీతికి పాల్పడుతున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ అలాంటివి ఉంటే విచారించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment