సాక్షి, సంగారెడ్డి/ సంగారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంటగల దాబాలు, రెస్టారెంట్లలో రాత్రింబవళ్లు అక్రమ మద్యం విక్రయాలు, అనధికార సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాథం ఈ అంశంపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌కు నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖరేషీ నేతృత్వంలో గత నెల 23 నుంచి ఈ నెల 3 తేదీ వరకు దాడులు జరిగాయి. గజ్వెల్, సిద్దిపేట, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లోని ధాబాల పై దాడులు జరిపి అక్రమ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మూడు ధా బా టల యజమానులపై కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులు మరో మూడు ధాబాల విషయంలో మాత్రం పనివాళ్లపై కేసులు పెట్టారు.
గత నెల 14న గజ్వేల్‌లోని ఆధిత్య ఫ్యామిలీ రెస్టారెంట్, నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు జరపగా బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అయితే, ఈ రెస్టారెంట్ల యజమానులకు బదులు అందులో పనిచేస్తున్న యువకులపై కేసులు పెటారు. పొట్ట కూటి కోసం ఆధిత్య రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సాయి కుమార్, నక్షత్ర రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఎల్. వంశిలపై కేసులు పెట్టారు.
మెదక్ మండలం పిల్లికొట్యాల వద్ద గల రాజ్‌దాబాపై ఈ నెల 3న దాడులు జరపగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభ్యమైంది. 18 విస్కీ బాటిళ్లు, 22 బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ దాబా యజమానికి బదులు అందులో సప్లయర్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ అనే యువకుడిపై కేసు పెట్టి జైలుపాలు చేశారు.
సిద్దిపేటలోని మయూరి, కొకకోలా దాబాలతో పాటు గజ్వేల్‌లోని యోగేష్ ఫ్యామిలీ దాబాల విషయంలో మాత్రం యజమానులపై కేసులు పెట్టారు.
షరా‘మామూళ్లే’
జిల్లాపై నుంచి 65వ, 44వ నంబర్ల జాతీయ రహదారితో పాటు రాజీవ్ రహదారి వెళ్తున్నాయి. ఈ రహదారులపై పక్క రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలుంటున్నాయి. దీంతో రహదారులకు ఇరువైపుల వందల సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లు వెలిసాయి. ప్రతి రోజూ తెల్లవారుఝామున వరకు ఈ ధాబాల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో 147 లెసెన్సైడ్ మద్యం దుకాణాలున్నాయి. అయితే, అంతే సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ప్రతి ధాబా నుంచి నెలనెల మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కేసులపై పరిశీలిస్తాం
దాబాలు, రెస్టారెంట్లలో అక్రమ మద్యం నిల్వలు లభించినప్పుడు అందుకు బాధ్యులైనవారిపై మాత్రమే కేసులు పెడతాం. గజ్వేల్, మెదక్‌లోని రెస్టారెంట్లు, దాబాల్లో అక్రమ మద్యం వ్యవహారంలో పనివారిపై కేసులు పెట్టిన విషయంపై పరిశీలన చేస్తాం. -డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్, మెదక్ జిల్లా
కాసులు దొరవారికి.. కేసులు పనివారిపై..
Published Sun, Feb 9 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement