జాతీయ రహదారులపై ముందు జాగ్రత్త చర్యలు
హైదరాబాద్– విజయవాడ, హైదరాబాద్ – బెంగళూర్ హైవేలపై పెరిగిపోయిన రద్దీ
గ్రామాలు, పట్టణాలున్న చోట, డివైడర్ లేని చోట మరింత అప్రమత్తత
బ్లాక్ స్పాట్స్ దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేయడానికి అధికారుల చర్యలు
రాత్రివేళ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం
కోదాడ/ సూర్యాపేట టౌన్/ చౌటుప్పల్ రూరల్/పాలమూరు: జాతీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. సాధారణ రోజుల్లోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటిది సంక్రాంతి పండుగ కోసం లక్షలాది మంది హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళుతుంటే.. వాహనాల రద్దీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో అప్రమత్తంగా లేకున్నా, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్లే హైవేపై, అటు బెంగళూరు రూట్‌లో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న (బ్లైండ్ స్పాట్) ప్రాంతాల్లో సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్సును, ప్రమాదాలు జరిగితే వాహనాలను పక్కకు జరిపేందుకు క్రేన్లను, సరిపడా సిబ్బందిని అందుబాటులో పెట్టారు. వాహనదారులు కూడా ఆయా మార్గాల్లో పరిస్థితిని తెలుసుకుని, జాగ్రత్తగా ప్రయాణిస్తే... పండుగ ప్రయాణం సురక్షితం అవుతుంది. ఈ క్రమంలో అవగాహన కోసం ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. దీనిపై ప్రత్యేక కథనం..
విజయవాడ రూట్‌లో..
హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని దండు మల్కాపురం నుంచి తెలంగాణ–ఏపీ సరిహద్దుగా ఉన్న రామాపురం క్రాస్‌రోడ్డు వరకు 181 కిలోమీటర్ల పరిధిలో అనేక చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. పలుచోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనితో జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది.
⇒ దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మాజీగూడెం, పంతంగి, పిట్టంపల్లి, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్‌జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట పట్టణ శివారులోని జనగామ క్రాస్‌రోడ్డు, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్‌స్పాట్‌లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
⇒ సూర్యాపేట సమీపంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నందున సర్వీస్‌రోడ్డులో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు.
⇒ జమ్మిగడ్డ, నేలమర్రి క్రాస్‌రోడ్, ముంకుదాపురం, ఆకుపాముల, కొమరబండ వై జంక్షన్, కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, దుర్గాపురం క్రాస్‌రోడ్ వద్ద బ్లాక్‌స్పాట్‌ల విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
⇒ తెలంగాణ– ఏపీ సరిహద్దులో ఉన్న పాలేరు నదిపై ఉన్న రెండు వంతెనలలో ఒక వంతెన అప్రోచ్‌రోడ్డు ఇటీవలి వరదలకు కొట్టుకుపోయింది. దీని మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
బెంగళూరు రూట్‌లో..
హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్లేవారు హైదరాబాద్–బెంగళూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తారు. దీనిని నాలుగు లేన్లుగా విస్తరించినా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనితో ఆరు లేన్లుగా విస్తరిస్తున్నారు. దీనికి సంబంధించి పలుచోట్ల పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 21 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సైన్ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు.
⇒ మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి దగ్గర రైల్వే డబుల్ ట్రాక్ పనులు జరుగుతుండటం, కొత్త బ్రిడ్జి నిర్మిస్తుండటంతో జాతీయ రహదారిపై ఒకేవైపు రాకపోకలు సాగుతున్నాయి. పాత బ్రిడ్జి మధ్యనే బారికేడ్లు పెట్టి... రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఇక బాలానగర్ చౌరస్తాలో బ్రిడ్జి నిర్మిస్తుండటంతో.. సర్వీస్ రోడ్ మార్గంలోకి దారి మళ్లిస్తున్నారు. వాహనాల వేగం కట్టడి కోసం రాజాపూర్ చౌరస్తా, పెద్దాయిపల్లి దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రిస్తాం
పండుగ ట్రాఫిక్ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. అధిక వేగం వద్దు. రోడ్డు పక్కన వాహనాలు నిలపవద్దు. విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతున్న చోట్ల.. డైవర్షన్లు ఏర్పాటు చేసి గమనిక బోర్డులు పెట్టాం. వాటిని పాటించాలి. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల రైతులు, ప్రజలు పొలాలకు, పనులకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు సిబ్బందితో రోడ్లపై 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నాం. – సన్‌ప్రీత్‌సింగ్, సూర్యాపేట జిల్లా ఎస్పీ
పొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదం
చలికాలం కావడంతో ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉంటుంది. తెల్లవారుజామునే ప్రయాణించే వారికి ఇబ్బంది మరింత ఎక్కువ. రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఉదయం 8–9 గంటల తర్వాత బయలుదేరి సాయంత్రానికల్లా గమ్యాన్ని చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఫాగ్ లైట్లు ఏర్పాటు చేసుకుంటే కొంత మేర ఇబ్బంది తప్పుతుంది.
ఫాస్టాగ్ ‘సరిచూసుకోండి
పండుగల వేళ టోల్ ప్లాజాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది. అందువల్ల తమ వాహనాలకు ఉన్న ఫాస్టాగ్ వేలిడిటీ, బ్యాలెన్స్ సరిచూసుకోవాలి. లేకుంటే ఇబ్బందిగా మారుతుంది. ముందుగానే వీలైనంత బ్యాలెన్స్ వేసుకోవడం, వేలిడిటీ అయిపోతే.. మళ్లీ యాక్టివ్ చేయించుకోవడం మంచిది.
ఎట్టి పరిస్ధితుల్లో రోడ్డు మీద వాహనాలు నిలపొద్దు
పండుగ వేళ వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. టాయిలెట్ కోసమో, కాసేపు సేదతీరడానికో, ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తినడానికో చాలా మంది మధ్యలో ఆగుతుంటారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే, కొన్నిసార్లు కాస్త రోడ్డుపై ఉండేలా వాహనాలను ఆపుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. జాతీయ రహదారిపై బస్ బే, లారీ బే ఉంటాయి. అక్కడ వాహనాలను నిలపాలి. లేదా రోడ్డుకు కాస్త లోపలగా ఉన్న చోటు చూసుకుని ఆపడం మంచిది.
అత్యవసరమైతే టోల్ ఫ్రీ ‘1033’నంబర్‌కు ఫోన్ చేయండి
జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో (వైద్యం, ప్రమాద) సాయం కోసం వాహనదారులు 1033 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఇది టోల్‌ఫ్రీ, 24 గంటలు అందుబాటులో ఉంటుంది. 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చినా కూడా పోలీసుల నుంచి సాయం అందుతుంది.
20 కిలోమీటర్లకో అంబులెన్స్
సంక్రాంతి పండుగ రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజాల నిర్వహకులు పోలీస్, రెవెన్యూశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారుల పరిధిలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ముందు జాగ్రత్తగా సిద్ధంగా ఉంచారు. టోల్‌ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించారు. ఒక్కోచోట 10–20 మంది పోలీసులను కూడా సిద్ధంగా ఉంచారు.
మూడంచెల స్పీడ్‌బ్రేకర్లు
జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మూడంచెల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. జంక్షన్ రావటానికి మూడు వందల మీటర్ల దూరంలో కొంత ఎత్తులో మొదటి.. రెండు వందల మీటర్ల దూరంలో మరింత ఎక్కువ ఎత్తుతో రెండోది.. జంక్షన్‌కు ముందు రెండు అంగుళాల ఎత్తులో మూడో దఫా స్పీడ్ బ్రేకర్లు సిద్ధం చేశారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేగం తగ్గి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment