మద్యం మాఫియా! | illegal alcohol sales in district | Sakshi
Sakshi News home page

మద్యం మాఫియా!

Published Mon, Feb 9 2015 6:02 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

మద్యం మాఫియా! - Sakshi

మద్యం మాఫియా!

మద్యం మాఫియా పేట్రేగిపోతోంది. పొరుగు రాష్ట్రం నుంచి విచ్చల విడిగా మద్యం దిగుమతి అవుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ మాఫియా అక్రమ మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయలను దండుకుంటోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తూ మేమున్నామని గుర్తు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దాడులు చేసే సమయంలో మద్యం స్వాధీనం చేసుకొని యజమానులపై కాకుండా అక్కడ ఉండే పనోళ్లపై కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉంది.
 

జోరుగా ‘నకిలీ’ దందా
- జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు
- సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి
- మెండుగా అధికారుల అండదండలు
- మామూళ్లలో తేడా వస్తేనే దాడులు
- ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

సంగారెడ్డి క్రైం: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెల్టు షాపుల్లోకి సరిహద్దు రాష్ట్రాల సరుకు దిగుతోంది. జిల్లాలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తోన్న లిక్కర్ మాఫియా గోవా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి బెల్ట్ షాప్‌ల ద్వారా గ్రామీణ ప్రాం తాల్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగి స్తోంది. ఇందులో నకిలీ మద్యం కూడా ఉంటోంది. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కాసులు కురిపిస్తే చాలనుకుంటున్న మాఫియా పల్లెపల్లెకూ విస్తరించింది. జిల్లాలో ప్రభుత్వ లెసైన్సులతో నడుస్తోన్న మద్యం దుకాణాల కంటే పదింతలు బెల్ట్ షాప్‌లు నడుస్తున్నాయి. బెల్ట్ షాప్‌ల విషయంలో ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడం, ఆదాయం తగ్గకూడదంటే జనం ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదన్న ధోరణితో వ్యవహరిస్తోండడం.. అటు మాఫియాకు, ఇటు అధికారులకు కలిసొచ్చిన అంశంగా మారింది. మామూళ్ల రాకలో తేడావస్తే దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం అధికారులకు పరిపాటిగా మారింది.
 
ఇటీవల వెలుగు చూసిన నకిలీ మద్యం గుట్టు..
సంగారెడ్డి మండలం కవలంపేట వద్ద గల ఓ ఫాంహౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు గత నెల 17న దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు రూ.15 లక్షల విలువ చేసే 445 కాటన్ల ఆఫీసర్ చాయిస్ నకిలీ మద్యం (విస్కీ) పట్టుకున్నారు. ఫాంహౌస్ యజమానితోపాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం కోహీర్‌లోని భవానీ వైన్స్‌కు సంబంధించినదిగా గుర్తించారు. దీంతో సదరు వైన్స్ యజమాని సంగమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వైన్స్‌లో సుంకం చెల్లించిన రూ.20 లక్షల విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని లెసైన్స్ రద్దు చేశారు.

సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని సాయి భవాని వైన్స్‌లో పనిచేస్తున్న ఇద్దరికి ఈ నకిలీ మద్యంతో సంబంధం ఉన్న కారణంగా ఈ షాప్ లెసైన్స్‌ను కూడా రద్దు చేశారు. కాగా ఈ కేసులో నిందితుడైన మంజునాథ్‌ను జనవరి 22న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ృందం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో అరెస్టు చేసింది. అయితే మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈ కేసులో అసలు నిందితులను వదిలి పనోళ్లను పట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ఒంటిపై దుస్తులు కూడా సరిగ్గా లేని పనివారిని ఇందులో నిందితులుగా చూపారు. ఈ కేసులో అసలు సూత్రధారులను మాత్రం వదిలిపెట్టినట్టు విమర్శలు గుప్పు మంటున్నాయి. ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారుల మధ్య తలెత్తిన ముడుపుల వివాదం కారణంగానే ఈ అక్రమ మద్యం విక్రయాల బాగోతం వెలుగు చూసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదుల వెల్లువ..
జిల్లాలోని చాలాచోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు మాత్రం కేవలం కోహీర్, పెద్దాపూర్, కవలంపేటలోనే దాడులు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్ ప్రాంతాల్లోని కొన్ని దుకాణాల్లో మద్యం కల్తీ అవుతున్నట్టు కూడా ఫిర్యాదులున్నాయి. ఈ విషయం ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చినా వారు కనీసం ఆయా దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. నకిలీ మద్యంతో ఓవైపు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుండగా.. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల మేర గండిపడుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement