
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు.
అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment