సాక్షి, అమరావతి : తప్పు చేసే ఎక్సైజ్ అధికారులపై తీవ్ర చర్యలుంటాయని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి హెచ్చరించారు. సచివాలయంలో గురువారం ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎక్సైజ్ అధికారులపై ఆరోపణలొస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ మద్యం షాపుల అద్దెల్లో అక్రమాలకు ఊతమిస్తున్నారని సమాచారం అందుతోందన్నారు. దశలవారీ మద్య నిషేధ కార్యక్రమానికి ఎక్సైజ్ అధికారులు ఆటంకాలు కల్పించేలా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ ముఖ్య నేతల అక్రమ మద్యం దందాను అడ్డుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి ప్రశ్నించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి నేరుగా బార్లకు లిక్కర్‌ను సరఫరా చేస్తున్నారని, ఇవన్నీ తెలిసినా కొందరు సీఐలు ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం డిపోల్లో డీఎంల వ్యవహార శైలిని గమనించాలని ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిని ఆదేశించారు. నాటుసారా తయారీ, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోయపాటి నరసింహులు, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment