సూళ్లూరుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్న 180 కేజీల గంజాయి (ఫైల్)
యువత మత్తులో చిత్తవుతోంది. స్నేహితులతోనో.. సరదాగానో మత్తు పదార్థాల వైపు ఆకర్షితులైన వారు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యువతనే లక్ష్యంగా చేసుకున్న కొందరు గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో గంజాయి వ్యాపారం చాలాకాలంగా గుట్టుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు ఒడిశా, విజయనగరం, విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లోని గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతూ గుట్టుచప్పుడు కాకుండా రైళ్లు, రోడ్డుమార్గాన పెద్దఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరు నగరంతోపాటు కోవూరు, ఉదయగిరి, మనుబోలు, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కపాడిపాళెం, శెట్టిగుంటరోడ్డు, ఇరుకళల పరమేశ్వరిగుడి ప్రాంతం తదితర చోట్లకు చెందిన కొందరు వ్యక్తులు కళాశాల విద్యార్థులు, యువతకు ప్యాకెట్ల రూపంలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
రవాణా ఇలా..
వ్యాపారులు గంజాయిని రైళ్లు, రోడ్డుమార్గాల ద్వారా జిల్లాకు చేరవేసే సమయంలో వాసన రాకుండా ఉండేందుకు సెంటు జల్లుతున్నారు. ప్ర యాణికుల్లా నటిస్తూ తమ వెంట తెచ్చుకున్న గంజాయి బ్యాగ్‌లను సీట్ల కింద, పైన ఉన్న క్యారియర్లల్లో ఉంచుతున్నారు. స్టేషన్ వచ్చిన వెంటనే వాటిని తీసుకుని వెళ్లిపోతున్నారు. ఒకవేళ మార్గమధ్యలో ఎవరైనా అధికారులు తనిఖీలు చేస్తే బ్యా గ్‌లు తమవి కావని చల్లగా జారుకుంటున్నారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
ఉత్తరాంధ్ర నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని నెల్లూరు నుంచే తమిళనాడు, సేలం, కోయంబత్తూరు, మధురై, అండమాన్, పోర్టుబ్లెయిర్‌లతోపాటు శ్రీలంక దేశానికి సైతం తరలిస్తున్నారు. ఏఓబీ విశాఖ ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు విస్తృతంగా ఉంది. ఇక్కడ పండే గంజాయికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో స్మగ్లర్లు ఇక్కడినుంచి పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వేల కేజీల విక్రయాలు
ఏజెన్సీ ఏరియాల్లో కేజీ గంజాయి రూ.3 వేలకు దొరుకుతోంది. అక్కడినుంచి జిల్లాకు తీసుకువచ్చిన వ్యాపారులు వాటిని చిన్నచిన్న పొట్లాలుగా తయారుచేసి ప్యాకెట్ రూ.50 నుంచి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. రూ.3 వేలకు కొనుగోలు చేసిన గంజాయిని రూ.25 వేలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. నెలకు వేల కేజీల గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. దీనిని బట్టిచూస్తే జిల్లాలో రూ.కోట్లలో వ్యాపారం సాగుతోన్నట్లుగా తెలుస్తోంది.
పోలీసుల ప్రత్యేక దృష్టి
గంజాయి వల్ల తమ పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని పలువురు తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఎస్పీ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం ఇటీవల కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే ముఠాను అరెస్ట్ చేసింది. తాజాగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 16 కేజీల గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి
ఉదయం ఇంటి నుంచి చదువుకునేందుకు, పనులకు వెళుతున్న పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. కళాశాలకు వెళ్లే విద్యార్థుల్లో అధికశాతం మంది మత్తుకు బానిసై అనారోగ్యం పాలవుతున్నారు. రూ.లక్షలు చెల్లించి కళాశాలల్లో చేర్పించడంతోనే తమ పని అయిపోయిందని తల్లిదండ్రులు భావించరాదు. కళాశాలకు వెళుతున్నారా?, ఎలాంటి స్నేహిం చేస్తున్నారు?, రాత్రి ఇంటికి వచ్చే సమయంలో ఎలా ఉన్నారు? ఏ విధంగా వ్యవహరిస్తున్నారు?, వారి మానసిక పరిస్థితి?, సెల్‌ఫోన్ వినియోగం తదితరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనిస్తే అందుకు గల కారణాలను తెలుసుకుని వారిని చక్కదిద్దాలి.– ఐ.శ్రీనివాసన్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్
బయటపడిందిలా..
ఇటీవల ఓ విద్యార్థి తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు యువకుడు గంజాయికి అలవాటుపడినట్లుగా ధ్రువీకరించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు అతడిని డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. ఈక్రమంలో యువకుడు తనతోపాటు అనేకమంది నిత్యం గంజాయి సేవిస్తున్నట్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గంజాయి సేవనానికి అలవాటుపడిన పిల్లలో అధికశాతం మంది సంపన్నవర్గాలకు చెందిన వారే. కొందరు మత్తులో జోగేందుకు సరిపడా నగదు లేకపోవడంతో స్మగ్లర్లుగా మారి గంజాయిని దిగుమతి చేసుకుని స్వయంగా విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment