సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు.
చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు.
అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment