అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన ప్రకాశం పోలీస్ రాజమండ్రి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు సమాచారం అందడంతో నిందితులను పట్టుకున్న పోలీసులు గంజాయి లారీని దారి మళ్లించి పరారైన మరో ఇద్దరు నిందితులు నెల్లూరు జిల్లా గూడూరు వరకూ ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు నిందితులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు లారీతోపాటు సుమారు రూ.25 లక్షల విలువ చేసే 400 కేజీల గంజాయి స్వాధీనం బుధవారం పట్టపగలు సినీ ఫక్కీలో ఛేజింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గంజాయి అక్రమ రవాణా సమాచారంతో రోడ్‌పై చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.. తెల్లవారు జామున పోలీసుల హడావిడి చూసి ఏదో జరిగే ఉంటుందని స్థానికులంతా అనుకున్నారు.. ఏం జరిగిందో మాత్రం వారికీ తెలీదు.. ఇదే సమయంలో రూట్ క్లియరెన్స్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.. తమ వారు పోలీసులకు దొరికిపోయారని పసిగట్టిన గంజాయి ముఠా లారీ రూట్ మార్చేశారు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు తమ వానాల్లో లారీని వెంబడిస్తూ వేట మొదలు పెట్టారు.. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా గూడురు వద్దకు వెళ్ళే సరికి గంజాయి లారీతోపాటు నిందితులను సైతం పట్టేశారు.. నిందితులంతా తమిళనాడుకు చెందిన అంతఃరాష్ట్ర గంజాయి ముఠా అని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.. ఇదేదో సినిమా కథ కాదు. ఇదంతా ప్రకాశం జిల్లా పోలీసులు చేసిన సాహసం. వీరికి సరిద్దులతో సంబంధం లేదు. “బియాండ్ ద బోర్డర్’ పేరుతో ఎల్లలు దాటి స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వెళ్తున్న గంజాయి లారీలను సినీ ఫక్కీలో తమిళనాడు బోర్డర్ వరకూ ఛేజ్ చేసి పట్టుకుని తమ సత్తా చాటారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి పంజా విసిరారు. ఈనెల 10న జె.పంగులూరు పోలీసుస్టేషన్ పరిధిలో హైవేపై బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పట్టుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇది జరిగి వారం రోజులకే రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టపగలు సినీ ఫక్కీలో వేటాడి పట్టుకున్న పోలీసులు రూ.25లక్షల విలువచేసే 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి లారీ వెళుతున్నట్లు సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు త్రోవగుంట–చీరాల జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా లారీని చీరాల వద్దనుంచి దారి మళ్లించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగి లారీని చేజ్ చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరు వద్ద పట్టుకుని నాగులుప్పలపాడు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కి రిమాండ్‌లో ఉన్న నిందితులు ముగ్గురు కూడా ఇదే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. అంటే తేని జిల్లా కంభం గ్రామానికి చెందిన వ్యక్తులే గంజాయి అక్రమరవాణాకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో అసలు సూత్రధారులు ఎవరై ఉంటారనే దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
అసలు ముఠా గుట్టు తెలిసేనా?
నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు నిందితులు చెప్పే సమాధానంతో తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. అసలు తమకు గంజాయి ఇచ్చింది ఎవరో కూడా తెలియదని.. వారి ఫోన్ నంబర్ కూడా తమకు ఇవ్వరని చెబుతున్నట్లు తెలుస్తోంది. తాము లారీతో రాజమండ్రిలోని వారు చెప్పిన ప్రాంతంలో ఉంటే ఆటోలలో సరుకును తెచ్చి లోడింగ్ చేసి డబ్బు తీసుకుని వెళ్లిపోతారని, తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరని నిందితులు పేర్కొంటున్నట్లు తెలిసింది. తమకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుందని, ఆ తరువాత ఆ నంబర్ పనిచేయదని పోలీసుల వద్ద తెలిపినట్లు సమాచారం. పోలీసు విచారణలో అసలైన సూత్రధారుల గుట్టు బయట పడుతుందా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment