
తూర్పుగోదావరి, రాజానగరం: పదమారో నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిపోతున్న రూ.10.25 లక్షల విలువైన 205 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ సురేష్‌బాబు, ఎస్సై జగన్‌మోహన్‌ల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి ముంబైకి ఐషర్ వ్యాన్‌లో క్యాబేజీ బస్తాలు రవాణా చేస్తున్నారు. వాటి మధ్య గంజాయి ఉంచి, పైకి క్యాబేజీ బస్తాలుగా చూపిస్తూ తరలిస్తున్నారు.
రాజానగరం సమీపాన కలవచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దీనిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దేవదాసు లడ్డూ, దిలీప్‌సింగ్ పరదేశి, బేల్‌ధార్, అంబుదాస్ కచ్చిరు, సురేష్ కచ్చిరు, అనాబక్రీ, ఏక్‌నాథ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 9 సెల్‌ఫోన్లు, కారు, క్యాబేజీల్లో గంజాయితో ఉన్న ఐషర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.