గుప్పు.. గుప్పుమంటూ.. | Marijuana Smuggling in East Godavari | Sakshi
Sakshi News home page

గుప్పు.. గుప్పుమంటూ..

Published Sat, Apr 20 2019 1:15 PM | Last Updated on Sat, Apr 20 2019 1:15 PM

Marijuana Smuggling in East Godavari - Sakshi

బ్యాగుల్లో నింపిన గంజాయి (ఫైల్‌)

తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: గంజాయి సాగు, రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. జిల్లాలో 11 మండలాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏఓబీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు వెళ్ల లేని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి కూలీలను ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ పండించిన గంజాయి 99 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో అన్ని విధాలుగా రైలు, రోడ్డు మార్గాలు ఉండడం వల్ల గంజాయి రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది.

నిరాటంకంగా సాగుతూ..
జనసమర్థమైన ప్రదేశాలకు, జాతీయ రహదారులకు చేర్చేందుకు గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. 25 కేజీల మూటలు రెండింటిని జాతీయ రహదారికి చేర్చితే గిరిజనులకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు కిరాయి ఇస్తుంటారు. దీంతో రాత్రి సమయాల్లో గంజాయి రవాణా అటవీ ప్రాంతం గుండా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా ఈ జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది. విస్తారమైన అటవీ ప్రాంతం ఉండడం వల్ల జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఆటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిరాటంకంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి,  రావుల పాలెం తదితర ప్రాంతాల్లో నిల్వలు చేసి రవాణా చేస్తున్నారు.

కేసులు.. అరెస్టులు..
గత మూడేళ్లలో గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు 29 మందిని అరెస్ట్‌ చేసి 19 కేసులు నమోదు చేశారు. 1312.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 91823 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

పదేళ్ల జైలు శిక్షలు
ప్రస్తుతం గంజాయి కేసులో పట్టుబడిన వారికి కోర్టులు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. దీని వల్ల గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్‌ వల్ల కలిగే నష్టాలపై ఐటీడీఏ అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గిరిజనులే బలి..
సెంట్రల్‌ జైలులో గంజాయి కేసుల్లో రిమాండ్‌లో ఉన్న, శిక్ష పడిన ముద్దాయిలు దాదాపు 500 మందికి పైగా ఉన్నారంటే ఈ గంజాయి సాగు, రవాణాపై ఎంతమంది ఆధారపడ్డారో అర్ధం అవుతుంది. అక్షర జ్ఞానం లేని గిరిజనులు తమకు వచ్చే కొద్ది సొమ్ముల కోసం ఆశపడి ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు.  

నర్సరీ మొక్కలు, కాయగూరల మాటున స్మగ్లింగ్‌
తవుడు బస్తాలు, నర్సరీ మొక్కలు, కాయగూరలు, బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. టూరిస్ట్‌ బ్యాగ్‌లలో, రైల్వేలో ప్రయాణికుల మాదిరిగా గంజాయి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఇతర ముఖ్య పట్నాల నుంచి హైటెక్‌ బస్సులు లగేజీల ద్వారా కూడా గంజాయి రవాణా చేస్తున్నారు. వీటితో పాటు లారీ ట్రాన్స్‌పోర్టులు ద్వారా జరుగుతోంది. జిల్లా నుంచి హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు.

శాఖల మధ్య సమన్వయలోపం..
గంజాయి సాగు, రవాణాను అరికట్టాలంటే స్థానిక పోలీసులతో పాటు, ఎక్సైజ్, రెవెన్యూ, ఫారెస్ట్, సెంట్రల్‌ ఎక్సైజ్, ఎన్‌సీబీ(నార్కోట్సె కంట్రోల్‌ బోర్డు, సెంట్రల్‌ రెవెన్యూ ఇంటిలిజన్స్‌ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే వారి మధ్య సఖ్యత లేకపోవడం గంజాయి స్మగ్లర్లకు వరంగా మారింది.

నిరంతరంనిఘా ఏర్పాటు
గంజాయి రవాణా సాగుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది రాయవరం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో సుమారు 192 కేజీల గంజాయిని స్వా«ధీనం చేసుకున్నాం. ఏడుగురు ముద్దాయిలలో ఆరుగురిని అరెస్ట్‌ చేశాం. ఒక ముద్దాయిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది.– కె.ఎస్‌.ఎన్‌. ప్రభు కుమార్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌. రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement