పోలీసులు స్వాధీనం చేసుకున్న వ్యాన్, కారు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గంజాయి కేసులో పట్టుబడి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్‌పై విడుదలైనప్పటికీ... తిరిగి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ముద్దాయి.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడాడు. రాజమహేంద్రవరం అర్బన్ తూర్పు మండలం డీఎస్పీ యు.నాగరాజు కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నడింపల్లి సీతారామరాజు, నల్లజర్ల మండలం సింగరాజు పాలేనికి చెందిన నెక్కలపూడి రాంబాబు, నెల్లూరు జిల్లా లక్ష్మీ నర్సంహపురానికి చెందిన షేక్ ఆహ్మద్, తమిళనాడుకు చెందిన పి.సురేష్ ఆదివారం రాత్రి గంజాయిని తమిళనాడు, చెన్నైకు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు చిక్కారు.
నిందితులు పాడేరు నుంచి ఒక ఐషర్ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో బొమ్మూరు పోలీసులు హుకుంపేట వద్ద తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున వారిని విచారణ చేస్తుండగా ముద్దాయి సీతారామరాజు స్టేషన్ వెనుక ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అతడు బయటకు ఎంతకీ రాకపోవడంతో బాత్‌రూమ్ తలుపులు తీసే సరికి అక్కడ రేక తో గొంతు కోసుకొని రక్తం కారుతున్న ముద్దాయి కనిపించాడు. అతడికి వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. సీతారామరాజుతో పాటు మరో ఇద్దరు నిందితులు షేక్ ఆహ్మద్ భాష, నెక్కలపూడి రాంబాబులను రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నిందితుడు తమిళనాడుకు చెందిన సురేష్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి సీతారామరాజు హైకోర్టు ఇచ్చిన పెరోల్ కండిషన్‌తో బెయిల్‌పై ఉన్నాడని, మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు.
జైలుకు వెళ్లినా మారని తీరు
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ముద్దాయి సీతారామరాజు 2015లో అన్నవరం పోలీస్ స్టేషన్‌లో పట్టుబడ్డాడు. ఇతనికి అప్పట్లో రాజమహేంద్రవరం ఫస్ట్ అడిషినల్ సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష తోపాటు రూ.1.50 లక్షలు జరిమానా విధించింది. జైలులో సత్ప్రర్తనతో ఉన్నందున అతడు హైకోర్టు పెరోల్ కండీషన్‌తో 2017 జనవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదల తరువాత పాత నేరస్తులు నెక్కలపూడి రాంబాబుకు అతడు రూ.30 లక్షలు అప్పు పడ్డాడు. దీంతో రాంబాబు, ఇతడికి అప్పు తీర్చే మార్గం చెబుతానని చెప్పి ఈ నెల 11న అనకాపల్లి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి పాడేరు వెళ్లి అక్కడ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయి బస్తాలు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment