గంజాయి సరఫరా డోర్‌ డెలివరీ.. | Marijuana Smuggling Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

హాస్టళ్లే అడ్డాలు

Published Thu, Nov 7 2019 11:19 AM | Last Updated on Sat, Nov 9 2019 1:13 PM

Marijuana Smuggling Gang Arrest in Hyderabad - Sakshi

సాక్షి.సిటీబ్యూరో: విద్యార్థులు, యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు గంజాయి స్మగ్లర్లు యథేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారు ఉంటున్న ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. విద్యార్థులు బసచేసే హాస్టల్‌ గదులు, కళాశాలల  సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలే గంజాయి విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్‌ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న అరవింద్‌ అనే  యువకుడిని ఈ నెల 2న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, అతడి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను గత కొన్ని రోజులుగా మంగళ్‌హట్‌కు చెందిన కిషోర్‌ సింగ్‌ అనే వ్యక్తి నుంచి కిలోల చొప్పున గంజాయి కొనుగోలు చేసి  ప్యాకెట్లుగా మార్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గత రెండేళ్లలో ఒక్క ధూల్‌పేట ప్రాంతంలోనే గంజాయి కొనుగోలు చేస్తున్న ఐదువేల మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు వారికి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వరుస పండుగలు, నూతన ఎక్సైజ్‌ పాలసీ నేపథ్యంలో బిజీగా ఉన్న అబ్కారీ అధికారులు గంజాయి రవాణాపై దృష్టి సారించకపోవడంతో నగరంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. 

డోర్‌ డెలివరీ..
నగరంలోని అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, మెహిదీపట్నం , హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, బీఎన్‌.రెడ్డి నగర్, హస్తినాపురం, ఉప్పల్, రాజేంద్రనగర్, బాచుపల్లి , ఇబ్రహీంపట్నంతో  పాటు శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రైవేట్‌ హాస్టళ్లు వెలిశాయి. వాటిలో వేల సంఖ్యలో విద్యార్ధులు బస చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థులకు భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇతర విషయాలను పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా  కొందరు విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోనే సిగరేట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారు.  వీరిని టార్గెట్‌గా చేసుకున్న కొన్ని ముఠాలు నేరుగా హాస్టళ్లకే గంజాయి సరఫరా చేస్తున్నాయి. 

వివిధ మార్గాల్లో నగరానికి..
ఏపీలోని విశాఖపట్నం, అరుకుతో పాటు  ఒరిస్సా, ఛత్తీస్‌ గడ్‌ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోంది. అక్కడ కిలో రూ. 1000 చొప్పున కొనుగోలు చేసి రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా నగరానికి తరలిస్తున్నారు. పోలీసులు అనుమానించకుండా ఖరీదైన వాహనాలతో పాటు, ఇతర సరకులతో పాటు లారీల్లో తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కమిషనరేట్‌ల పరిధిలో పోలీసులు  10 టన్నులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రవాణాదారుల నుంచి గంజాయి కొనుగోలు చేసే స్థానిక వ్యాపారులు సురక్షితమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుని గుట్టుచప్పుడు కాకుం డా నగరంలో విక్రయిస్తున్నారు. 20 గ్రాముల చొప్పున ప్యాకెట్‌లలోకి మార్చి యువతకు అంటగడుతున్నారు.

ధర తక్కువ..మత్తెక్కువ..
కొకైన్, బ్రౌన్‌ షుగర్, ఎల్‌ఎస్టీ తదితర మత్తు పదార్థాలు గ్రాము ధర రూ.వేలల్లో ఉండటంతో సంపన్న కుటుంబాలకు చెందిన యువత వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే గంజాయి 20 గ్రాముల ప్యాకెట్‌ రూ. 100 నుంచి 200 మధ్యలో లభ్యమవుతుండటంతో విద్యార్థులు, యువత దీని పట్ల ఆకర్షితులవుతున్నారు.  మొదట సిగరెట్లకు అలవాటు పడి ఆ తర్వాత క్రమంగా గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి చేసుకునే పార్టీల్లో గంజాయి ప్రధానం ఉంటున్నట్లు సమాచారం.  

రూట్‌ మార్చిన స్మగ్లర్లు ...
గతంలో  ధూల్‌పేట, మంగళ్‌హాట్‌ ప్రాంతాలు గుడుంబా, నాటుసారాకు కేంద్రాలుగా ఉండేవి. ప్రభుత్వం గుడుంబా తయారీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఈ దందాను వదిలేశారు. అయితే ఈజీమనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు రూటు మార్చుకుని ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. గోల్కొండ, సీతాఫల్‌మండి, టక్కర్‌ వాడీ, జుమ్మేరాత్‌ బజార్‌ తదితర ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు విక్రయించే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయా ముఠా ముఖ్యులపై వారిపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల నిఘా పెంచడంతో వారు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటూ అనుచరుల ద్వారా తమ దందా కొనసాగిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement