టార్గెట్‌ న్యూ ఇయర్‌ | Marijuana Smugglers Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ న్యూ ఇయర్‌

Published Fri, Dec 27 2019 10:53 AM | Last Updated on Fri, Dec 27 2019 10:53 AM

Marijuana Smugglers Arrest in Hyderabad - Sakshi

కుషాయిగూడ: నూతన సంవత్సర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని నగరంలో మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేస్తున్న ముఠాను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్, గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు.  మహబూబాబాద్‌ జిల్లా, గార్ల మండలం, వస్రమ్‌ తండాకు చెందిన బాదావత్‌ కిషన్‌ గతంలో పదేళ్ల పాటు ముంబైలో నివాసం ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పలు రాష్ట్రాలకు చెందిన మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో అతను భజర్‌తల్, జంకేడ్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ముఠాలతో కలిసి గత కొన్నేళ్లుగా గంజాయి, కొకైన్, హెరాయిన్‌ తదితర మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో మాదకద్రవ్యాలను  విక్రయించాలని భావించిన అతను ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన రాజేష్‌ పరమేశ్వర్, అనిల్‌ వైద్యనాథ్‌ బోస్లేలను సంప్రదించాడు. తనకు గంజాయి, బ్రౌన్‌షుగర్‌ సరఫరా చేయాలని కోరుతూ 50 శాతం డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో రాజేష్‌   రాజస్థాన్‌కు చెందిన షబ్బీర్‌తో కలిసి కిషన్‌కు అవసరమైన మాదకద్రవ్యాలను సిద్ధం చేశాడు.   కుషాయిగూడలోని తిరుమల లాడ్జిలో వారు కిషన్‌కు డ్రగ్స్‌ అందిస్తున్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కుషాయిగూడ పోలీసులు దాడి చేసి కిషన్, రాజేష్, అనిల్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన 150 గ్రాముల బ్రౌన్‌షుగర్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

పీడీ యాక్ట్‌ నమోదుకు సిఫార్సు: డీసీపీ
 నిందితులపై పీడీ యాక్టు నమోదుకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు. యన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందన్నారు. నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, రేవ్‌ పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌ ముఠాను అరెస్టు చేయడంతో ప్రతిభ కనబరిచిన మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కుషాయిగూడ పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ మల్కాజిగిరి నర్సింహ్మరెడ్డి, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్, మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement