స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను పరిశీలిస్తున్న సీపీ మహేష్‌భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు
నేరేడ్‌మెట్: విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరాచేస్తున్న ముఠాను ఎల్‌బీనగర్ జోన్ ఎస్‌ఓటీ, అబ్దుల్లాçపుర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, వారి నుంచి 81 కిలోల గంజాయి ప్యాకెట్లు, రెండు కార్లు, రూ.1.45లక్షల నగదు, 9సెల్‌ఫోన్లతోసహ మొత్తం రూ.30లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ కేసు వివరాలు వెల్లడించారు.
రెండేళ్లుగా గంజాయి దందా...
సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు నునావత్ జగన్(29), మలోత్ వినోద్(24), నునావత్ సుధాకర్(27),నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కేతవత్ మురళి(25) గత రెండేళ్లుగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 2019లో తూర్పుగోదావరి జిల్లా మోత్కుగూడెం ఠాణాలో నిందితుడు మురళిపై కొత్తగూడెం జిల్లా భద్రచలం ఠాణాలో వినోద్‌పై, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కోండ పోలీసుస్టేషన్‌లో మరో నిందితుడు సుధాకర్‌పై కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో పోలీసులు మురళి, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జైలులో ఒప్పందం..
రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడు మురళికి హైదరాబాద్‌లో ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్(27)తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేస్తే, రాజస్థాన్‌కు రవాణా చేస్తానని ఏజెంట్ మురళికి హామీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మురళి జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రధాన నిందితుడు నునావత్ జగన్ కలిసి జైలులో జరిగిన ఒప్పందం గురించి వివరించడంతో ఇందుకు అంగీకరించాడు. ఇందుకు సూర్యాపేట జిల్లాకు చెందిన మిగతా నిందితులు వంకుడోతు సాయి(21), వంకడోతు సుధాకర్, వంకుడోతు జితేందర్(33)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్లలో గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేసి, రాజస్థాన్‌కు చెందిన ఏజెంట్‌కు విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నారు.
కిలో రూ.1500కు కొనుగోలు...
విశాఖపట్నం జిల్లాలోని ధరకొండకు చెందిన గంజాయి విక్రేత రాజు(33)తో ప్రధాన నిందితుడు నునావత్ జగన్, మరో నిందితుడు మురళిలకు పాత పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా నలుగురు ముఠా సభ్యులందరితో కలిసి వారు ఈనెల 25వ తేదీన ధరకొండకు వెళ్లి విక్రేత రాజును కలిశారు. కిలో రూ.1500 చొప్పున 81 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్‌కు కిలో రూ.8వేలకు విక్రయించాలని ముఠా నిర్ణయించుకుంది. గంజాయిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్టు ప్రధాన నిందితుడు, కీలక సూత్రధారి అయిన నిందితుడు మురళిలు ఏజెంట్ రాకేష్‌కు సమాచారం ఇచ్చారు. తాను అందుబాటులో ఉండలేనందున ఏజెంట్ రాకేష్ హైదరాబాద్ నగర శివారులో ముఠా నుంచి గంజాయి ప్యాకెట్లను స్వీకరించేందుకు బోయినిపల్లికి చెందిన కూలీ అనూప్‌కుమార్(27)తో ఒప్పందం చేసుకున్నాడు.
సీట్లు, డిక్కీల్లో గంజాయి ప్యాకెట్లు...
అంబర్‌పేట్ సమీపంలో అనూప్‌కుమార్ వేచి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్ల సీట్లు, డిక్కీలలో దాచిపెట్టిన గంజాయి ప్యాకెట్లను తరలించిన ముఠా పెద్దఅంబర్‌పేటలో అప్పగించేందుకు వెళుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్‌బీ.నగర్ జోన్ ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు, ఏజెంట్ రాకేష్, గంజాయి విక్రేత రాజులు పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు,ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ దేవేందర్,సీఐలు రవికుమార్,సత్యనారాయణ, ఎస్‌ఓటీ ఎస్‌ఐ అవినాష్‌బాబులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment