
స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు
కాకినాడ క్రైం: కాకినాడ నగరం, రూరల్ మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాలపై ఆదివారం, సోమవారం ఉదయం దాడులు చేసి ఎనిమిది మంది సభ్యుల ముఠాను ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.మూడు లక్షల విలువైన గంజాయి, ఒక ఆటో, హీరోహోండా మోటర్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డినగర్‌లో నలుగురు వ్యక్తుల నుంచి ఎనిమిది కిలోలు, విశాఖపట్నం, తునిలకు చెందిన నలుగురు వ్యక్తులను కాకినాడ–సామర్లకోట కెనాల్ రోడ్డులోని కోటిపల్లి రైల్వే బ్రిడ్జి కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన కేడీపేట, రొంపుల పరిసర ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొని ఎక్కువ ధరకు అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
అందిన సమాచారం మేరకు..
కాకినాడ రూరల్ మండలం, సిటీ ప్రాంతాల్లో జోరుగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఇంద్రపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీనిపై ఎస్సై పి.విజయశంకర్, రూరల్‌సర్కిల్ సీఐ పి ఈశ్వరుడు, కాకినాడ రూరల్ తహసీల్దార్ బి.సోమశేఖరరావు ఆదివారం సాయంత్రం తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి కాలనీ బైపాస్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద సోదాలు చేయడంతో నలుగురు ముద్దాయిలు ఎనిమిది కిలోల గంజాయిని ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. అదే విధంగా సామర్లకోట–కాకినాడ కెనాల్‌రోడ్డులో కోటిపల్లి బ్రిడ్జి కింద సోదాలు చేయగా నలుగురు వ్యక్తులు 52 కిలోల గంజాయిని తరలిస్తుండగా సోమవారం ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనల వివరాలను కాకినాడ డీఎస్పీ రవివర్మ సోమవారం ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
కాకినాడ రూరల్ మండలం తూరంగి అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి నగర్‌కు చెందిన అనుపోజు రామ్‌కుమార్, ఇతడి భార్య అనుపోజు శ్రావణి, కాకినాడ రేచర్లపేట అనసూరమ్మ కాలనీకి చెందిన కోడిదాసు శివ అలియాస్ దాసు, ఇంద్రపాలెం పల్లపు వీధికి చెందిన దొడ్డిపాటి శివాజీ అనే వ్యక్తులను అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. వీరు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కేడీ పేట, రొంపుల పరిసరప్రాంతాల్లో కేజీ ఒక్కొంటికి రూ.మూడు వేలకు కొనుగోలు చేసి అనిశెట్టిబుల్లబ్బాయిరెడ్డి కాలనీలో వీటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రిక్షా, భవన నిర్మాణ కార్మికులకు, యువకులకు అమ్మకాలు చేస్తూ కిలో ఒక్కొంటికి రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు అమ్మకాలు చేస్తున్నారన్నారు. అదే విధంగా కాకినాడ–సామర్లకోట కెనాల్ రోడ్డులో విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం కేడీ పేట వినాయకుడి గుడి వీధికి చెందిన శివంగి, నూకరాజు, అదే జిల్లా జీకే వీధిమండలం రొంపుల గ్రామానికి చెందిన భీమవరపు మల్లేశ్వరరావు, తుని మండలం కొత్తసూరవరం గ్రామానికి చెందిన దాడి హరిబాబు, తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక నెహ్రూనగర్‌కు చెందిన కోరుప్రోలు దుర్గాప్రసాదరావులపై దాడి చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ ముద్దాయిల నుంచి ఏపీ 31 టీఏ 6283, ఏపీ 31 బీసీ 2018 ప్యాషన్ ప్లస్ మోటార్ బైక్‌లు, రూ.2.60 లక్షల విలువైన 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ విలేకర్లకు తెలిపారు. గంజాయిని అమ్మకానికి తరలిస్తు పట్టుబడ్డ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి స్మగర్లను అరెస్టు చేసిన ఇంద్రపాలెం ఎస్సై విజయశంకర్, రూరల్ సీఐ ఈశ్వరుడు, ఇంద్రపాలెం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవివర్మ అభినందించారు.