కేసు వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ సుధాకర్
నల్లగొండ క్రైం : నల్లగొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, అమ్ముతున్న పది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ ముఠా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన కొండ అంజమ్మ, నల్లగొండ పాతబస్తీకి చెందిన కల్లెపల్లి కిరణ్‌కుమార్, జేబీఎస్ వాసి రావిల్ల నర్సింహ, మునుగోడు రోడ్డులోని మహ్మద్ గౌస్, అక్కచెల్మకు చెందిన బల్గూరి రాజు, మహ్మద్ మూజుబుద్దీన్, షేక్ రఫీ, ప్రకాశం బజార్‌లోని టిటాంక్ రచన్‌సింగ్, తిల్పితీయ సమందర్‌సింగ్, నార్కట్‌పల్లికి చెందిన బాజ శివకుమార్‌లు ముఠాగా ఏర్పడ్డారు.
వీరు ఆటోడ్రైవర్లుగా, పండ్లబండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేస్తున్నారు. సైడ్ బిజినెస్‌కు గంజాయి దందాను ఎంచుకున్నారు. వీరు అరకు, శ్రీశైలం, దూల్‌పేట ప్రాంతాలనుంచి ఒకటి, రెండు కేజీల చొప్పున తక్కువ ధరకు కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకువస్తున్నారు. టిప్పర్ సిగరెట్, చిన్న ప్యాకెట్లలో సర్దుబాటు చేసి ఒక్కోటి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. గంజాయి కస్టమర్లు నల్లగొండ పట్టణంలో వందమంది దాకా ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో వీరిపై పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం వీరు నల్లగొండ పట్టణ శివారులో గోకుల్ బీఈడీ రోడ్డులో, రైల్వెస్టేషన్ రోడ్డు, నార్కట్‌పల్లి ఎస్సీ కాలనీ, నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో గంజాయి అమ్ముతుండగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నాయి. వీరినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అంజమ్మపై గతంలో గంజాయి అమ్మిన కేసు ఉంది. అదే విధంగా బల్గూరి రాజుపై నల్లగొండ వన్‌టౌన్‌లో రౌడీషీట్, మూజుబుద్దీన్‌పై కిడ్నాప్, కొట్లాట, షేక్ రఫీపై ఎస్సీ, ఎస్టీ కేసు, టిటాంక్ రచన్‌పై గంజాయి, హత్యాయత్నం, చీటింగ్ కేసులు ఉన్నాయి.
కాల్‌డేటా ఆధారంగా కదలిన డొంక
గంజాయి డొంకను పోలీస్‌లు కాల్‌డేటా ఆధారంగా ఛేదించారు. అమ్మేవారిని, కొనేవారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఏడేళ్ల క్రితం గంజాయి అమ్మిన ఓ వ్యక్తి పోలీస్‌లకు దొరకడంతో అప్పుడు అమ్మడం మానివేశాడు. మళ్లీ ఆరు నెలలుగా గంజాయి అమ్ముతున్నాడు. అతని కాల్‌డేటా ఆధారంగా గుర్తింపు అదుపులోకి తీసుకుని విచారణ జరిపగా, డొంక బయటపడింది. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి మూలాలను కదిలిస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. సమావేశంలో సీఐలు వెంకటెశ్వర్లు, రవికుమార్, పీఎన్‌డీ ప్రసాద్, సుబ్బిరాంరెడ్డి, క్యాస్ట్రో రెడ్డి, గోవర్దన్, 2టౌన్ ఎస్‌ఐ మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment