పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్‌ చేసిన సీఐ.. ప్లాట్‌ కొనిస్తా అంటూ.. | police officer extramarital affair in nalgonda | Sakshi
Sakshi News home page

పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్‌ చేసిన సీఐ.. ప్లాట్‌ కొనిస్తా అంటూ..

Published Sun, Dec 15 2024 9:46 AM | Last Updated on Sun, Dec 15 2024 11:24 AM

police officer extramarital affair in nalgonda

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఆరోపణ

ఆధారాలతో ఫిర్యాదు చేశానంటున్న బాధితుడు

నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్‌ సీఐ డానియల్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. 

వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్‌ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్‌ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్‌, చాటింగ్‌ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.

తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్‌ఫోన్‌ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్‌లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్‌ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్‌ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.

ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం
– ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్‌ చాటింగ్‌ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement