
కల చెదిరిపోయి, ఊరు విడిచి వెళ్లిపోయిన అమృత
కొడుకు లేక విలపిస్తున్న ప్రణయ్ తల్లిదండ్రులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి(Amrutha Pranay) ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది.
అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఈ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి.
చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
కడుపుతో ఉన్నా కరుగని మనస్సు..
కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నాభిన్నమైన కుటుంబాలు
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్‌ఐసీ సంస్థలో విధులు నిర్వహిస్తుండగా.. పెద్ద కుమారుడు ప్రణయ్ డిగ్రీ వరకు చదివాడు. చిన్న కుమారుడు ఉక్రేయిన్ చదువుకుంటుండగా, యుద్ధ సమయంలో స్వదేశానికి వచ్చిన అతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. కాగా, కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. పెద్దకొడుకు ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చిన సమయంలో బాలస్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు నా కుమారుడు లేడు, అమృతకు భర్త లేడు, నా మనువడికి తండ్రి లేడు’ అంటూ కన్నీరుమున్నీరవుతూనే.. మారుతీరావు కూడా ఆత్మహత చేసుకోవడం కలిచి వేసిందన్నారు. ప్రణయ్ హత్య తరువాత కొద్ది నెలలు అత్తామామల వద్ద ఉన్న అమృత తన తండ్రి మరణం తరువాత తల్లిదగ్గరరకు వచ్చేసింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. తన భర్త హత్య వెనక తన బాబాయి శ్రవణ్‌కుమార్ ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులకు చెప్పడంతో హత్య కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌కు సైతం యాజ్జీవ కారాగార శిక్ష పడటంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత, ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదంగా మారి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.
చదవండి: అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు