
సాక్షి,నల‍్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.
సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.
ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు.
Comments
Please login to add a commentAdd a comment