Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర! | most heinous crime story Of Asghar Ali, Abdul Bari | Sakshi
Sakshi News home page

Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర!

Published Tue, Mar 11 2025 7:50 AM | Last Updated on Tue, Mar 11 2025 7:50 AM

most heinous crime story Of Asghar Ali, Abdul Bari

హరేన్‌ పాండ్యాను కాల్చంది అస్ఘరే

ప్రణయ్‌ హత్యకు ప్రధాన సూత్రధారి 

మీర్జా ఎస్కేప్‌ కేసులోనూ ఇతడి పాత్ర 

ఈ కేసుల్లో అబ్దుల్‌ బారీ నిందితుడే 

సలీమ్‌నగర్‌లో ఇతడి అడ్డా 

 ‘ప్రణయ్‌ తీర్పు’తో మళ్లీ తెరపైకి

సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్యకు కీలక సూత్రధారులుగా ఉండి, సోమవారం జీవితఖైదు పడిన అస్ఘర్‌ అలీ, అబ్దుల్‌ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు వాటిలో ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్ఘరే అని సీబీఐ ఆరోపించింది. 

పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాద శిక్షణ... 
నల్లగొండలోని దారుల్‌షిఫా కాలనీకి చెందిన మహ్మద్‌ అస్ఘర్‌ అలీకి జునైద్, అద్నాన్, చోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్‌లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు.కాశ్మీర్ కు చెందిన ముస్లిమ్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్‌ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్‌తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. పాకిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చిన అస్ఘర్‌ నల్లగొండలోని ప్యార్‌ çసూఖాబాగ్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. 

ఆ కేసుల్లో మీర్జా నిందితుడిగా... 
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కర సేవకుల్ని టార్గెట్‌గా చేసుకుని నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో, అదే ఏడాది  ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్‌ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్‌ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్‌ అహ్మద్‌ అలియాస్‌ ఫయాజ్‌ బేగ్‌ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్‌ గౌడ్‌లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్‌ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు.  

తప్పించి తీసుకువెళ్లిన ద్వయం.. 
మీర్జాను తప్పించడానికి అస్ఘర్, బారీ తదితరులు పథక రచన చేశారు. 1996 డిసెంబర్‌ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్‌ చేయించారు. అస్ఘర్‌ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశీ్మర్‌కు పంపి ముస్లిమ్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్‌ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో మీర్జా హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్‌ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్‌ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వా«దీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్, బారీల పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది.  

ఐఎంఎంఎంలోనూ అస్ఘర్‌ పాత్ర.. 
ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్‌ 6న ఎన్‌కౌంటర్‌ అయ్యాడు) ఇండియన్‌ ముస్లిమ్‌ మహ్మదీ ముజాహిదీన్‌ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచి్చన అస్ఘర్‌ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్‌ (గ్యాంగ్‌) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా కారులో వెళ్ళి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్‌ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు.

అప్పట్లో మేడ్చల్‌లో అరెస్టు... 
ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్‌ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేలి్చనా..గుజరాత్‌ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్‌ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్‌నగర్‌లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. 2018లో ప్రణయ్‌ హత్య కేసులో అరెస్టు కావడంతో పోలీసులు, నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హరేన్‌ పాండ్యా కేసును గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ విచారణ అనంతరం అస్ఘర్‌కు జీవితఖైదు పడింది. దీంతో 2019 ఆగస్టులో ఇతడిని సబర్మతి జైలుకు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement