
గ్రూప్స్‌లో టాపర్‌గా వినీషా రెడ్డి
మొదటి అటెంప్ట్ లోనే విజయం
ఇప్పటికి మూడు పరీక్షల్లో ర్యాంకులు
వైద్య వృత్తిని వదిలి ఐఏఎస్ వైపు
యూట్యూబ్ క్లాసులతో ‘గ్రూప్స్’ టాప్
ప్రస్తుతం యువతను సోషల్ మీడియా గురించి అడిగితే.. రీల్స్ గురించి, షార్ట్స్ గురించి చెబుతారు.. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్‌ను వినియోగించుకుని గ్రూప్స్‌లో టాపర్‌గా నిలిచింది ఆ యువతి. ప్రతి నిమిషం అదే లక్ష్యంతో ఏకాగ్రతగా నిర్ధేశిత ప్రణాళికతో ముందుకు కదిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించింది. ఆమె నగరానికి చెందిన డాక్టర్ వినీషా రెడ్డి.. యూట్యూబ్‌లో పోటీ పరీక్షల క్లాసులు వీక్షిస్తూ రికార్డును సృష్టించింది..
ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి వరుసగా టాపర్‌గా నిలిచారు వినీషా రెడ్డి. చదివింది వైద్య వృత్తి అయినప్పటికీ తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీహెచ్‌ఎంఎస్ పూర్తి కాగానే డాక్టర్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపకుండా 2022 నుంచి పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.
కోచింగ్ సెంటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చోని ఆన్‌లైన్ క్లాసుల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం అయితే సమయం వృథా కాదని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. చదివిన వైద్య వృత్తితో సంబంధం లేకుండా యూట్యూబ్‌లో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల టాపర్స్ ఇంటర్వ్యూలను వీక్షించారు. తద్వారా ఓ అంచనాకు వచ్చారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుని యూ ట్యూబ్‌లో క్లాసులను వీక్షించారు. చక్కని ప్రణాళికతో రోజుకు ఎనిమిది గంటలు సమయం కేటాయించి సబ్జెక్టుల వారీగా క్లాసులు వింటూ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
మొదటి అటెంప్ట్ లోనే..
అనుకున్న లక్ష్యాన్ని చేరేలా చక్కని ప్రణాళికతో ప్రాక్టీస్ చేసినట్లు డాక్టర్ వినీషా రెడ్డి చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన సీడీపీవో పరీక్షలకు హాజరై స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్–1లో సైతం అత్యధిక మార్కులు సాధించారు. గ్రూప్–2 మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచారు. తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్–3 మహిళా విభాగంలోనూ మొత్తం 450 మార్కులకు గానూ 325.157 మార్కులు సాధించారు. 8వ జనరల్ ర్యాంకింగ్‌లో నిలిచారు. సివిల్స్ పరీక్షలతో ఐఏఎస్ కావాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని వినీషారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment