
నారాయణపేట రూరల్: తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాయితో మోది హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అలియాస్ వెంకటమ్మ(36)కు 15 ఏళ్ల క్రి తం కర్ణాటక రాష్ట్రం నస్లైకి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయి తల్లి వారింట్లో ఉంటోంది. జీవనోపాధి కోసం పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసే పనిచేస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది.
ఇరువురి ప్రవర్తనపై అను మానం వచ్చిన మొగులప్ప భార్య లక్ష్మి గతంలో పలుమార్లు బుజ్జమ్మతో గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య ఎన్నోసార్లు గొడవలు, దాడులు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు లక్ష్మి ఆవేశంగా వెళ్లింది. ఇది గమనించిన బుజ్జమ్మ తనపై దాడి చేయడానికి వస్తుందని ఉపాధి హామీ మేటికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, నర్సరీ గేటుకు తాళం వేసుకుంది.
అయినప్పటికీ లక్ష్మి ముళ్లపొదలను దాటు కుంటూ లోపలికి వెళ్లి రాయితో బలంగా బుజ్జమ్మ తలపై మోదడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు నందిపాటి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment