ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడని మద్యం మత్తులో విచక్షణారహితంగా కుమారుడిని కొట్టిన తండ్రి
బలమైన దెబ్బ తగలడంతో మృతిచెందిన బాలుడు
సొంతూరులో గుట్టుగా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు
విషయం తెలుసుకుని అడ్డుకున్న పోలీసులు
పోస్టుమార్టం అనంతరం తిరిగి అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులు
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్‌నగర్‌లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు.
రెండో కుమారుడు చౌటుప్పల్‌లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు.
దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అశ్రునయనాలతో అంత్యక్రియలు
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి.
కేసు నమోదు
ఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment