
గంజాయితో పట్టుబడ్డ నిందితులు
ఆయనో స్మగ్లర్...ఢిల్లీకి చెందినవాడు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తరలించేందుకు సిద్ధపడ్డాడు. కానీ బస్సులో వెళ్తే పోలీసుల తనిఖీలు జరిగితే పట్టుబడతానని భావించి ఏజెన్సీలోని డిగ్రీ చదువుతున్న గిరిజన యువకులకు ఎరవేశాడు. గంజాయిని చెప్పిన చోటకు అప్పజెబితే రూ.12వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టే గంజాయిని స్మగ్లర్‌కు అప్పగిస్తుండగా ముగ్గురూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద (విశాఖ – అరకు ప్రధాన రహదారిలో) గంజాయిని తరలిస్తున్న ఢిల్లీ, విశాఖ ఏజెన్సీలకు చెందిన అజయ్, సోలోమన్, సీతారామశాస్త్రి అనే యువకులు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్.కోట ఎస్‌ఐ ఎస్.అమ్మినాయుడు శుక్రవారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అజయ్ అనే గంజాయి స్మగ్లర్ డుంబ్రిగుడ మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చాపరాయి గ్రామ సమీపానికి చేరుకున్నాడు. అరకు, అనంతగిరి మీదుగా ఆర్టీసీ బస్సులో గంజాయిని తీసుకువెళ్తే పోలీసుల సోదాలో పట్టుబడతామని భావించి ద్విచక్ర వాహనంపై గంజాయిని ఎస్.కోట పట్టణ శివారు ప్రాంతంలో అందజేసేందుకు డుంబ్రిగుడకు చెందిన డిగ్రీ యువకులు సోలోమన్, సీతారామశాస్త్రిలను స్మగ్లర్ సంప్రదించాడు.
గంజాయిని తరలించేందుకు కేజీకి రూ.వెయ్యి చొప్పున రూ.12వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తరువాత స్మగ్లర్ అజయ్ ఆర్టీసీ బస్సులో ఎస్.కోట పట్టణ శివారున గల హోండా షోరూం సమీపానికి చేరుకున్నాడు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకొచ్చిన ఏజెన్సీ యువకులు స్మగ్లర్ అజయ్‌కు అందజేస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు కాపు కాచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.14వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను విశాఖలోని సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ అమ్మినాయుడు తెలిపారు. మధ్యవర్తులు హెచ్‌డీటీ ఎన్.కూర్మనాధరావు, వీఆర్‌వో వడ్డాది శ్రీనివాసరావు, కె.సన్యాసిరావు సమక్షంలో గంజాయితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment