Vizianagaram Crime News
-
చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు
సాక్షి, విజయనగరం క్రైం: ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన డిగ్రీ విద్యార్థిని తెల్లారేసరికి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో రోడ్డుపక్కన పొదల్లో బందీగా కనిపించింది. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సోమవారం వేకువజామున ఈ ఘటన వెలుగు చూసింది. జాగింగ్‌కు వెళ్లిన కొందరు యువకులు ఆ యువతిని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి విజయనగరంలోని ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్ చదువుతోంది. అనారోగ్య కారణాల వల్ల తన స్వగ్రామానికి వెళ్తానని వార్డెన్‌కు చెప్పిన ఆ యువతి శనివారం సాయంత్రం కళాశాలలోని హాస్టల్ నుంచి బయలుదేరింది. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా రాజాం మీదుగా తన ఊరెళ్లేందుకు ఓ ప్రైవేటు వాహనం ఎక్కింది. ఆ తరువాత ఏమైందో గానీ సుమారు 36 గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున గుర్లలో అంతుచిక్కని పరిస్థితుల్లో కనిపించింది. ఆ మార్గంలో జాగింగ్ చేస్తున్న వారికి పొదల్లోంచి మూలుగులు వినబడటంతో వెళ్లి చూడగా ఓ యువతి అచేతన స్థితిలో కనిపించటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె చేతులు, కాళ్లకు ఉన్న కట్లను విప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ పి.అనిల్‌కుమార్, సీఐ మంగవేణి విచారణ చేసినప్పటికీ ఆ యువతి నోరు విప్పలేదు. యువతి షాక్‌కు గురవ్వడం వల్ల నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్నేహితులతో ఆటోలో.. యువతి ప్రైవేట్ వాహనంలో ఎక్కడకు వెళ్లిందన్న విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం బస్ కాంప్లెక్స్ వద్ద ఆ యువతి ప్రైవేటు వాహనం ఎక్కి కోట వద్ద దిగిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అక్కడి నుంచి స్నేహితులతో కలిసి ఓ ఆటోలో గుర్ల వరకు ప్రయాణించినట్టు గుర్తించామని చెప్పారు. 2016లో ఆ యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు రాగా.. హైదరాబాద్‌లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తనకు మూర్ఛ రోగం ఉండటంతో ఏమీ గుర్తుకు రావడం లేదని ఆ యువతి చెబుతోందన్నారు. విచారణను వేగవంతం చేసి అసలు విషయాన్ని తెలుసుకుంటామన్నారు. రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ఇదిలావుండగా.. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని, రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిస్తున్నామని అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు తెలిపారు. బాధిత యువతి ప్రతి వారం కాళీ ఘాట్ కాలనీలో ఉంటున్న చిన్నాన్న ఇంటికి వెళ్తుంటుందని చెప్పారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, వైద్యులు నుంచి అందే నివేదికల ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట దిశ డీఎస్పీ త్రినాథ్ ఉన్నారు. -
యువతిని కాళ్లు, చేతులు కట్టేసి..
-
ఆమెది హత్యే..
గరివిడి : తన సోదరిని ఆమె భర్తే బలవంతంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి సోదరుడు జి. రాజు గురువారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండపాలెం పంచాయతీకి చెందిన టెక్కలి దేవి (28) గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమెను భర్త టెక్కలి లక్ష్మణ చంపేసి పట్టాలపై పడేశాడని.. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నాడని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో భార్యతో అన్యోన్యంగా ఉన్నాడని కన్నతండ్రినే..
విజయనగరం, గజపతినగరం: మండలంలోని వేమలి గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి హతమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వేమలి గ్రామానికి చెందిన బొద్దూరు వెంకటరమణ (50)కు ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్య సత్యవతికాగా, రెండో భార్య కుమారి. తాపీ పనిచేస్తున్న వెంకటరమణ వేమలి గ్రా మంలో ఓ ఇంటి నిర్మాణం పనికి రెండో భార్య కుమారిని తీసుకెళ్లాడు. ఎప్పటికప్పుడే రెండో భార్యతో అన్యోన్యంగా ఉంటూ పనికి వెంట తీసుకెళ్తున్నాడని మొదటి భార్య సత్యవతి తన కొడుకు అయిన చక్రధర్‌రావుకు చెప్పింది. దీంతో పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఈ గొడవలో తాపీపనిలో వినియోగించే గజంబద్దతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామ రెవెన్యూ అధికారి సమాచారం మేరకు సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చక్రధర్రావుపై కేసునమోదు చేశారు. -
బయటపడ్డ భూతవైద్యుడి బండారం
సాక్షి, శృంగవరపుకోట: దెయ్యాలు... భూతాలు... చెడుపు... చిల్లంగి... చేతబడులు... బాణామతులు అంటూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఓ భూతవైద్యుడి బండారం బయటపెట్టిన సంఘటన ఇది. శృంగవరపుకోటలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ పరిధి గాదెల్లోవ గ్రామంలో గమ్మెల పోతురాజు అనే వ్యక్తి భూతవైద్యం పేరుతో సామాన్యులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడు. ఇటీవల ఇతని భూతవైద్యాన్ని నమ్మి కొడుకును పోగొట్టుకున్న కుటుంబీకుల వేదన చూసి చలించిపోయిన శృంగవరపుకోట బర్మాకాలనీకి చెందిన జనా లక్ష్మీనారాయణ మారుమూల గ్రామంలో భూతవైద్యుడు పోతురాజు చేస్తున్న మోసాన్ని కొంతమంది మీడియా మిత్రులకు చెప్పారు. భూతవైద్యుడి ఆటకట్టించాలని పథక రచన చేశారు. బర్మా కాలనీకి చెందిన పొడుగు అప్పలరాజు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగా లేదని పోతురాజు వద్దకు తీసుకెళ్లారు. అతనికి దెయ్యం పట్టిందని బాగుచేయాలని, అందుకు పూజ జరిపించాలని పోతురాజు చెప్పాడు. పూజలు చేసేందుకు బయటి వారికైతే రూ. 40వేలు తీసుకుంటానని చెప్పాడు. లక్ష్మీనారాయణ తదితరులు బాధితుడు అప్పలరాజుకు బాగు చేసేందుకు పూజ పెట్టాలని కోరారు. అందుకు రూ.10వేలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అతడిని ఎస్.కోట రావాలంటూ పిలిచారు. శనివారం సాయంత్రం ఎస్.కోట వచ్చిన పోతురాజు 6గంటల సమయంలో బర్మా కాలనీ సమీపంలోఉన్న క్వారీలో అప్పలరాజును కూర్చోబెట్టి రంగులతో ముగ్గులు వేసి, హోమాలు వేసి పూజలు చేసినట్టు నమ్మించాడు. పూజలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ తదితరులు కొందరు విలేకరుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భూతవైద్యుడు పోతురాజును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ శ్రీనివాసరావు పోతురాజును విచారించగా తాను డబ్బు కోసం పూజలు చేయనని, ఎవరైనా గాలి గుణంతో ఇబ్బంది పడితే బాగు చేసి, వాళ్లిచ్చిందే తీసుకుంటానంటూ చెప్పాడు. లక్ష్మీనారాయణ, అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
పది నిమిషాల్లోనే...
పదకొండు నెలల బిడ్డను విశాఖలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తమ బిడ్డతో పాటు తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. అదుపుతప్పిన బైక్ లారీ కింది భాగంలోకి బలంగా దూసుకుపోవడంతో బిడ్డ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూసపాటిరేగ (భోగాపురం): ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మోటారుసైకిల్‌పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. వారితో ఉన్న 11 నెలల బాలుడు తన్వీర్‌కు గాయమైంది. వివరాల్లోకి వెళ్తే...జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీనివాసరావు(30) తొమ్మిది నెలల కిందట అక్కివరం శ్రీనివాస హేచరీలో సూపర్వైజర్గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య స్వాతి(29), 11 నెలల కుమారుడు తన్వీర్‌తో కలిసి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు బయలుదేరారు. సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జంక్షన్‌కు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని బైక్‌తో బలంగా ఢీకొని లారీ కిందకు మోటారుసైకిల్‌తో పాటు దూసుకెళ్లాడు. శ్రీనివాసరావు వెనక్కి తూలడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది. 11 నెలల తన్వీర్ కిందకు పడడంతో తలకు స్వల్ప గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐ శ్యామల సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్వాతిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ శ్యామల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదబుడ్డిడిలో విషాదం... జియ్యమ్మవలస: రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృత్యువాత పడడంతో పాటు భార్య స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో పెదబుడ్డిడిలో విషాదం నెలకొంది. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. రెండేళ్ల కిందటే వివాహమైన శ్రీనివాసరావు, స్వాతి దంపతులకు 11 నెలల బిడ్డ తన్వీర్ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుని తండ్రి కొద్ది సంవత్సరాల కిందట మరణించగా తల్లి, నాన్నమ్మ, తమ్ముడితో కలిసి శ్రీనివాసరావు పెదబుడ్డిడిలో నివాసం ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం కావడం, ఇంటికి శ్రీనివాసరావే ఆధారం కావడం ఇంతలోనే మృత్యువాత పడడంతో ఇక ఎలా జీవించేదని కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. -
బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
సాక్షి, విజయనగరం : బాలికపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విజయనగరం మండలంలో అయిదేళ్ల బాలిక ఇంటి వెనకాల ఉంటున్న 60 ఏళ్ల వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరి పెద్దలను ఆశ్రయించారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కస్టడికి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు విజయనగరం ఘోసా ఆసుపత్రిలో బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం) చదవండి : బిజినెస్‌కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని.. ప్రియురాలిపై సామూహిక లైంగికదాడికి యత్నం -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
విజయనగరం, గుర్ల: ఆటోలో మరిచిపోయిన ఫోన్‌ను తీసుకురావడానికి వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని పాచలవలసకు చెందిన కొసిరెడ్డి రమణ జిల్లా కేంద్రంలోని ఏజీఎల్ కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. రోజులాగానే శుక్రవారం కూడా గ్రామం నుంచి ఆటోలో కళాశాలకు వెళ్లడానికి బయలుదేరాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మిత్రుడితో ఫోన్లో మాట్లాడి బస్సు ఎక్కడుందో తెలుసుకున్నాడు. గూడెం జంక్షన్ వద్ద ఆటో దిగి కళాశాలకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. అయితే బస్సు ఎక్కిన తర్వాత తన ఫోన్ ఆటోలో మరిచిపోయానని గ్రహించిన రమణ వెంటనే బస్సు దిగి ఆటో కోసం రోడ్డు దాటుతుండగా.. గరివిడి నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు ఈశ్వరరావు, బంగారులక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రైలుఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
విజయనగరం,బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వాలేటి జోగీందర్ భూపతినాయుడు (18)ఉరఫ్ ఉదయ్‌ను రైలు ఢీ కొనడంతో ఆదివారం మృతిచెందాడు. విద్యార్థి విజయవాడ చైతన్య కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదుతున్నాడు. సంక్రాంతి సెలవులకోసం స్వ గ్రామం భీమవరం వచ్చాడు. తల్లిదండ్రులు, అక్క, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి కళాశాలకు వెళ్లేందుకు డొంకినవలస గ్రామం పక్క నుంచి ట్రాక్ దాటుతూ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఉదయం 9.30 ప్రాంతంలో విశాఖ నుంచి కొరాపుట్ వెళ్లే (డీఎంయూ) ఢీకొంది. దీంతో విద్యార్థి దుర్మరణం చెందాడు. రైలు డ్రైవర్, స్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి హెచ్‌సీ కృష్ణారావు తమ సిబ్బందితో కలసి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడుని రైలు రూపంలో మృత్యువు కబలించిందంటూ తల్లిదండ్రులు ఉమాదేవి, తిరుపతినాయుడు, సోదరి తేజశ్వని బోరున విలపిస్తున్నారు. -
ఒంటరి మహిళలకు మత్తుమందు ఇచ్చి..
విజయనగరం క్రైమ్: ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం... మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన డ్రింక్స్ తాగించడం.. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో ఉడాయించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దొంగిలించిన సొత్తును బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి జల్సా చేయడం అతని అలవాటు. అటువంటి వ్యక్తిని.. అతనికి సహకరించిన మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ రాజకుమారి స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామానికి చెందిన కొట్టిస లకు‡్ష్మన్నాయుడు రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఒంటరిగా ప్రయాణించే మహిళలతో మాటలు కలిపేవాడు. ఈ క్రమంలో వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారితో నిత్యం ఫోన్లో మాట్లాడేవాడు. వారితో పరిచయాలు పెంచుకుని ఆయా ఊళ్లకు వెళ్లేవాడు. బస్టాండ్ దగ్గర ఉన్నానని.. పలానా హోటల్ వద్ద ఉన్నానని పరిచయం ఉన్న మహిళలను రప్పించుకుని వారికి మత్తుమందు కలిపిన డ్రింక్‌లు ఇచ్చేవాడు. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో పాటు బ్యాగుల్లో ఉన్న నగదుతో ఉడాయించేవాడు. అనంతరం తన సహచరుడైన పాయకరావుపేటకు చెందిన తోట ప్రసాద్ సహాయంతో బంగారు ఆభరణాలను మత్తూట్, మణప్పరం, ఐఐఎఫ్ఎల్ వంటి ప్రైవేట్ సంస్థల్లో తనాఖా పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఇటీవల పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన ఎస్పీ రాజకుమారి నిందితుడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశిస్తూ సీసీఎస్ పోలీసులను ఆదేశించారు. దీంతో సీసీఎస్ పోలీసులు నెల రోజులుగా విచారణ చేపడుతూ ఎట్టకేలకు నిందితుడు లకు‡్ష్మనాయుడుతో పాటు అతనికి సహకరిస్తున్న తోట ప్రసాద్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు 22 నేరాలు చేసినట్లు అంగీకరించగా.. పోలీసుల విచారణలో మాత్రం 13 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి రూ. 15 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తనఖాలో ఉన్న మరో 20 తులాల ఆభరణాలు రికవరీ చేసుకోవాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఎస్సై ఐ. సన్యాసిరావు, హెచ్‌సీలు జి.నాగేంద్రప్రసాద్, జి.మహేశ్వరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, ఎం.వాసులను ఎస్పీ రాజకుమారితో పాటు సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు, విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్బీ డీఎస్పీ సీఎం సన్యాసినాయుడు, సీసీఎస్ సీఐలు డి. లకు‡్ష్మనాయుడు, దాసరి లక్ష్మణరావు, కాంతారావు, ధనుంజయరావు, తదితరులు అభినందించారు. నిందితుడు గతంలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి నిందితుడు లకు‡్ష్మనాయుడు ఇండియన్ ఆర్మీలో 1996 నుంచి 2005 వరకు పనిచేశాడు. అప్పట్లోనే పలు నేరాలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ. 70 లక్షల వరకు కాజేశాడు. ఈ సంఘటనపై విశాఖ జిల్లా చీడికాడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. శ్రీకాకుళంలో ఒక హత్యకేసు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ కేసు, మరో రేప్ అండ్ మర్డర్ కేసు, గుంటూరు జిల్లాలో మరో రెండు కేసుల్లో లకు‡్ష్మనాయుడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి భార్య కూడా ఒక దొంగతనం కేసులో మంగళగిరి జైల్లో ఉందని పోలీసులు తెలిపారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.రాజకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మవద్దని.. వారిచ్చే వస్తువులు, పానీయాలు, భోజనాలు, టీ, కాఫీ, టిఫిన్స్ వంట వి తీసుకోరాదన్నారు. అనుమానితుల సమాచారన్ని డయల్ 100కి గానీ, వాట్సాప్ నంబర్ 63098 98989 అందించాలని సూచించారు. -
కుంభకోణంలో తప్పు ఒప్పుకున్న ఉపాధ్యాయులు
తప్పు ఒప్పుకున్నారు. తప్పుడు ధ్రువీకరణతో బిల్లులు పెట్టుకుని నిధులు తీసుకున్నట్టు అంగీకరించారు. ఎప్పటికైనా... వాస్తవాలు బయటకు రాక తప్పదని భావించి అప్రూవర్లుగా మారారు. గడచిన కొద్ది రోజులుగా సాక్షిలో వస్తున్న వరుస కథనాలు ఓ వైపు సంచలనం సృష్టించగా... విచారణ నివేదిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ శుక్రవారం నిర్వహించిన విచారణకు వచ్చిన అధికారులు... బాధ్యులతో కార్యాలయంలో హడావుడి నెలకొంది. సాక్షి ప్రతినిధి విజయనగరం: చేసిన తప్పును ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుందనుకున్నారో ఏమో.. పార్వతీపురం పట్టణంలోని ఆర్సీఎం బాలుర ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల, బాలగుడబ ఆర్సీఎం యూపీ పాఠశాలలో పనిచేసినట్లు తప్పుడు నివేదికలు, బిల్లులు సమర్పించినట్లు 13 మం ది ఉపాధ్యాయలు విచారణలో అంగీకరించారట. తప్పుడు సర్వీసు రిజిస్టర్‌ను విద్యాశాఖకు సమర్పించి తద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి 14 సంవత్సరాలకు సంబంధించిన జీతం బకాయిలు రూ.4.01కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలపై కొద్దిరోజులుగా ‘సాక్షి’ వరుస కథనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. గుట్టు మొత్తం బయటపడిపోవడంతో ఇక తప్పించుకోలేమని భావించి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు నిజాన్ని ఒప్పుకున్నారు. ముచ్చటగా మూడవసారి ఈ కుంభకోణంపై పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఈ నెల 7, 15 తేదీల్లో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపి తాజాగా శనివారం మూడోసారి కూడా విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలపై సబ్‌కలెక్టర్ ఆరాతీసి జరిగిన అవకతవలను గుర్తించినట్టు సమాచారం. విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎయిడెడ్ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఫాదర్లు హాజరయ్యారు. అవకతవకలు నిజమే...: యాజమాన్యం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పుడు సర్వీస్ రిజిస్టర్లు చూపించి ఎరియర్స్‌ను పొందినట్టు ఉపాధ్యాయులు అంగీకరించినట్టు విచారణకు హాజరైనవారి నుంచి వచ్చిన ప్రాధమిక సమాచారం. మొత్తం 13 మంది ఉపాధ్యాయులు తాము 2017లో విధుల్లో చేరినట్టు రాత పూర్వకంగా సబ్‌కలెక్టర్ కు తెలియజేశారు. మిగిలిన 14 సంవత్సరాలకు ఎరియర్సు బిల్లులు ఉద్దేశ పూర్వకంగానే సమర్పించి ప్రభుత్వం కళ్లుగప్పి, విద్యాశాఖ ఉన్నతాధికారులను మోసం చేసి డబ్బును రాబట్టినట్టు విచారణలో స్పష్టమైనట్టు తెలిసింది. చర్చి ఫాదర్లను విచారించిన సబ్‌కలెక్టర్ విచారణలో భాగంగా సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ చర్చి ఫాదర్లను శనివారం విచారించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ చేయడంలో కొంతమంది ఫాదర్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల నియామకాలను కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు పిటిషనర్ గురువులు ఆరోపించారు. ఈ కోణంలో కూడా సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరుపుతున్నారు. రాజీ ప్రయత్నాలు ఈ కుంభకోణం కేసును ఎలాగైనా ఇక్కడితో ఆపేయించడానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..తప్పు జరిగిపోయిందని, ఇది విచారణలో రుజువై శిక్ష పడితే ఆర్సీఎం ఎయిడెడ్ పాఠశాలల పరువు పోతుందని, ఈ రొంపి నుండి ఎలాగైనా తప్పించాలని వారు తమ ఉన్నతాధికారులను సంప్రదించి మొరపెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నివేదిక ఆధారంగా చర్యలు ఇప్పటికే పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన నివేదిక మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదికలోని అంశాల ఆధారంగా కుంభకోణంలో బాధ్యులపై చర్యలు ఉంటాయి. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్, విజయనగరం -
‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ..
చక్కనైన ఉద్యోగం... అనుకూలవతి అయిన భార్య... ఇద్దరు పిల్లలూ సరస్వతీ కటాక్షం ఉన్నవారే. ఇంజినీరింగ్‌లో ఉన్నత చదువులు చదువుతున్నవారే... చీకూ చింతా లేని జీవనం. ఎలాంటి సమస్యలూ లేని ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో... నిద్రమత్తు రూపంలో ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడలో నిద్రమత్తులో రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ వాటికింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆ దంపతులను చూసి కన్నీరు పెట్టనివారంటూ లేరు. సాక్షి, గరివిడి(విజయనగరం): కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబంతో కలసి చేసుకోవాలని సుదూరం నుంచి వచ్చిన ఆ దంపతులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న ఆయన... నిరంతరం ఆయన్నే అంటిపెట్టుకునే భార్య ఒకేసారి కన్నుమూయడంతో గరివిడి మండ లం వెదుళ్లవలసలో విషాదం అలముకుంది. కనురెప్పపాటులో జరిగిన దుర్ఘటనలో వారిద్దరూ శవాలుగా మారడంతో తమ పిల్లలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో వెదుళ్లవలస గ్రామా నికి చెందిన కాపరోతు వెంకటరమణరావు(48) ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్) హెచ్‌సీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య నాగమణి(40)తో కలసి అక్కడే నివాసం ఉంటున్నారు. కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవాలని ఛత్తీస్‌గఢ్ నుంచి సికింద్రాబాద్ – భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ట్రైన్లో వస్తున్నారు. ముందుగా నాగమణి కన్నవారి ఊరైన దువ్వాడలో దిగి వెదుళ్లవలస రావాలని వారు భావించారు. వారు ఏసీ బోగీలో ప్రయాణిస్తూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఆదివారం వేకువజాము మూడు గంటలయ్యేసరికి దువ్వాడ స్టేషన్ వచ్చేసింది. తోటి ప్రయాణికులు వారిని లేపి దువ్వాడ స్టేషన్లో దిగుతామన్నారు కదా అని చెప్పడంతో వారు కంగారు పడి లేచి కదిలిపోతున్న రైలు నుంచి ప్లాట్‌ఫాం వైపు కాకుండా రెండో వైపున మొదట వెంకటరమణరావు తన చేతిలో ఉన్న బ్యాగును బయటకి విసిరి గాభరాగా దిగి ప్రమాదవశాత్తూ రైలు చక్రాల మధ్యలో ఇరుక్కున్నాడు. తన భర్త కూడా దిగిపోయాడనుకొని భార్య నాగమణి కూడా దిగి చక్రాల కింద నలిగిపోయింది. ఇద్దరి శరీరాలు నుజ్జనుజ్జయ్యాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విశాఖపట్నం జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మృతదేహాలను సొంత ఊరైన వెదుళ్లవలసలకు ఆదివారం సాయంత్రానికి తీసుకువచ్చారు. ఇక్కడే విశాఖ పట్నానికి చెందిన సీఆర్పీఎఫ్ సిబ్బంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. వెంటరమణరావు, నాగమణి దంపతులకు ఇద్దరు మగపిల్లలున్నారు. పెద్దవాడు పవన్ సాయి కృష్ణ మద్రాసులో విట్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకైన నేతాజీ వెంకటసాయి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఒకే ఇంటిలో ఇద్దరు భార్యభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఆడుకోవడానికి వచ్చేశాడు...
విజయనగరం క్రైమ్: గతంలో విజయనగరంలో ఉండి ఇప్పుడు విశాఖ మధురవాడలో నివాసముంటున్న నిరంజన్ అనే బాలుడు ఆడుకోవడానికి స్నేహితులెవరూ లేకపోవడంతో విజయనగరం వచ్చేశాడు. శుక్రవారం స్థానిక తోటపాలెంలో చిన్నారి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మహిళా పోలీసులు ఎం. లెనినా, కె. మణికంఠ మహేశ్వరి గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. పుస్తకం కొనుక్కుంటానని అమ్మకు రూ. 30 అడిగి విజయనగరం బస్సెక్కి వచ్చేశాని బాలుడు తెలపడంతో స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీఐ ఎర్రంనాయుడు బాలుడి తండ్రి మల్లేశ్వరరావుకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు రావడంతో పోలీసులు చిన్నారిని అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : ఆదుకోవాల్సిన కొడుకులు అర్ధంతరంగా కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డల బంగారు భవిష్యత్ కోసం తాము వలసపోయి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటూ... బిడ్డల మృతి వార్త విని స్వగ్రామానికి రావాల్సి వచ్చిందిరా భగవంతుడా.. అని రోదిస్తుంటూ చూపురుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. విద్యా ర్థుల మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మండలంలోని ఆరికతోట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్ అలియాస్ సంతోష్, దత్తి ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసిందే. టిఫిన్ చేయడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు రామభద్రాపురం వైపు వెళ్తుండగా మరో మిత్రుడు ఈదుబిల్లి లోకేష్ ఎదురయ్యాడు. దీంతో వారు వాహనం ఆపి లోకేష్‌తో మాట్లాడుతుండగా.. విజయనగరం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న ట్యాంకర్ వీరిని ఢీ కొట్టడంతో హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న హరిశ్చంద్రప్రసాద్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి అదేరోజు సాయంత్రానికి గ్రామానికి చేరుకోగా... వేరే ప్రాంతంలో ఉన్న ఈశ్వరరావు తల్లిదండ్రులు కూడా ఆదివారం రాత్రికే గ్రామానికి చేరుకుని కుమారుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత చదువులు చదివి..మమ్మల్ని పోషిస్తావనుకుంటే.. అర్ధంతరంగా వెళ్లిపోయావా.. నాయినా.. అంటూ మృతుల తల్లిదండ్రులు విలపిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. దసరా పండగ మా జీవితాల్లో చీకటి నింపిందంటూ భోరుమన్నారు. ఇద్దరు స్నేహితుల మృతదేహాలకూ పక్కపక్కనే చితి పేర్చి సోమవారం దహనసంస్కారాలు చేపట్టారు. గంట తర్వాత పయనం.. చెన్నైలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు ఆదివారమే ఈశ్వరరావు బయలుదేరాల్సి ఉంది. శనివారం రాత్రే దుస్తులు, ఇతర సరంజామా సర్దుకున్నాడు. అయితే ఆదివారం ఉదయాన్నే అతడి బంధువొకరు రేషన్ సరుకులు తీసుకురావాలంటూ పురమాయించారు. ఇంతలో హరిశ్చంద్రప్రసాద్ వచ్చి టిఫిన్‌కు వెళ్దామని రమ్మని కోరడంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరూ రామభద్రాపురం వైపు బయలుదేరారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా... ట్యాంకర్ ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. గంట ఆగితే తమ బిడ్డ తమ వద్దకు వచ్చేవాడని.. కాని విధి కన్నెర్ర చేయడంతో తామే కుమారుడి మృత దేహం చూడడానికి రావాల్సి వచ్చిందని ఈశ్వరరావు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అండగా ఉన్నాడని హత్య
సాక్షి, డెంకాడ(విజయనగరం) : మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారికి ఆనుకుని అరుణోదయ స్టీల్స్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఈనెల 25వ తేదీన శవమైన కనిపించిన అంబటి నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో అశోక్ నగర్‌కు చెందిన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజలు అన్నదమ్ములు. వీరు పందుల పెంపకం చేపడుతూ కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. పైడిరాజు వద్ద అంబటి నాగరాజు, సురేష్ పందుల కాపర్లుగా పని చేస్తున్నారు. డెంకాడ మండలంలోని పద్మావతినగర్ లే అవుట్లో చిన అప్పన్న, పైడిరాజులకు చెందిన పందులు పక్కపక్కనే ఉంచుతున్నారు. దీంతో పందులు ఉంచే స్థలంతో పాటు కొన్ని పందులు కనిపించకుండా పోతున్న విషయంలో ఇద్దరు అన్నదమ్ములైన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజుల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడం.. అది కాస్త కొట్లాటకు దారితీయడంతో ఆసనాల పైడిరాజు గాయపడ్డాడు. వివాదం సమయంలో గాయపడిన పైడిరాజుకు అండగా అంబటి నాగరాజు ఉన్నాడన్న కోపంతో చిన అప్పన్నతో పాటు కుమారులు ఆసనాల శివ, కల్యాణ్‌లు నాగరాజుపై కోపం పెంచుకున్నారు. దీంతో తండ్రీ కొడుకులైన చినఅప్పన్న, శివ, కల్యాణ్‌లు నాగరాజును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదునుగా ఈనెల 24వ తేదీ రాత్రి దాసన్నపేట రింగ్‌రోడ్డు వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద వాహనంపై వస్తున్న అంబటి నాగరాజును శివ, కల్యాణ్‌లు అడ్డుకుని వారి ద్విచక్ర వాహనంపై పందులు ఉంచే పద్మావతినగర్ లే అవుట్లోకి తీసుకువచ్చారు. అక్కడ శివ, కల్యాణ్‌లు అంబటి నాగరాజుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైరుతో ఉరి వేసి చంపేసి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై వేసుకుని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని ఆరుణోదయ స్టీల్స్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో పడేశారు. కొడుకు కనిపించకపోవడంతో అంబటి నాగరాజు తల్లి చల్లమ్మ డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరాజు మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో డెంకాడ ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఆసనాల శివ, కల్యాణ్‌లను చొల్లంగిపేట ప్రాంతంలో పట్టుకోగా.. వారి తండ్రి చిన అప్పన్న డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో ముగ్గురిపై ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్షించేందుకు వెళ్లి..
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం): మండలంలోని పోతనాపల్లి శివారు కృష్ణంరాజు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు దిగిన విశాఖ డెయిరీ పాలకేంద్రం–2 అధ్యక్షుడు కూనిరెడ్డి సత్తిబాబు (58) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుని బంధువులు, ప్రత్యక్షసాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పోతనాపల్లి గ్రామానికి చెందిన చలుమూరి ప్రసాద్ తన గేదెలను గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల వైపు మేత కోసం తీసుకెళ్లాడు. ఉదయం 11.30 గంటల సమయంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కృష్ణంరాజు చెరువులో గేదెలు దిగాయి. అయితే గేదెలు ఒడ్డుకు రాకపోవడంతో ప్రసాద్ చెరువులో దిగి వాటిని తోలే ప్రయత్నంలో మునిగిపోసాగాడు. ఇంతలో ఒడ్డున ఉన్న ప్రసాద్ భార్య తన భర్త మునిగిపోతున్నాడంటూ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్, కూనిరెడ్డి సత్తిబాబులు చెరువులో దిగారు. మునిగిపోతున్న చలుమూరి ప్రసాద్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకుని వస్తున్న క్రమంలో కూనిరెడ్డి సత్తిబాబు చెరువులో మునిగిపోయాడు. ప్రసాద్‌ను మాత్రం కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్‌లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తీరా చూస్తే చలుమూరి ప్రసాద్‌ను రక్షించేందుకు దిగిన కూనిరెడ్డి సత్తిబాబు మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే మళ్లీ చెరువులో దిగి మునిగిపోయిన సత్తిబాబును ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రైవేట్ వాహనంలో హుటాహుటిన ఎస్.కోట పట్టణంలో గల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ డాక్టర్ మహర్షి కూనిరెడ్డి సత్తిబాబుని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో ఆస్పత్రి ఆవరణ మృతుని బంధువుల రోధనలతో మిన్నంటింది. అప్పుడే ఇంటి వద్ద స్నానం చేసి బయటకు వచ్చిన కూనిరెడ్డి సత్తిబాబు తన సోదరి కుమారుడు ప్రసాద్ చెరువులో మునిగిపోతున్నాడని తెలిసి రక్షించేందుకు దిగి తను విగతజీవిగా మారాడాంటు భార్య రమణమ్మ, బంధువులు, పోతనాపల్లి గ్రామస్తులు బోరున విలపించారు. మృతుని సోదరుడు కూనిరెడ్డి వెంకటరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు.. మృతిచెందిన కూనిరెడ్డి సత్తిబాబు గ్రామంలోని విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘం – 2 అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. గ్రామ ప్రజలు, బంధువులు అందరితో సత్తిబాబు ఎంతో చనువుగా ఉంటూ సౌమ్యుడిగా పేరు పొందారు. ఈయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఉన్న దుకాణాలు మూసివేశారు. -
నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి
సాక్షి, విజయనగరం: చిన్న పిల్లలకు సంబంధించిన నులి పురుగుల నివారణ ముందు బిళ్లలు వికటించి రెండు సంవత్సరాలు బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలో కె. రామినాయుడు వలసలో జరిగింది. కడుపులో నులి పురుగులు పోవడం కోసం నానమ్మతో కలిసి అంగన్ వాడీ సెంటర్‌కి వెళ్లిన జస్విక్ నాయుడు ట్యాబ్లెట్ మింగిన పది నిమిషాలకు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పందించిన స్థానికులు బాలుడిని ఆటోలో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జస్విక్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. -
తల్లి మందలించిందని.. ఆత్మహత్య
సాక్షి, విజయనగరం టౌన్ : వ్యసనాలకు బానిసకావద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. దీనికి సం బంధించి రూరల్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక సుంకర వీధికి చెందిన కె.రాజశేఖర్ (20) భవన నిర్మాణం జరుగుతున్న సైట్లో వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాది కిందట కల్యాణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత వ్యసనాలకు బానిసై కుటుంబ సభులతో ఎప్పుడూ తగాదాలు పడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లి మందలించడంతో ఏడుస్తూ వెళ్లిపోయి పద్మావతీనగర్ ధర్మపురి గాయత్రీనగర్ సమీపంలో సైట్పక్కన గుడిసెలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ఫక్రుద్దీన్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సాక్షి, విజయనగరం : మరణాంతరం ఆ యువకుడు అందరిలో సజీవంగా నిలిచాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుల కోరిక మేరకు తమ బిడ్డ నేత్రాలను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో విటి అగ్రహారంలో నివాసముంటున్న మజ్జి గణేష్ (22) డిగ్రీ పూర్తి చేసి, స్థానిక జెరాక్స్ షాపులో పని చేస్తున్నాడు. ప్రతీ రోజూ జిమ్‌కు వెళ్లడం అలవాటుగా ఉన్న గణేష్ రోజూలాగే శుక్రవారం ఇంటి నుంచి జిమ్‌కు బయలుదేరాడు. స్థానిక ప్రదీప్‌నగర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌పై వెళ్తున్న గణేష్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గణేష్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గణేష్ తండ్రి శ్రీనివా సరావు జ్యూట్ మి ల్లులో కార్మికునిగా పని చేసి మిల్లు మూసేయడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దల కోరిక మేరకు గణేష్ నేత్రాలను దానం చేశారని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, విజయనగరం : ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని జియ్యమ్మ మండలం గవరమ్మపేట జంక్షన్ వద్ద జరిగింది. గుమ్మ లక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి జియ్యమ్మవలస వైపు పదిమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించి క్షతగాత్రులను పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరడాని సత్యవతి అనే మహిళ మృతిచెందింది. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకే చచ్చిపోవాలనిపించింది
సాక్షి,గంటస్తంభం(విజయనగరం) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సక్రమంగా చూసుకోవడం లేదన్న వేదన ఒకవైపు... తన బాధ చెప్పినా అధికారులు స్పందించడం లేదన్న ఆవేదన మరోవైపు.. ఆ వివాహితను మానసికంగా కుంగదీసింది. తన బాధను మరోసారి అధికారులకు చెప్పుకుందామని, అప్పటికీ పరిష్కారం కాకుంటే తనవు చాలిద్దామన్న మానసిక సంఘర్షణ మధ్య ఆమె కలెక్టరేట్లో అడుగుపెట్టింది. అధికారులకు మరోసారి తన సమస్య చెప్పుకుంది. అయితే పరిష్కారం లభిస్తుందని, తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం కోల్పోవడంతో ఏకంగా ప్రాణం తీసుకుందామని అత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే... బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర అదే గ్రామానికి చెందిన రాపాక ఈశ్వరరావును ప్రేమించి నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకుంది. అయితే భర్త ఈశ్వరరావు తనను సక్రమంగా చూడడం లేదని సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తన ఆవేదన మొత్తం వినతిపత్రం రూపంలో రాసుకున్న ఆమె ఫిర్యాదును కలెక్టరు ఎం. హరి జవహర్‌లాల్‌కు ఇచ్చింది. గ్రామానికి చెందిన ఈశ్వరరావు, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భవతి అయ్యానని... అయితే ఈశ్వరరావు పెళ్లికి అంగీకరించకపోవడంతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. దీంతో పోలీసులు ఈశ్వరరావుకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ ఏడాది ఏప్రిల్ 19న సింహాచలంలో వివాహం చేసుకున్నామని వివరించింది. అయితే అప్పటి నుంచి తనను అత్తవారింటికి తీసుకెళ్లలేదని... పైగా బలవంతంగా మందులు వేయించి గర్భస్రావం చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ కుమారుడ్ని వదిలేయాలని అత్తమామలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పొందుపరిచింది. చీమల మందు తినేసిన బాధితురాలు.. ఇదిలా ఉంటే అధికారులకు తన గోడు చెప్పుకుంటున్న బాధితురాలు ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న చీమలమందు తినేసింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి సపర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఉషశ్రీ,, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో స్పందించడంతో బాధితురాలికి ప్రాణహాని తప్పింది. ఇదిలా ఉండగా బాధితురాలి సమస్య పరిష్కరించాలని, వసుంధర భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు పోలీసులను ఆదేశించారు. -
ప్రాణాలు తీసిన స్టాపర్
సాక్షి, తగరపువలస(విజయనగరం) : వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన భీమిలి మండలం దాకమర్రి సమీపంలో విజయనగరం వెళ్లే రోడ్డులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా సాలూరు చింతల వీధికి చెందిన తిరుమలేశ(21), బాడాన హేమంత్ కుమార్(30) ఆదివారం ఉదయం విశాఖపట్నం ద్విచక్ర వాననంపై వచ్చా రు. తిరిగి ఆదివారం అర్ధరాత్రి తిరుగుప్రయాణమయ్యారు. విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీలో ఉంటున్న తిరుమలేశ అమ్మమ్మ ఇంటి వద్ద రాత్రికి ఉండిపోయి తెల్లవారి స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో రాత్రి 1:50 గంటల సమయంలో దాకమర్రి రఘు కళాశాల వద్ద వేగ నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తిరుమలేశ సంఘటన స్థలంలోనే మరణించంగా, తీవ్రంగా గాయపడిన హేమంత కుమార్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సింహగిరి ప్రదక్షిణ బందోబస్తులో ఉండటంతో విషయం అలస్యంగా తెలిసింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బు ఇవ్వలేదని కొట్టి చంపేశారు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : మండలంలోని నారసింహునిపేట సమీపంలో నంద చెరువు వద్ద సీతానగరం మండలం గుచ్చిమికి చెందిన దుస్తుల వ్యాపారి కింతలి నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని ఏఎస్పీ గౌతమీశాలి ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజుల వ్యవధిలో ఛేదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. కింతలి నాగేశ్వరరావు దుస్తులు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన బలగ రామినాయుడుకు రూ. రెండు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల కాలంలో తన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని తరచూ నాగేశ్వరరావు అడుగుతుండడంతో రామినాయుడు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా నాగేశ్వరరావును అంతమొందించాలని భావించిన రామినాయుడు తనకు తెలిసిన సుంకరి వాసు, జాగాన సత్యనారాయణలతో బేరం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించి.. హత్య చేసిన తర్వాత రూ. 75 వేలు ఇవ్వడానికి రామినాయుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులు ముందుగా కింతలి నాగేశ్వరరావు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రెక్కీ నిర్వహించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి నారసింహునిపేట వైపు నాగేశ్వరరావు వస్తాడని నిర్ణయించుకున్న నిందితులు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న నాగేశ్వరరావుపై నిందితులు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి రెండు ఉంగరాలు, పర్స్, సెల్‌ఫోన్ తీసుకెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సమీపంలోని మూడు పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందనలు.. హత్య కేసును త్వరగా ఛేదించిన బొబ్బిలి, బాడంగి, సీతానగరం ఎస్సైలు వి. ప్రసాదరావు, బి. సురేంద్ర నాయుడు, జి.కళాధర్‌తో పాటు బొబ్బిలి నూతన ఎస్సై ఎస్. కృష్ణమూర్తి, బొబ్బిలి ఏఎస్సైలు బీవీ రమణ, వై. మురళీకృష్ణ, జి. శ్యామ్‌సుందరరావు, పీసీలు కె. తిరుపతిరావు, యు. తాతబాబునాయుడు, బి. కాసులరావు, వి. శ్రీరామ్, వై. శ్యామలరావు, కె.పూడినాయుడులను ఏఎస్పీ అభినందించారు. -
బంగారమే టార్గెట్
విజయనగరం టౌన్: నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లలో, కొద్ది రోజులుగా ఎవరూ లేకుండా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కేవలం బంగారు నగలే టార్గెట్‌గా, అంతుచిక్కని రీతిలో సాగుతున్న ఈ దొంగతనాలను తలచుకుంటే ప్రజలు హడలిపోతున్నారు. రెండురోజుల క్రితం కంటోన్మెంట్‌లోని ఉడా కాలనీ ఫేజ్–4లో జరిగిన దొంగతనం నుంచి తేరుకోక ముందే, అదే ప్రాంతంలో మరో చోట రెండిళ్లలో వరుస చోరీలు జరిగాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఎవరైనా కనపడితే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు పలు వివరాలు తెలిపారు. అభరణాలే లక్ష్యం.. సోమవారం రాత్రి ఉడా కాలనీ ఫేజ్–4లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడ్డారు. విశాఖలోని యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తున్న విక్రమ్ సోమవారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఎదురుగా ఉన్న అత్తవారింటికి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు. రూ.5 వేల నగదు, ఆభరణాలు పట్టుకుని ఎవరో పరారయ్యారు. అలాగే మెప్మా పీడీ లక్ష్మణరావు ఎంఐజీ– 21లో నివాసం ఉంటున్నారు. పనిమీద శ్రీకాకుళం వెళ్లారు. ఇంట్లో ఒక్కరే ఉండడాన్ని గమనించిన దొంగలు సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. విధులు నిర్వహించుకుని మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆయన ఇంటి తలుపులు తెరిచి, గడియ విరగ్గొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న రూ.8 వేల నగదు, రెండున్నర తులాల బంగారం పోయినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, ఇంకా తమకు ఫిర్యాదు చాలా మంది బాధితుల నుంచి అందలేదని ఎస్ఐ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన మద్యం వివాదం
విజయనగరం, మక్కువ: భార్యాభర్తల మధ్య వివాదం భర్త ప్రాణం తీసింది. మద్యం రోజూ తాగుతున్నాడని భర్తను భార్య మందలించగా...మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భర్త శుక్రవారం మామిడి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన మక్కువ మండలం శంబర గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... మండలంలోని శంబర గ్రామానికి చెందిన లావేటి జయకు ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన బి.ప్రభాకరరావుతో 18 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రభాకరరావు లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ప్రభాకరరావుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 17న భార్యాభర్తల మధ్య మద్యం తాగడంపై గొడవ జరిగింది. అదే రోజు జయ గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతుంది. ప్రభాకరరావు గురువారం భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి తిరిగి శంబర గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు తువ్వాలుతో ఉరి వేసుకొని మృతి చెందాడు. స్థానికులు పొలంకు వెళ్తూ ప్రభాకరరావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులకు, గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్ ఎస్ఐ షేక్‌శంకర సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టారు. పరుగుపరుగున... భర్త మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న భార్య జయ సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శంబర గ్రామానికి పరుగుపరుగున చేరుకొంది. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. వీరి పెద్ద కుమారుడు ప్రకాష్ ఎనిమిదో తరగతి, చిన్నబ్బాయి మోహన్ ఆరో తరగతి చదువుతున్నారు. ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు.