విజయనగరం, రాయగడ: ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రాయగడలో రోప్ వే బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి నాగావళి నదిలో పడి మృతి చెందాడు. రాయగడ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన 13మంది వ్యక్తులు రాయగడ మజ్జిగౌరి దర్శనానికి మంగళవారం వచ్చి మొక్కుబడులు తీర్చుకున్న పిదప రాయగడకు 4కిలోమీటర్ల దూరంలో గల చెక్కగుడ ప్రాంతంలో రోప్ వే బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు పర్యటించేందుకు వీలు లేదంటూ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నిషేధపు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కొత్తవలసకు చెందిన 13మంది వ్యక్తులు రోప్ వే బ్రిడ్జిపైకి వెళ్లి నాగావళి నదిని ఆ ప్రాంతపు సౌందర్యాలను తిలకిస్తున్నారు.
అయితే వారిలో టి.గంగరాజు అనే వ్యక్తి మొబైల్‌లో సెల్ఫీ తీసుకుంటూ అదుపు తప్పి 100మీటర్ల ఎత్తు నుంచి నాగావళి నదిలో పడిపోయాడు. మిగిలిన స్నేహితులు వేసిన కేకలకు చెక్కగుడ ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో తక్షణం అగ్నిమాసక సిబ్బంది, చెక్కగుడ ప్రజలు నాగావళి నదిలో వెతికినప్పటికీ లాభం లేకపోయింది. 3, 4గంటల తరువాత గంగరాజు మృతదేహం మర్రిగుడ గ్రామ ప్రాంతంలో లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విభిన్న జిల్లాల వారు మృతి చెందినప్పటికీ, ప్రమాదకరమని తెలిసి కూడా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment