కేంద్రాస్పత్రి వద్ద రోదిస్తున్న మదీన్ కుటుంబ సభ్యులు, పెళ్లిలో మదీన్
విజయనగరం టౌన్/చీపురుపల్లి: వదువు నచ్చలేదని మనస్తాపం చెందిన ఓ నవవరుడు పెళ్లైన మూడు రోజులకే ఉరేసుకుని మృతి చెందిన సంఘటన విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ బీవీజే రాజు అందించిన వివరాల ప్రకారం..
పట్టణంలోని బాబామెట్టకు చెందిన షేక్ మదీన్ చీపురుపల్లి మండలం పెదనడిపల్లి వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఈ నెల 2న వివాహం జరిగింది. విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలో సాలూరుకు చెందిన మహ్మద్ ముబీనాతో వివాహమైంది. అదేరోజు సాయంత్రం విజయనగరంలోని సింగపూర్ సీటీలో ఉన్న నివాసానికి వచ్చారు. మరుసటి రోజు సోమవారం ఉదయం లేచిన దగ్గర నుంచి మదీన్ డల్‌గా, ఆలోచనలో ఉండడాన్ని తల్లి షహీదాబేగమ్ పసిగట్టింది. ఎందుకు అలా ఉన్నావని ప్రశ్నించగా పెళ్లికుమార్తె ముఖంపై మచ్చలున్నాయని, అందంగా లేదని, నచ్చలేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లి కోడల్ని చర్మవ్యాధి నిపుణుల వద్దకు తీసుకెళ్లి చూపించారు. కానీ మంగళవారం కూడా కొడుకు దిగాలుగా ఉండడాన్ని చూసి తల్లి ఓదార్చింది.
రిసెప్షన్ రోజే..
పెళ్లై మూడోరోజు రావడంతో ఊర్లో ఉన్న బంధువులకు మంగళవారం రాత్రి రిసెప్షన్ ఇచ్చేందుకు మదీన్ కుటుంబీకులు సిద్ధం అవుతున్నారు. ఆ సమయంలో ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మదీన్ బాబామెట్ట ఎంఐజీ 84లో నివాసం ఉంటున్న మిత్రుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మరో ఆలోచన లేకుండా ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలియని రిసెప్షన్ ఉంచుకుని కొడుకు ఎక్కడికి వెళ్లాడో వెతకాల్సిందిగా మృతుని స్నేహితులకు ఫోన్‌లో చెప్పింది. వారంతా మదీన్‌కు ఫోన్‌లు చేయగా ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో బాబామెట్ట ప్రాంతంలో ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు విగత జీవుడై కనిపించాడు. అయినప్పటికీ స్నేహితులు సపర్యలు చేసి, పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మదీన్‌కు తల్లితో పాటు ఓ చెల్లెలు ఉన్నారు.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు..
కేంద్రాస్పత్రి వద్ద కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మదీన్ బంధువులు, భార్యతరపు వారు అక్కడకు చేరుకోవడంతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయిని కాకుండే వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన కారణంగానే మదీన్ ఆత్మహత్య చేసుకున్నారని తల్లి చెప్పినట్లు సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
రెవెన్యూ వర్గాల్లో అలజడి..
మదీన్ మృతి వార్తను తెలుసుకున్న చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఆయన పని చేస్తున్న గ్రామ ప్రజలు విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బీటెక్ విద్యను అభ్యసించిన మదీన్ అందరితో బాగా ఉంటూ చక్కగా విధులను నిర్వహిస్తుండేవాడని వారు చెబుతున్నారు. రిసెప్షన్‌కు వస్తున్నామని కూడా మదీన్‌కు తాము చెప్పినట్లు తహసీల్దార్ ముక్తేశ్వరరావు, వీఆర్‌ఓలు పేర్కొంటున్నారు. ఆయనతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment