కొసిరెడ్డి రమణ (ఫైల్)
విజయనగరం, గుర్ల: ఆటోలో మరిచిపోయిన ఫోన్‌ను తీసుకురావడానికి వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని పాచలవలసకు చెందిన కొసిరెడ్డి రమణ జిల్లా కేంద్రంలోని ఏజీఎల్ కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. రోజులాగానే శుక్రవారం కూడా గ్రామం నుంచి ఆటోలో కళాశాలకు వెళ్లడానికి బయలుదేరాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మిత్రుడితో ఫోన్‌లో మాట్లాడి బస్సు ఎక్కడుందో తెలుసుకున్నాడు. గూడెం జంక్షన్ వద్ద ఆటో దిగి కళాశాలకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. అయితే బస్సు ఎక్కిన తర్వాత తన ఫోన్ ఆటోలో మరిచిపోయానని గ్రహించిన రమణ వెంటనే బస్సు దిగి ఆటో కోసం రోడ్డు దాటుతుండగా.. గరివిడి నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు ఈశ్వరరావు, బంగారులక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment