
మృతిచెందిన ఆశాజ్యోతి
విజయనగరం ,గంట్యాడ: పెళ్లై భార్య, పిల్లలు ఉన్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చేస్తున్న ఒత్తిడి ఓ వైపు. మా ఆయన్ని పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా అంటూ ఆయన భార్య తిడుతున్న తిట్లు మరోవైపు. వీటిని తట్టుకోలేక పోయింది ఆ యువతి. ఇంక ఈ వేదనను భరించలేనంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని 20 ఏళ్లకే బలిపెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రామభద్రపరరం గ్రామానికి చెందిన సియ్యాదుల ఆశాజ్యోతి (20)ని ఆమె సమీప బంధువైన వేపాడ మండలం బానాదికి చెందిన దండ ఆంజనేయులు పెళ్లి చేసుకోవాల్సిందిగా రోజూ ఇబ్బంది పెట్టేవాడు.
ఆయనకు ఇది వరకే పెళ్లైంది. దీంతో కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసేందుకు నిరాకరించారు. ఆయన భార్య ఒక రోజు వచ్చి ఈ విషయంలో ఆశాజ్యోతిని తిట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె సెప్టెంబర్ 27న ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న ఆమె బామ్మ చూసి కేకలు వేయడంతో స్థానిక యువకులు వచ్చి ఆమెను కిందికి దించి సపర్యలు చేశారు. అనంతరం చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కానీ సోమవారం ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణరావు తెలిపారు. కేసు దర్యాప్తు చేసి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment