శంబర గ్రామ శివారులో మామిడిచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రభాకరరావు
విజయనగరం, మక్కువ: భార్యాభర్తల మధ్య వివాదం భర్త ప్రాణం తీసింది. మద్యం రోజూ తాగుతున్నాడని భర్తను భార్య మందలించగా...మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భర్త శుక్రవారం మామిడి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన మక్కువ మండలం శంబర గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... మండలంలోని శంబర గ్రామానికి చెందిన లావేటి జయకు ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన బి.ప్రభాకరరావుతో 18 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రభాకరరావు లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ప్రభాకరరావుకు మద్యం తాగే అలవాటు ఉంది.
ఈ నెల 17న భార్యాభర్తల మధ్య మద్యం తాగడంపై గొడవ జరిగింది. అదే రోజు జయ గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతుంది. ప్రభాకరరావు గురువారం భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి తిరిగి శంబర గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు తువ్వాలుతో ఉరి వేసుకొని మృతి చెందాడు. స్థానికులు పొలంకు వెళ్తూ ప్రభాకరరావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులకు, గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్ ఎస్‌ఐ షేక్‌శంకర సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టారు.
పరుగుపరుగున...
భర్త మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న భార్య జయ సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శంబర గ్రామానికి పరుగుపరుగున చేరుకొంది. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. వీరి పెద్ద కుమారుడు ప్రకాష్ ఎనిమిదో తరగతి, చిన్నబ్బాయి మోహన్ ఆరో తరగతి చదువుతున్నారు. ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment