‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ.. | Wife And Husband Died In Train Accident In Vizianagaram | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి దంపతులు కన్నుమూత

Published Mon, Nov 11 2019 9:00 AM | Last Updated on Mon, Nov 11 2019 9:00 AM

Wife And Husband Died In Train Accident In Vizianagaram - Sakshi

అధికార లాంచనాలతో అంత్యక్రియలు

చక్కనైన ఉద్యోగం... అనుకూలవతి అయిన భార్య... ఇద్దరు పిల్లలూ సరస్వతీ కటాక్షం ఉన్నవారే. ఇంజినీరింగ్‌లో ఉన్నత చదువులు చదువుతున్నవారే... చీకూ చింతా లేని జీవనం. ఎలాంటి సమస్యలూ లేని ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో... నిద్రమత్తు రూపంలో ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడలో నిద్రమత్తులో రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ వాటికింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆ దంపతులను చూసి కన్నీరు పెట్టనివారంటూ లేరు. 

సాక్షి, గరివిడి(విజయనగరం): కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబంతో కలసి చేసుకోవాలని సుదూరం నుంచి వచ్చిన ఆ దంపతులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్న ఆయన... నిరంతరం ఆయన్నే అంటిపెట్టుకునే భార్య ఒకేసారి కన్నుమూయడంతో గరివిడి మండ లం వెదుళ్లవలసలో విషాదం అలముకుంది. కనురెప్పపాటులో జరిగిన దుర్ఘటనలో వారిద్దరూ శవాలుగా మారడంతో తమ పిల్లలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో వెదుళ్లవలస గ్రామా నికి చెందిన కాపరోతు వెంకటరమణరావు(48) ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌(సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌) హెచ్‌సీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య నాగమణి(40)తో కలసి అక్కడే నివాసం ఉంటున్నారు. కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవాలని ఛత్తీస్‌గఢ్‌ నుంచి సికింద్రాబాద్‌ – భువనేశ్వర్‌ వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌లో వస్తున్నారు. ముందుగా నాగమణి కన్నవారి ఊరైన దువ్వాడలో దిగి వెదుళ్లవలస రావాలని వారు భావించారు.

వారు ఏసీ బోగీలో ప్రయాణిస్తూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఆదివారం వేకువజాము మూడు గంటలయ్యేసరికి దువ్వాడ స్టేషన్‌ వచ్చేసింది. తోటి ప్రయాణికులు వారిని లేపి దువ్వాడ స్టేషన్‌లో దిగుతామన్నారు కదా అని చెప్పడంతో వారు కంగారు పడి లేచి కదిలిపోతున్న రైలు నుంచి ప్లాట్‌ఫాం వైపు కాకుండా రెండో వైపున మొదట వెంకటరమణరావు తన చేతిలో ఉన్న బ్యాగును బయటకి విసిరి గాభరాగా దిగి ప్రమాదవశాత్తూ రైలు చక్రాల మధ్యలో ఇరుక్కున్నాడు. తన భర్త కూడా దిగిపోయాడనుకొని భార్య నాగమణి కూడా దిగి చక్రాల కింద నలిగిపోయింది. ఇద్దరి శరీరాలు నుజ్జనుజ్జయ్యాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విశాఖపట్నం జీఆర్‌పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 
మృతదేహాలను సొంత ఊరైన వెదుళ్లవలసలకు ఆదివారం సాయంత్రానికి తీసుకువచ్చారు. ఇక్కడే విశాఖ పట్నానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. వెంటరమణరావు, నాగమణి దంపతులకు ఇద్దరు మగపిల్లలున్నారు. పెద్దవాడు పవన్‌ సాయి కృష్ణ మద్రాసులో విట్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ ద్వీతీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకైన నేతాజీ వెంకటసాయి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఒకే ఇంటిలో ఇద్దరు భార్యభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వెంకటరమణరావు, నాగమణి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement