తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలు
విజయనగరం, బొబ్బిలి: దీపావళి పండుగ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బతుకులను చీకటిమయం చేస్తుంది. పట్టణంలోని తారకరామా కాలనీలో బాణసంచా విక్రయించే కుటుంబంలో మాత్రం రెండు ప్రాణాలు గాలిలో కలసి పోగా మిగిలిన ముగ్గు రు పిల్లల జీవితాలను చీకటి మయం చేసింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని చిన్నారులు బేలచూపులు చూస్తున్నారు. పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన చుక్క త్రినాథరావు లారీ డ్రైవర్‌గా పని చేయడంతో పాటు తారాజువ్వలు తయారు చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు కూడా బాణసంచా తయారుచేస్తూ విక్రయిస్తుంటారు. గత నెల 25న త్రినాథరావు, భార్య రమణమ్మ, కుమార్తె తనూజ బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో ఇల్లంతా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ ఆటోలో బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, వైద్యుడు జి. శశిభూషణరావు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గత నెల 28న త్రినాథరావు, ఈ నెల ఆరున రమణమ్మ మృతి చెందారు. దీంతో పిల్లలు సాయి, నందిని, తనూజ అనాథలయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తనూజ ప్రస్తుతం కోలుకుంటున్నా తల్లిదండ్రుల మృతితో మనోవేదనకు గురైంది. గాయపడిన తనూజ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో... నందిని నెల్లిమర్లలో చదువుతున్నారు. సాయి పదో తరగతి పాసై నిరుద్యోగిగా ఉన్నాడు. దీపావళి పండుగ వీరి కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తమను ఆదుకునే ఆపన్నహస్తం కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment