అమ్మకానికి సిద్ధంగా ఉన్న బాణసంచా
తణుకు: జిల్లాలో దీపావళి దందా మొదలైంది. అనుమతుల పేరిట అధికారులు దుకాణదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలారు. జిల్లాలో అధికారికంగా కంటే అనధికారికంగా ఎక్కువ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుని ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
రూ.100 కోట్ల వ్యాపారం
ఏటా రూ.వంద కోట్లు వ్యాపారం జరుగుతుంది.. అయినా నిబంధనలు ఎక్కడా అమలు కావు.. దీపావళి బాణసంచా వ్యాపారం పేరుతో నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకునే వ్యాపారులకు వివిధ శాఖల అధికారులు మామూళ్ల పేరుతో వారిని ముంచేస్తున్నారు. తాత్కాలిక షాపులకు అనుమతులు పేరుతో కొన్నిశాఖల అధికారులు, సిబ్బంది దీపావళి దందాకు దిగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రత్యేక రేటు పెట్టి మరీ దోచేస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించాల్సిన వ్యాపారులు సైతం అధికారులకు మామూళ్లు ఇచ్చేశాం కదా అని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా తయారీ కేంద్రాల్లో 15 కిలోలకు మించి తయారు చేయకూడదనే నిబంధనలు ఉన్నా జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. దీంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో 550 దుకాణాలకు అనుమతులు
జిల్లాలో ఈ ఏడాది తాత్కాలిక దుకాణాల ఏర్పాటు కోసం 550 వరకు అధికారులు అనుమతులు ఇవ్వగా మరో 19 తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే 2 వేల వరకు అనధికార షాపుల ద్వారా దీపావళి రెండ్రోజుల పాటు అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా వారం రోజుల పాటు జరిగే వ్యాపారం జిల్లాలో రూ.వంద కోట్లు పైగా ఉంటుందని అంచనా. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బాణసంచా దిగుమతి చేసుకుంటున్న ఇక్కడి వ్యాపారులు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన హోల్‌సేల్ వ్యాపారులకు ఇక్కడి నుంచే ఎగుమతులు అవుతుంటాయి. అయితే తయారీ కేంద్రాల్లో కేవలం 15 కిలోలకులోపు మాత్రమే బాణసంచా తయారు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో వయ్యేరుగట్టు ఆనుకుని తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాణసంచా తయారీ కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే ప్రాంతంలో 2013లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇదే గ్రామంలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా ప్రమదవశాత్తూ పేలిపోవడంతో ఇద్దరు భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ముడుపులిస్తేనే సర్టిఫికెట్..
బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు, రెవెన్యూ, ఫైర్, ట్రాన్స్‌కో ఇలా ఆయా శాఖలవారీగా డిమాండ్ చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అధికారులకు అడిగిన సొమ్ము ముట్టజెబితేనే నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఏదొక సాకు చెప్పి తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు బ్రోకర్లు అంతా మేం చూసుకుంటామంటూ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధిలో షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఒక్కో వ్యాపారి నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తాత్కాలికంగా షాపు ఏర్పాటు చేసుకోవాలంటే రూ.వెయ్యి చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ మాత్రం స్థానిక ఫైర్ అధి కారులతో పాటు రెవెన్యూ, డివిజన్ పోలీసులు, స్థానిక పోలీసులు, మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఇలా ఒక్కోశాఖ అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలు మీరితే చర్యలు
నిబంధనలు పాటించని బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే 550 తాత్కాలిక షాపులకు అనుమతులు ఇచ్చాం. మరో 19 తయారీ కేంద్రాలు అధికారికంగా ఉన్నాయి. ఎక్కడైనా అనధికారికంగా తయారు చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎ.వి.శంకరరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment