కాటేసిన విధి | Young man Died in Bus Accident Vizianagaram | Sakshi
Sakshi News home page

కాటేసిన విధి

Published Sat, Nov 17 2018 7:27 AM | Last Updated on Sat, Nov 17 2018 7:27 AM

Young man Died in Bus Accident Vizianagaram - Sakshi

విజయనగరం, పద్మనాభం(భీమిలి): విధి చాలా క్రూరంగా కాటేస్తుంది. బావమరిది కుమారుడి అన్న ప్రాసనకు వచ్చిన యువకుడిని మృ త్యువు బస్సు రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకుపోయింది. నెల రోజుల కిందటే అనారోగ్యంతో ఆ యువకుడి ఐదు నెలల కుమారుడు మృతి చెందగా... ఇప్పుడు రోడ్డు ప్ర మాదంలో అతనూ దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భర్తను, బిడ్డను కోల్పోయి ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదిస్తోంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం సమీపంలోని ధర్మపురికి చెందిన పాండ్రంగి శివకృష్ణ(24) విజయనగరం మండలం ముడిదాం సమీపంలోని అంబటివలసకు చెందిన బావమరిది వై.చంద్రునాయుడు కుమారుడు హేమ స్రవంత్‌కి అన్నప్రాసన చేయించడానికి పద్మనాభం మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీ లింగన్నపేటలో ఉన్న గాయత్రి దేవి ఆలయానికి శుక్రవారం వచ్చారు.

కార్యక్రమం అనంతరం శివకృష్ణతో పాటు మరో ముగ్గురు రోడ్డు మీదకు చేరారు. కల్వర్టు వద్ద రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో నేరెళ్లవలస ఏఏఎస్‌ జూట్‌ మిల్లుకు చెందిన బస్సు కోరాడ నుంచి బి.తాళ్లవలస వైపు వెళ్తోంది. ఎదురుగా వస్తున్న స్కార్పియోను తప్పించబోయి బస్సు శివకృష్ణను ఢీకొనగా కల్వర్టుకు బస్సుకు మధ్య ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న ఆయన్ను బయటకు తీసి విశాఖపట్నంలోని మై క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు, ఆయనకు భార్య రామలక్ష్మి ఉంది. శివకృష్ణ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి ఐదు నెలల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందటే మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే భర్త మృతి చెందడంతో భార్య రామలక్ష్మి జీర్ణించుకోలేకపోతోంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement