తండ్రి కత్తివేటుకు బలైన చిన్నారి సునీత నిందితుడు వెంకటరావును స్తంభానికి కట్టేసిన స్థానికులు (ఇన్‌సెట్లో) గాయపడిన వెంకటరావు భార్య గంగులమ్మ
మద్యం తాగొద్దన్నందుకు ఓ తండ్రి మృగాడిగా మారాడు. అందరూ నిద్రపోయే వేళ భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. భార్య గాయాలతో బయటపడగా, తండ్రి కత్తి వేటుకు ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయిన విషాదకర ఘటన కొమరాడ మండలం నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది.
విజయనగరం, కొమరాడ: నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గ్రామం కొమరాడ మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన పల్లె. సుమారు 36 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పొద్దుకుంగితే చాలు అందరూ నిద్రలోకి జారుకుంటారు. అలాంటి పల్లెలో సోమవారం రాత్రి 11 గంటలకు ఓ మానవ మృగం కత్తితో వీరంగం సృష్టించింది. మద్యం సేవించడం అనారోగ్యదాయకమనిచెప్పిన భార్య, కుమార్తెలపై దాడి చేసింది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో పల్లె గొల్లుమంది. విషాదంలో ముని గిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హిమరిక వెంకటరావు మద్యానికి బానిసయ్యాడు.
పోడు వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం సేవించేవాడు. ఇంటికి రూపాయి ఇచ్చేవాడు కాదు. భార్య సంపాదననూ మద్యానికే పోసేవాడు. భార్య, పిల్లల పోషణ పట్టించుకునేవాడు కాదు. మద్యం సేవించొద్దంటూ భార్య గంగులమ్మతో పాటు దేరుపాడు ప్రాథమిక పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న కుమార్తె సునీత(8) తరచూ హితబోధ చేసేవారు. ఇంటిలో సరుకులు లేక పిల్లలు పస్తులతో పడుకున్నారని, మద్యం సేవించొద్దంటూ విన్నవించిన ప్రతీసారీ వెంకటరావు భార్యతో గొడవపడేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంటిలో గొడవ చేశాడు. భార్య, పిల్లలు నిద్రపోయేవేళ రాక్షసత్వంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య గంగులమ్మ కుడి చేయిపై కత్తివేటు పడడంతో పరుగుతీసింది. అదే సమయంలో ఎదురుగా కనిపించిన కుమార్తె సునీత మెడపై కత్తి వేటు వేయడంతో అక్కడికక్కడే మరణించింది. భార్యను హతమార్చేందుకు పరుగుతీస్తుండగా గ్రామస్తులు మేల్కొని వెంకటరావును పట్టుకున్నారు. గ్రామంలోని స్తంభానికి తాడుతోకట్టేసి కొమరాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment